వోబుల్‌.. స్క్రీన్‌ దూరంచేసే.. అమ్మల స్టార్టప్‌!

‘అబ్బబ్బా.. పిల్లలు ఫోన్‌ వదలట్లేదు..’ చాలామంది అమ్మల ఫిర్యాదే కదూ! సెలవుల్లోనే కాదు.. ఇంటికొచ్చాకా వారి కాలక్షేపం అదే అవుతోంది మరి. ఈ అమ్మలదీ అదే పరిస్థితి.

Published : 08 Nov 2023 02:07 IST

‘అబ్బబ్బా.. పిల్లలు ఫోన్‌ వదలట్లేదు..’ చాలామంది అమ్మల ఫిర్యాదే కదూ! సెలవుల్లోనే కాదు.. ఇంటికొచ్చాకా వారి కాలక్షేపం అదే అవుతోంది మరి. ఈ అమ్మలదీ అదే పరిస్థితి. దాన్ని మాన్పించడానికి వాళ్లు చేసిన ప్రయత్నం.. ఎంతోమంది పిల్లలను ‘తెర’కు దూరం చేయడమే కాదు.. వారికీ లాభసాటి వ్యాపారమైంది.

నేహా శర్మ, సౌమ్య జగన్నాథ్‌.. ఇరుగు పొరుగు ఇళ్లవారు. పరిచయం త్వరగానే స్నేహంగా మారింది. వీళ్ల పిల్లలు ముగ్గురూ మంచి స్నేహితులయ్యారు. వీళ్లది బెంగళూరు. లాక్‌డౌన్‌ సమయంలో, ఆ తర్వాతా వీళ్లిద్దరిదీ ఒకే సమస్య.. ‘పిల్లలెప్పుడూ ఫోన్లలోనే మునిగిపోతున్నార’నే! తమదే కాదు ఎంతోమంది అమ్మలదీ ఇదే సమస్య అని గ్రహించారు వాళ్లు. నేహా.. దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తోంది. సౌమ్య మిచిగన్‌ యూనివర్సిటీ నుంచి న్యూరోసైన్స్‌లో డిగ్రీపట్టా పొందింది. తనకు వ్యక్తులకు అనుగుణంగా ఆటలు, బోధన తీరును డిజైన్‌ చేయడంలో అనుభవముంది.

లాక్‌డౌన్‌లో ఈ ఇద్దరు అమ్మల సమస్యా ‘మొబైలే!’ ఏం తోచడం లేదని కొంత, ఆన్‌లైన్‌ తరగతులంటూ మరికొంత దానిపైనే పిల్లలు పూర్తిగా ఆధారపడ్డారు. కళ్ల సమస్యలతోపాటు వాళ్ల ప్రవర్తనలోనూ మార్పులొస్తోంటే భయపడ్డారు. ఇద్దరూ కలిసి ఏం చేయొచ్చా అని ఆలోచించారు. అప్పుడే తెరతో సంబంధం లేకుండా అనేక గేమ్‌లను కనిపెట్టారు. స్కూళ్లు తెరిచినా ఎంతోమంది అమ్మలు ఇదే సమస్యను ఎదుర్కోవడం చూసి.. 2022లో ‘వోబుల్‌’ ప్రారంభించారు.

వాళ్ల ఉత్పత్తి ఓ కిట్‌. పిల్లలకు టాస్క్‌లతో కూడిన కథలు, రంగుల పుస్తకాలు, చెవులకు హాని కలిగించని విధంగా రూపొందించిన హెడ్‌సెట్‌ వంటివి వస్తాయి. డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. అది వింటూ పిల్లలు అప్పగించిన పనులను పూర్తిచేయాలన్నమాట. ప్రతివారం వందల్లో కథలు, టాస్క్‌లను అప్‌డేట్‌ చేస్తుంటారట. దీనికోసం ఉద్యోగాలను వదిలేసిన ఈ మిత్రద్వయం.. పిల్లల కథలు, వారి ఆసక్తులపై బోలెడు పరిశోధనలూ చేస్తున్నారు. పెద్ద టీమ్‌నీ ఏర్పాటు చేసుకున్నారు. ‘ఇద్దరి ఆలోచనలూ కలవడంతో స్టార్టప్‌ సాధ్యమైంది. నేను ఆపరేషన్స్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ చూసుకుంటే ఉత్పత్తులు, కంటెంట్‌, ప్రొడక్షన్‌ వంటివన్నీ సౌమ్య చూసుకుంటోంది. ఎంతోమంది తల్లులు ‘స్క్రీన్‌’ బాధ తప్పించారు అని మెసేజ్‌లు పెడుతోంటే సాధించాం అనిపిస్తుంటుంది’ అంటుంది నేహ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్