Published : 05/01/2023 21:39 IST

ఆరోగ్యానికి పనీర్ పెప్పర్..!

పాలకు సంబంధించిన పదార్థాల్లో పనీర్‌ది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పైగా వీటితో చేసే కూరలు, స్వీట్లను చాలామంది ఇష్టపడి తింటుంటారు. ఈక్రమంలో పనీర్‌తో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే పెప్పర్‌తో కలిపి వండవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రుచితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు సూచిస్తున్నారు. మరి ఆ రుచికరమైన పనీర్‌ పెప్పర్‌ డ్రై వంటకం తయారీ గురించి తెలుసుకుందాం రండి.

కావాల్సిన పదార్థాలు

పనీర్‌ ముక్కలు- 200 గ్రాములు

మిరియాలు - ఒక టేబుల్‌ స్పూన్

జీలకర్ర – అర టీస్పూన్

ఉల్లిపాయలు, క్యాప్సికం ముక్కలు - ఒక కప్పు

నిమ్మరసం - ఒక టీస్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

తయారీ

ఒక ప్యాన్‌లో నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించాలి. ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిరియాలు, జీలకర్రను మిక్సీలో వేసి బాగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పనీర్‌ ముక్కలతో కలిపి మ్యారినేట్‌ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే పనీర్‌ ముక్కలు మిశ్రమంలో బాగా కలిసిపోతాయి. 10 నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసిన పనీర్ ముక్కలను ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, క్యాప్సికం మిశ్రమంతో బాగా కలిపి కొద్దిసేపు స్టవ్ మీద ఉంచాలి. ఆ తర్వాత స్టౌపై నుంచి ప్యాన్‌ను దించేసి నిమ్మరసంతో గార్నిష్‌ చేస్తే రుచికరమైన పనీర్‌ పెప్పర్‌ డ్రై రెసిపీ రడీ! ఈ వంటకాన్ని రోటీలతో కలిపి తీసుకోవచ్చు. ఘీ రైస్‌తో కలిపి తిన్నా రుచిగా ఉంటుంది.


ఆరోగ్య ప్రయోజనాలివే!

మిరియాల వల్ల..

⚛ నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఛాతీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

⚛ నల్ల మిరియాలను తీసుకుంటే ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలు వెంటనే తగ్గిపోతాయి.

⚛ ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి.

⚛ రోజువారీ ఆహారంలో కనీసం ఒక చిటికెడు మిరియాలనైనా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొంది, పలు వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వారు సూచిస్తున్నారు.


పనీర్‌ వల్ల..

⚛ ఇక పనీర్‌లో మంచి కొవ్వులు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎక్కువసేపు అలసట లేకుండా పని చేయచ్చు.

⚛ ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌ తదితర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి వివిధ అనారోగ్య సమస్యల నుంచి రక్షణ అందిస్తాయి.

⚛ ఆకలిని అదుపులో ఉంచుకోవాలంటే పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

⚛ పనీర్‌ను తీసుకోవడం వల్ల మహిళలకు మెనోపాజ్‌ దశలో ఎదురయ్యే ఒత్తిడి, చిరాకు నుంచి ఉపశమనం కలుగుతుంది.

⚛ ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ లాంటి ఎముక సంబంధిత సమస్యలను నివారిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని