close
Published : 20/01/2022 21:30 IST

పదేళ్లకే కోట్లు సంపాదిస్తోందట!

(Photo: Instagram)

సాధారణంగా పదేళ్ల అమ్మాయంటే ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ విద్యార్థి జీవితాన్ని గడుపుతుంటుంది. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన పిక్సీ కర్టిస్ మాత్రం పదేళ్ల వయసులోనే రెండు కంపెనీలను నడుపుతూ కోట్లు సంపాదిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది ఫాలోవర్లను కూడా సంపాదించుకుంది.

రెండేళ్ల వయసు నుంచే..!

ఆస్ట్రేలియాకు చెందిన రాక్సీ జాసెంకో ఒక బిజినెస్‌ ఉమన్‌. ఆమె ముద్దుల కూతురే పిక్సీ కర్టిస్‌. రాక్సీ తనకు పాప పుట్టగానే పిక్సీ పేరు మీద ఒక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచింది. ఇందులో పిక్సీ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ దానికి ఆసక్తికరమైన క్యాప్షన్లను జోడించేది. వాటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వచ్చేదట. దాంతో పిక్సీ రెండు సంవత్సరాల వయసులోనే వార్తల్లో నిలిచింది. రాక్సీ ఎలాగూ బిజినెస్‌ ఉమన్‌ కావడంతో పిక్సీకి చిన్నప్పటి నుంచే వ్యాపార విషయాల గురించి చెప్పేదట. అదే సయమంలో రాక్సీ ‘Pixie's Bows’ అనే పేరుతో కేశాలంకరణ ఉత్పత్తుల కంపెనీని ప్రారంభించింది.

రెండు రోజుల్లోనే..!

తల్లి అలవాట్లను పుణికిపుచ్చుకున్న పిక్సీ తను కూడా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంది. దీనికి తన తల్లి సహాయం తీసుకుంది. ఈ క్రమంలో గత సంవత్సరం మార్చి నెలలో ‘Pixie’s Fidgets’ పేరిట ఆన్‌లైన్ బిజినెస్ మొదలు పెట్టింది. దీనిద్వారా చిన్న పిల్లలకు సంబంధించిన వివిధ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించింది. అది ఎంత పెద్ద విజయం సాధించిందంటే మొదలుపెట్టిన 48 గంటల్లోనే అందులోని వస్తువులన్నీ అమ్ముడయ్యాయి. దాంతో మొదటి నెలలోనే కోటి రూపాయలకు పైగా సంపాదించిందట. ఇలా మొదటి అడుగులోనే విజయం సాధించడంతో ఆమె తల్లి మొదట ప్రారంభించిన ‘Pixie's Bows’ కంపెనీని కూడా ఇందులో కలిపేసి దానికి ‘Pixie’s Pixs’గా పేరు పెట్టింది. దాంతో పదేళ్లకే పిక్సీ రెండు కంపెనీలకు యజమానిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతంగా ఉన్న దశలోనూ ఈ కంపెనీ ప్రముఖ టాయ్స్‌ రిటైల్‌ కంపెనీగా కొనసాగుతుండడం గమనార్హం.

15 ఏళ్లకే రిటైరవ్వచ్చు..!

తన కూతురు పదేళ్ల వయసులోనే ఇంత ఘనత సాధించినందుకు రాక్సీ ఎంతో గర్వపడుతోంది. ‘మా బంధువులు కొంతమంది జోక్ చేస్తుంటారు.. అదేంటంటే నేను వందేళ్లు వచ్చినా పని చేస్తూనే ఉంటానట.. కానీ పిక్సీ మాత్రం ౧౫ ఏళ్లకే రిటైర్‌ అవుతుందట. దీనిని బట్టి ఎవరు తెలివైన వారో నాకు తెలిసిపోయింది’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే వ్యాపారం కంటే తన కూతురు సంతోషమే ముఖ్యమంటోంది రాక్సీ.  ‘ఎన్ని లాభాలొస్తున్నా మా అమ్మాయి కంపెనీ కోసం మాత్రమే పనిచేయాలని నేను కోరుకోవడం లేదు. పిక్సీ వ్యాపారపరంగా విజయం సాధించినప్పటికీ తన సంతోషమే నాకు ముఖ్యం. ఒకవేళ పిక్సీ కావాలనుకుంటే ౧౫ ఏళ్లకే రిటైర్‌ కావచ్చు’ అంటోంది రాక్సీ.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ...

పిక్సీ వార్తల్లోనే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ చాలా పాపులర్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్సీకి లక్షకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. పిక్సీ తన ఫొటోలతో పాటు తన బిజినెస్‌కు సంబంధించిన ఉత్పత్తులను పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. ఇటీవలే పిక్సీ ‘రూమ్‌ టూర్‌’ అంటూ తన రూమ్‌ని చూపిస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఈ లిటిల్‌ బిజినెస్‌ గర్ల్‌కి బీచ్‌ పక్కన ఇల్లు, గ్యారేజ్‌లో లంబోర్గిని ఎస్‌యూవీ కారు ఉండాలని కోరికట. పిక్సీకి హంటర్‌ అనే ఏడేళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు.

మరి, చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించిన పిక్సీ.. ఇంకా మరెన్నో విజయాలను సాధించాలని కోరుకుందాం!


Advertisement

మరిన్ని