Published : 09/10/2021 15:54 IST

నవరాత్రుల నైవేద్యాలు.. పోషకాల నిలయాలు!

నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం అనవాయితీ.. కేవలం పూజే కాదు.. ప్రసాదంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఏరోజుకారోజు చేసి ప్రత్యేకంగా సమర్పించడం కూడా సహజమే.. పది రోజుల పాటు విభిన్న అవతారాల్లో దర్శనమిచ్చే ఆ శక్తిస్వరూపిణికి ఇష్టమైన వంటకాలేంటో మన అందరికీ తెలుసు.. కానీ వాటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయని కూడా మీకు తెలుసా? నిజం.. అమ్మవారి ప్రసాదాల్లో మనకు తక్షణ శక్తినిచ్చే గుణంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లక్షణం కూడా ఉండడం విశేషం. మరి, ఏయే ప్రసాదాల్లో ఎలాంటి గుణాలుంటాయో.. తెలుసుకుందాం రండి..

ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పులిహోర, పాయసం, అల్లపుగారెలు, పూర్ణాలు, దధ్యోజనం, చక్కెర పొంగలి, పులగం, కట్టె పొంగలి, చలిమిడి, రవ్వ కేసరిలాంటి పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి, వీటిలో చాలా వంటకాలు పండుగలకు మాత్రమే ఎక్కువగా చేసుకొనేవి ఉంటాయి. అందుకే ఆ సమయంలో శరీరానికి తగిన పోషణనిచ్చేలా ఇవి తమలో అన్ని గుణాలు నింపుకొని ఉంటాయన్నమాట.

పొంగలి

అమ్మవారికి ఇష్టమైన వంటకాల్లో పొంగలి నైవేద్యం కూడా ఒకటి. ఎలాంటి వయసు వారికైనా ఇట్టే అరిగే ఆహారం ఇది. అందుకే ఇంట్లో అందరికీ సులభంగా పూర్తయ్యే వంటకంగా దీన్ని ప్రయత్నించవచ్చు.

* బియ్యంలో మన శరీరానికి శక్తిని అందించే కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెసర పప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి బియ్యంతో కలిసి బ్యాలన్స్‌డ్ మీల్స్‌గా ఉపయోగపడతాయి. దీన్ని తినడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలు తగ్గుతాయి.

* పొంగలిలో వేసే మిరియాలు జీర్ణ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే పోషకాల్ని శరీరానికి అందించడంలో ఇవి ముఖ్యపాత్ర వహిస్తాయి.

* దగ్గు, జలుబు, గొంతు నొప్పిలాంటి శ్వాసకోశ వ్యవస్థకి సంబంధించిన సమస్యలకి మిరియాల్లోని ఖనిజాలు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి.

* రక్తహీనత, కండరాల నొప్పులు, మలబద్ధకం లాంటి వాటిని తగ్గించడానికి ఈ వంటకం ఉపయోగపడుతుంది.

 

దధ్యోజనం

అమ్మవారికి ఇష్టమైన వాటిలో దధ్యోజనం కూడా ఒకటి.. నవరాత్రుల్లో దీన్ని తప్పకుండా అమ్మవారి ప్రసాదంగా పెడుతుంటారు. ఇందులో మన ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా పోషకాలున్నాయి..

* మనం ఆకలి వేయకపోయినా నచ్చినవన్నీ తింటూ పొట్టకి అదనపు భారాన్నిస్తుంటాం. అందువల్ల జీర్ణవ్యవస్థ నెమ్మదించి కడుపంతా ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. కడుపులో మంట, అజీర్తికి దధ్యోజనం మంచి మందులా పనిచేస్తుంది. పెరుగులోని పోషకాలు మంటని చల్లబరుస్తాయి.

* బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు లేక శరీర ఉష్ణ్రోగత అధికంగా ఉన్నప్పుడు దధ్యోజనం ప్రయత్నించండి. ఇది లోపల వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా చేస్తుంది. అలసట లేకుండా హాయిగా అనిపిస్తుంది.

* పెరుగులో ప్రొబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్స్, మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

* దధ్యోజనం చాలా తక్కువగా తినగానే కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అందుకే లావు తగ్గాలనుకునేవారు దీన్ని ప్రయత్నించవచ్చు.

* అంతేకాదు.. ఇది త్వరగా జీర్ణమవడం, ఇందులో మంచి పోషకాలుండడంతో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అందుకే పెరుగన్నం తింటే చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్ల నుంచి బయటపడచ్చు కూడా..

 

చక్కెర పొంగలి

చక్కెర పొంగలంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో.. అమ్మవారికి ప్రీతిపాత్రమైన వంటకమైన చక్కెర పొంగలి కేవలం రుచిలోనే కాదు పోషకాల్లోనూ గొప్పగానే ఉంటుంది.

* బియ్యంలో కార్బోహైడ్రేట్లు మన శరీరానికి కావాల్సిన బలాన్నిస్తాయి. చక్కెర లేదా బెల్లంలోని విటమిన్స్, మినరల్స్ చర్మానికి కావాల్సిన నిగారింపు, సున్నితత్వాన్ని అందిస్తాయి.

* బెల్లంలోని పోషకాలు జీర్ణవ్యవస్థకి కావాల్సిన ఎంజైముల్ని విడుదల చేసి, ఆహారాన్ని త్వరగా అరిగించడంలో సహాయపడతాయి. అవి అధిక బరువుని తగ్గించడంలోనూ సహకరిస్తాయి.

 

పులగం

పులగంలో చాలా రకాల చిరుధాన్యాలతోపాటు మసాలా దినుసులను కూడా వాడతారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పెసరపప్పు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బెల్లం, పుదీనా, మిరియాలు, నెయ్యి లాంటివి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సహకరిస్తాయి.

* పెసరపప్పులోని కాపర్ చర్మం ముడతలు పడకుండా నున్నగా ఉండేలా చేస్తుంది. వయసుతోపాటు వచ్చే మచ్చలను దూరం చేస్తుంది. మన చర్మానికి కావాల్సిన నిగారింపునివ్వడంలో పెసరది ప్రత్యేక స్థానం.

* ఈ వంటకంలో కాపర్, ఐరన్‌లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాల్ని అందిస్తాయి. వీటివల్ల మన రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

* పెసరలోని సహజమైన కాల్షియం ఎముకల పటుత్వానికి ఉపయోగపడుతుంది. ప్రమాదాల సమయంలో ఎముకలు విరగకుండా క్యాల్షియం కాపాడుతుంది. వృద్ధుల్లో ఎముకల పటుత్వం పెరగడానికి పులగం ఉపయోగపడుతుంది.

* జీర్ణవ్యవస్థకి సంబంధించి ఉబ్బరంలాంటి సమస్యలు పులగం వల్ల తగ్గుతాయి. ఇది తేలికపాటి ఆహారం కావడం వల్ల శరీరం దీన్ని సులభంగా అరిగించుకోగలుగుతుంది.

 

పాయసం

* పాయసంలో వేసే సగ్గుబియ్యం, సేమియా, కిస్‌మిస్‌లూ శరీరానికి కావాల్సిన అదనపు శక్తినిస్తాయి. ద్రాక్ష, జీడిపప్పు, బాదంలాంటి ఎండు ఫలాలు రక్తహీనతని తగ్గిస్తాయి. శరీరానికి ప్రొటీన్లు కూడా అందిస్తాయి.

* శరీరంలో వేడిని తగ్గించి జీర్ణవ్యవస్థకి ఉపయోగపడడంలో పాయసం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడమే కాదు.. పిత్తాశయంలో ఏవైనా సమస్యలుంటే వాటిని నియంత్రించడంలో సహకరిస్తాయి.

* రక్తంలోని అదనపు కొవ్వుల్ని నియంత్రించడంలో ఎండు ఫలాలు బాగా ఉపయోగపడతాయి.

ఇవే కాదు అమ్మవారికి సమర్పించే ఏ ఆహార పదార్థమైనా అందులో తప్పకుండా శరీరానికి మేలు చేసే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు తప్పకుండా ఉంటాయి. తద్వారా ఈ నవరాత్రుల్లో మన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవి నిజంగానే అమ్మవారి ప్రసాదమని చెప్పుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని