Updated : 08/12/2022 01:38 IST

చలికాలంలో.. షుగర్ అదుపులో ఉండాలంటే..!

కాలాలు మారే కొద్దీ మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా మారుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణ ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగానే ఉంటుంది. రకరకాల సీజనల్‌ వ్యాధులు, అనారోగ్య సమస్యలు కలిసి ముప్పేట మనపై దాడి చేస్తాయి. దీనికి ప్రధాన కారణం శీతాకాలంలో వీచే విపరీతమైన చలిగాలులే. ఈ క్రమంలో చలికాలంలో మధుమేహ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

విపరీతమైన వేడి లేదా చలి రక్తంలో చక్కెర స్థాయిని బాగా ప్రభావితం చేస్తుంది. ఇక శీతాకాలంలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల డయాబెటిక్ బాధితుల్లోని రక్తంలో చక్కెర స్థాయులు బాగా పెరుగుతాయి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే గుండె, మూత్రపిండాలు, నరాలు, కళ్లు వంటి ముఖ్యమైన అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. అదే సమయంలో దానిని ఎక్కువ లేదా తక్కువ కాకుండా సాధారణ స్థాయిలో ఉంచుకోవాలి. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ కూరగాయలతో మేలు!

శీతాకాలంలో ఫైబర్‌ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు బాగానే లభ్యమవుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడమే కాకుండా శరీర బరువును అదుపులో ఉంచుతాయి. క్యారట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, బచ్చలి కూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకలీ, గ్రీన్‌బీన్స్‌, బఠానీలు, మొక్కజొన్న వంటి కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితముంటుంది. ప్రధానంగా క్యారట్‌, ముల్లంగి వంటి దుంపల్లో ఫైబర్‌తో పాటు ఏ, బి6, సి, ఇ, కె-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా జింక్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్, కాపర్‌, అయోడిన్‌ వంటి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. ముఖ్యంగా వీటిలోని జింక్‌ ఇన్సులిన్‌ స్థాయిని పెంచి డయాబెటిక్‌ రోగులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.

ఈ పండ్లలో పుష్కలంగా పోషకాలు!

సిట్రస్‌ జాతికి చెందిన పండ్లలో ఫైబర్‌, విటమిన్‌-సి పుష్కలంగా ఉంటాయి. వీటిలోని సూక్ష్మ, స్థూల పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరంలోని కణజాలాల క్షీణతను నివారిస్తాయి. ఎంతో రుచికరమైన బెర్రీ పండ్లను డయాబెటిక్ రోగులకు సూపర్‌ఫుడ్‌గా గుర్తించింది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్. వీటిలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌తో పాటు గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. వీటిని స్మూతీలు, జ్యూస్ ల రూపంలో తీసుకుంటే మంచిది.

ప్రొటీన్ కోసం...!

రక్తంలోని చక్కెర స్థాయి పెరగడం వల్ల కణజాలాలకు తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. దీనిని నివారించాలంటే ప్రొటీన్ ఎంతో అవసరం. ఇందుకోసం మాంసం, చేపలతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే గుడ్లను బాగా తీసుకోవాలి. 

వీటి విషయంలో జాగ్రత్త!

⚜ బియ్యం, బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ రోగులు సాధ్యమైనంతవరకు వీటికి దూరంగా ఉండడం మంచిది. మరీ తప్పకపోతే మితంగా తీసుకోవాలి.

⚜ ఆహారంలో తప్పనిసరిగా రైస్‌ తీసుకోవాలంటే ప్రాసెస్ చేయని బ్రౌన్‌ రైస్‌ మంచి ప్రత్యామ్నాయం. ఫైబర్‌ లాంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.

⚜ బెల్లంలోనూ చక్కెర స్థాయులను పెంచే గుణాలుంటాయి. గ్లైసెమిక్‌ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ బాధితులు బెల్లంతో తయారుచేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

⚜ సాధారణంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి వేడి వేడి టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటారు. వీటి కారణంగా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పానీయాలకు దూరంగా ఉండాలి.

⚜ గొంతునొప్పి, సాధారణ జలుబు, ఇతర అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందేందుకు తేనెను ఔషధంగా ఉపయోగిస్తారు. అయితే మధుమేహ రోగులు మాత్రం తేనెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇది న్యాచురల్ స్వీటెనర్‌. ఇందులో కూడా చక్కెర అధికంగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని