నత్తి, మాటల్లో తడబాటు.. ఎలా తగ్గించాలి?
మా అబ్బాయి వయసు ఆరేళ్లు. సరిగా మాట్లాడలేకపోతున్నాడు. నత్తి, తడబాటు కనిపిస్తున్నాయి. వాడు మాట్లాడే మాటలు కూడా సరిగా అర్థం కావడం లేదు. ఈ సమస్య వల్ల వాడిని నలుగురిలోకి తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఇది ఆరోగ్య సమస్యా? ఏ డాక్టర్‌కి చూపిస్తే ఫలితం ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?....
మా అమ్మాయి వయసు ఆరేళ్లు. సరిగా మాట్లాడలేకపోతుంది. నత్తి, తడబాటు కనిపిస్తున్నాయి. తను మాట్లాడే మాటలు కూడా సరిగా అర్థం కావడం లేదు. ఈ సమస్య వల్ల పాపని నలుగురిలోకి తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఇది ఆరోగ్య సమస్యా? ఏ డాక్టర్‌కి చూపిస్తే ఫలితం ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. పిల్లలు ఎదిగే క్రమంలో పలు మైలురాళ్లను దాటుతుంటారు. ఇందులో మాటలు మాట్లాడడం కూడా ప్రధానమైనది. అయితే కొంతమంది పిల్లలు ఈ మైలురాయిని సరిగా దాటలేకపోతున్నారు. ఈ క్రమంలో మాట్లాడేటప్పుడు నత్తి, తడబాటు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిని లాంగ్వేజ్ డిజార్డర్ అంటుంటాం. ఇందులో భాగంగా నత్తి, తడబాటు.. వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నత్తి అనేది పిల్లల్లో పలు కారణాల వల్ల వస్తుంటుంది. కొంతమందిలో జన్యుపరంగా ఈ సమస్య వస్తుంటుంది. అంటే.. వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నత్తి ఉంటే పిల్లలకు కూడా వస్తుంటుంది. మరికొంతమందిలో గందరగోళం వల్ల కూడా నత్తి వస్తుంటుంది. అంటే ఇంట్లో మాతృభాష మాట్లాడడం, బయట మరో భాష మాట్లాడడం వల్ల పిల్లలు గందరగోళానికి గురవుతుంటారు. దానివల్ల కూడా నత్తి వస్తుంటుంది. ఈ సమస్య ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే చాలామందిలో మాత్రం నలుగురిలోకి వెళ్లకపోవడం (సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడం) వల్ల నత్తి వస్తుంటుంది. ఇంట్లో తోబుట్టువులు లేకపోవడం, గ్రాండ్ పేరెంట్స్‌కి దూరంగా ఉండడం, ఇతరులతో ఎక్కువగా కలవకపోవడం.. వంటివి ఇందుకు కారణాలు. ఇలా మీ అమ్మాయి నత్తికి గల కారణాన్ని అన్వేషించండి. దానికి తగిన పరిష్కారాన్ని వెతకడంతో పాటు స్పీచ్ థెరపీ వంటివి ఇప్పిస్తే చాలావరకు నత్తి సమస్యను తగ్గించుకోవచ్చు. చాలా కొద్దిమందిలో నాలుక మందంగా ఉండడం వల్ల నత్తి వస్తుంటుంది. ఇలాంటివారికి తగిన చికిత్స అందించడం వల్ల సమస్యను దూరం చేయచ్చు.
ఇక రెండో సమస్య తడబాటు.. మాట్లాడే మాటల్లో స్పష్టత లేకపోవడం, వేగంగా మాట్లాడడం, ఏదో ఒకటి త్వరగా మాట్లాడాలి అనుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. దీనిని ప్రాక్టీస్ ద్వారానే నయం చేసుకోవచ్చు. మీ అమ్మాయి వయసు ఆరేళ్లని చెబుతున్నారు. కాబట్టి తను మాట్లాడుతున్నప్పుడు తప్పులను ఎత్తి చూపకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ తప్పులను ఎత్తి చూపిస్తే.. మాట్లాడితే ఎక్కడ తప్పులు వస్తాయేమోనని క్రమంగా మాట్లాడడం మానేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా తప్పులను ఎత్తి చూపకుండా ఎక్కువసేపు మాట్లాడించడానికి ప్రయత్నించండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా రోజుకు 10 పదాలను లక్ష్యంగా పెట్టుకుని ప్రాక్టీస్ చేయించండి. దీనివల్ల క్రమంగా మీ పాప ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.