Published : 25/09/2022 13:16 IST

అలసిన చర్మానికి సాంత్వన ఇలా!

కాసేపు పని చేస్తే చాలు.. ఎక్కడ లేని అలసట వచ్చేస్తుంది. ఈ అలసట మిగతా శరీర భాగాలకే కాదు.. చర్మానికీ ఉంటుందంటున్నారు నిపుణులు. అవును.. మనం అంతగా పట్టించుకోం కానీ.. మన చర్మం కూడా అలసిపోతుందట! అందుకు ఉదాహరణే అప్పుడప్పుడు ముఖం వాడిపోయినట్లు కనిపించడం. మరి, అలసిన చర్మం తిరిగి సాంత్వన పొంది తాజాగా మారాలంటే ఏం చేయాలి?? చూద్దాం రండి..

మృతకణాలు తొలగించాలి..

చర్మం అలసిపోయినట్లు కనిపించడానికి సగం కారణం ముఖంపై ఏర్పడే మృతకణాలే. అందుకే వీటిని ఎప్పటికప్పుడు స్క్రబ్ చేస్తూ తొలగించుకుంటే చర్మం తాజాదనం సంతరించుకుంటుంది. చర్మ ఛాయ కూడా మెరుగుపడుతుంది. కనీసం వారానికి ఒకసారైనా ముఖం, చర్మంపై పేరుకున్న మృతకణాల్ని తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం.. ఒక టేబుల్ స్పూను ఓట్స్‌ పొడి, పావు టీస్పూను ఉప్పు తీసుకొని, దీనికి నీళ్లు లేదా ఆలివ్ ఆయిల్ జత చేసి మెత్తని పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమంతో ముఖాన్ని మృదువుగా రుద్దుతూ ముఖంపై పేరుకున్న మురికి, దుమ్ము, మృతకణాల్ని తొలగించుకోవాలి.

ఐస్ థెరపీ

అలసిన చర్మానికి సాంత్వన చేకూర్చడానికి ఐస్‌థెరపీ ఒక చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఈక్రమంలో ఐస్ ముక్కల్ని తీసుకొని ముఖంపై మృదువుగా రుద్దండి. తద్వారా చర్మానికి రక్తప్రసరణ మెరుగై ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

నీళ్లు ఎక్కువగా..

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరానికే కాదు.. చర్మ ఆరోగ్యానికీ మంచిది. శరీరంలో నీటిస్థాయులు తగినంత ఉన్నప్పుడే చర్మం తాజాగా కనిపిస్తుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగడం, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు.. వంటి ద్రవాహారం తీసుకోవడం తప్పనిసరి!

ఉప్పు తగ్గించాలి

మనం తీసుకునే ఆహారంలో ఉప్పు పరిమాణం పెరిగితే కళ్ల కింద క్యారీ బ్యాగులు, నల్లటి వలయాలు రావడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి నిపుణుల సలహా మేరకు ఉప్పును తగిన మోతాదులో తీసుకోవడం అటు ఆరోగ్యానికి, ఇటు అందానికీ మంచిది.

ఇవి కూడా!

తగినంత నిద్ర లేకపోయినా చర్మం అలసిపోతుంది. అందుకే రోజుకు కనీసం ఎనిమిది గంటలైనా నిద్రకు కేటాయించడం మంచిదంటున్నారు నిపుణులు.

చర్మంలో తేమను నిలిపి ఉంచడంలో మాయిశ్చరైజర్‌ పాత్ర కీలకం! కాబట్టి ఏ కాలమైనా, రాత్రుళ్లు మేకప్‌ తొలగించాక మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోవద్దు.

ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లతోనూ చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా మెరిపించుకోవచ్చు. ఈ క్రమంలో మీ చర్మతత్వాన్ని బట్టి ఏ ప్యాక్‌ వేసుకుంటే మంచిదో నిపుణుల్ని అడిగి తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని