వాననీరు... భవితపై భరోసా!

కరవు అనగానే ప్రధానంగా రెండు అంశాలు చెబుతారు. మొదటిది ఆ ఏడాదిలో వర్షపాత లోటు. రెండోది జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోవడం. దేశాభివృద్ధిని,  రజాజీవనాన్ని ప్రభావితంచేసే కరవును ప్రభుత్వాలుఈ రెండు అంశాలకే పరిమితంచేసి చూడటం సరికాదు. దానివల్ల పూర్తిస్థాయిలో పరిష్కారాలు లభించవు.

Published : 09 May 2024 02:07 IST

కరవు అనగానే ప్రధానంగా రెండు అంశాలు చెబుతారు. మొదటిది ఆ ఏడాదిలో వర్షపాత లోటు. రెండోది జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోవడం. దేశాభివృద్ధిని,  రజాజీవనాన్ని ప్రభావితంచేసే కరవును ప్రభుత్వాలుఈ రెండు అంశాలకే పరిమితంచేసి చూడటం సరికాదు. దానివల్ల పూర్తిస్థాయిలో పరిష్కారాలు లభించవు.

దేశంలో 2002, 2004, 2009 సంవత్సరాల్లో తీవ్రస్థాయి కరవు పరిస్థితులు తలెత్తాయి. మళ్లీ ప్రస్తుత వ్యవసాయ సంవత్సరం (2023 జూన్‌- 2024 మే)లో అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. గడచిన ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం సాగు భూమిలో 25శాతం కరవు కోరలకు చిక్కిందని వాతావరణశాఖ నివేదించింది. తమ రాష్ట్రంలో 66శాతం విస్తీర్ణంలో తీవ్రస్థాయి నీటి ఎద్దడి నెలకొందని మహారాష్ట్ర సర్కారు వెల్లడించింది. కర్ణాటకలో 79శాతం భూభాగంలో క్షామ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ దుర్భర పరిస్థితులే ఉన్నా, ప్రభుత్వం చాలా తక్కువ మండలాలను వర్షాభావ ప్రాంతాలుగా చూపింది. గుజరాత్‌, తమిళనాడు, రాజస్థాన్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ పలుచోట్ల తాగునీటికి కటకట ఏర్పడింది.

వనరుల వినియోగంలో నిర్లక్ష్యం...

వాతావరణశాఖ వెలువరించిన మూడు నాలుగు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే దేశంలో సగటు వర్షపాతంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అంతేగాని, ఏటికేడు వర్షపాతం క్షీణించడం లేదన్న విషయం అర్థమవుతుంది. రుతుపవనాల దోబూచులాట వల్ల ఒకసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి చోటుచేసుకుంటోంది. ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న కర్ణాటక ఇంతకుముందు వరసగా నాలుగేళ్లపాటు వరద తాకిడికి గురైంది. అయితే భూ, జల వనరుల నిర్వహణలో ప్రభుత్వాల వైఫల్యమే ఇటువంటి పరిస్థితులకు దారితీస్తోంది. ముఖ్యంగా, కురిసిన వర్షాన్ని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టుకోలేకపోవటంతో వానలు లేని సమయంలో నీటి కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. దేశంలో మూడు ముఖ్యమైన సాగునీటి వనరులున్నాయి. అవి కాలువలు, బావులు, చెరువులు. కాలువల ద్వారా పంట భూములకు నీరందించే భారీ జలాశయాలు నిండకపోతే నష్ట తీవ్రత ఎంతమేర ఉంటుందో సులభంగా అంచనా వేయవచ్చు. మొత్తం పంట భూమిలో వర్షాధార సాగు అధికం. వర్షం కురిసినప్పుడు భూమి పైపొరల్లో ఉండే తేమే ఈ పంటలకు ఆధారం. అడవుల నరికివేతకు తోడు వాటిని ఆనుకుని ఉన్న బంజరు, బీడు భూములు, పచ్చిక బయళ్లు అన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. దాంతో వర్షాధార క్షేత్రాలు క్రమేణా సేద్యానికి పనికిరాకుండా పోతున్నాయి. కొద్దోగొప్పో వర్షం కురిసినప్పటికీ, తేమను నిలుపుకొనే సామర్థ్యం వాటికి ఉండటంలేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా మరింత తెగ్గోసుకుపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరువులు, బావులు దేశంలో సంప్రదాయ సాగునీటి వనరులు. వర్షపు నీటిని నిలిపి ఉంచుకోవటంతోపాటు ఊట జలాలను నింపుకొనే సామర్థ్యం వీటికి మాత్రమే ఉంటుంది. చెట్లు, మొక్కలు, గడ్డిలేని నేలపై పడుతున్న వర్షంతోపాటు కొట్టుకొస్తున్న మట్టితో ఇవి పూడుకుపోతున్నాయి. నిర్వహణ కొరవడి, కబ్జాలకు గురై ఉనికి కోల్పోతున్నాయి. మరోవైపు బావుల స్థానాన్ని బోరుబావులు ఆక్రమించాయి. కానీ, భూగర్భ జలమట్టాలు పడిపోతుండటంతో అవి నిరుపయోగమవుతున్నాయి. వీటి కోసం భారీగా ఖర్చవుతుండటంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

బహుముఖ చర్యలతోనే...

కరవు పరిస్థితులను సమర్థంగా అధిగమించాలంటే వాన నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. బహుళ ప్రయోజనాలిచ్చే భారీ సాగునీటి ప్రాజెక్టులతోపాటు చిన్ననీటి వనరులకూ ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. నేల స్వభావం, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వరద నీటి వినియోగానికి చిన్నచిన్న ఆనకట్టలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి. అడవులను సంరక్షించుకోవడంతో పాటు బీడు, బంజరు భూములను కాపాడాలి. పాత చెరువులను పునరుద్ధరించి, కొత్తవాటిని నిర్మించాలి. వర్షాభావ పరిస్థితులుండే ప్రాంతాల్లో సంప్రదాయ బావుల వినియోగాన్ని పెంచాలి. బిందు సేద్యం వంటి విధానాలను ప్రోత్సహించాలి. ఇటువంటి బహుముఖ చర్యలతోనే దేశం నుంచి కరవును తరిమేయడం సాధ్యపడుతుంది.

సముద్రాల స్వామినాథ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.