మాటల గోదావరి... ఈ వసపిట్ట!

మాధురీ కృష్ణ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ వాయిస్‌ ఆఫ్‌ వసపిట్ట అనగానే ఠక్కున గుర్తు పట్టేస్తారీమెను. మనసు దారి మళ్లించడానికి సోషల్‌మీడియా బాట పట్టిన ఈ అమ్మాయి... తన మాటల గలగలలతో... లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుంది.

Updated : 22 Jan 2023 08:41 IST

మాధురీ కృష్ణ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ వాయిస్‌ ఆఫ్‌ వసపిట్ట అనగానే ఠక్కున గుర్తు పట్టేస్తారీమెను. మనసు దారి మళ్లించడానికి సోషల్‌మీడియా బాట పట్టిన ఈ అమ్మాయి... తన మాటల గలగలలతో... లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఐర్లాండ్‌ నుంచి హైదరాబాద్‌ వరకూ సాగిన ఈ ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంటోందిలా....

మాది రాజమహేంద్రవరం. చిన్నప్పటి నుంచీ గలగలా మాట్లాడతా. అదే నాకు గుర్తింపు కూడా. బీటెక్‌ అయ్యాక వైజాగ్‌లో ఉద్యోగం... కొన్నాళ్లకే పెళ్లి. దాంతో ఉద్యోగం మానేసి, బెంగళూరు మకాం మార్చా. తర్వాత పెద్దోడు అర్జున్‌ పుట్టాడు. తనకి రెండున్నరేళ్లు ఉన్నప్పుడు ఓ అనారోగ్య సమస్య వల్ల నా కాలికి ఆపరేషన్‌ జరిగింది. కొన్నినెలలు మంచానికే పరిమితమయ్యా. దాంతో బాగా ఒత్తిడికి గురయ్యా. దాన్నుంచి బయట పడేందుకు టిక్‌టాక్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టా. ఇంతలో మావారి ఉద్యోగరీత్యా ఐర్లాండ్‌కి మారాం. అక్కడే యూట్యూబ్‌ ఆలోచన వచ్చింది. చిన్నప్పటి నుంచీ నన్నందరూ వసపిట్ట అనేవారు. అందుకే ఛానెల్‌ పేరు ‘వాయిస్‌ ఆఫ్‌ వసపిట్ట’ అని పెట్టా. 

నాకోసం ఇక్కడే...

మా తమ్ముడి పెళ్లికి ఐర్లాండ్‌ నుంచి  రాజమహేంద్రవరం వచ్చాం. తర్వాత కొన్నాళ్లకే గర్భం దాల్చడంతో మా వారూ మరో కంపెనీకి మారిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాన్న రైల్వే ఉద్యోగిగా, అమ్మ టీచర్‌గా పదవీ విరమణ చేశారు. మావారు, అమ్మ, నాన్న, తమ్ముడి సాయంతోనే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వీడియోలు చేయగలుగుతున్నా. మొదట్లో ఎవరేం అనుకుంటారో అన్న చిన్న సందేహం ఉండేది. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సర్ది చెప్పుకొన్నా. నిజానికి ఇది ఆదాయం కోసం చేయలేదు... ఆదరణ పెరిగే కొద్దీ రాబడి మొదలైంది. వీడియోలని ఎలా పడితే అలా చేయలేం. మంచి కాన్సెప్ట్‌ ఎంచుకోవాలి. అందుకే.. డీఐవై నుంచి హోం క్లీనింగ్‌ వరకూ ఎన్నో చెబుతా. పిల్లల పెంపకంలో జాగ్రత్తలూ, ఇంటి ఆర్గనైజింగ్‌, హౌస్‌ బడ్జెట్‌ ప్లాన్‌... ఇలా ఒకటేమిటి ఇంటిల్లి పాదికి నచ్చే విషయాలన్నీ వీడియోలుగా చేస్తుంటా. అందుకు బోలెడు శ్రమ పడాలి. పరిశోధన, వీడియోలు తీయడం, ఎడిటింగ్‌, వాయిస్‌ ఓవర్‌... ఇలా ప్రతి దశలోనూ చాలా శ్రద్ధ పెట్టాలి. విరామం ఇస్తే వ్యూయర్‌షిప్‌తో పాటూ సబ్‌స్క్రైబర్లూ తగ్గుతారు. అందుకే మా చిన్నోడు పుట్టినప్పుడు... గ్యాప్‌ ఇవ్వకూడదని ముందే వీడియోలు తీసి రెడీ పెట్టుకున్నా. సామాజిక మాధ్యమాల ద్వారా ఎంత సంతోషం ఉంటుందో అంత నెగిటివిటీ కూడా ఉంటుంది.  మంచిని తీసుకుని దాన్నే పంచాలనుకుంటా. అందుకే, ప్రతికూల కామెంట్లను చదవను. ఈ వీడియోల ఆదాయంలో కొంత సామాజిక సేవలకూ వెచ్చిస్తున్నా. ప్రస్తుతం ఓ అబ్బాయి బాధ్యత తీసుకుని ప్రైవేట్‌ స్కూల్‌లో చదివిస్తున్నా. ఐదుగురు అమ్మాయిలనూ చదివించేందుకు ఏర్పాట్లు చేసుకున్నా. అమ్మాయిలు ఏ పని చేసినా... బోలెడు ఆంక్షలు... వాటిని అధిగమించాలంటే ముందు మనల్ని మనం నమ్మాలి అప్పుడే అనుకున్నది చేయగలం.


నేను చూసిన కళ్లతో...

ఐర్లాండ్‌లో ప్రతిదీ కొత్తగా అనిపించేది. ఇండియా నుంచి ఎవరు ఫోన్‌ చేసినా... వాతావరణం ఎలా ఉంటుంది? ప్రజలెలా ఉంటారు? ఇవి దొరుకుతాయా? అవి ఉంటాయా.. ఇలా బోలెడు ప్రశ్నలు వేసేవారు. నాకూ కొత్తవి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువే. అందుకే ఐర్లాండ్‌ జీవనశైలిపై వీడియోలు చేసే దాన్ని. లాక్‌డౌన్‌లో ఐర్లాండ్‌ దుకాణాల్లో వీడియోలు చేశా. మంచి వ్యూస్‌ వచ్చాయి. ఐదు నెలల్లో లక్షమంది సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడంతో ఉత్సాహం వచ్చింది. ఈలోపు టిక్‌టాక్‌ బ్యాన్‌తో యూట్యూబ్‌ మీదే దృష్టిపెట్టా. వినోదంతో పాటూ ప్రతి వీడియోలోనూ మంచి సందేశమూ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం మూడు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పదిమిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చిన వీడియోలు ఉన్నాయి.

-సుమంత్‌ సకలాభక్తుల, ఈటీవీ భారత్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్