వ్యర్థాలకు అర్థం చెప్పేస్తున్నారు!

దుస్తులు కుట్టగా మిగిలిన ఆ వ్యర్థాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఉపయోగించిన తర్వాత పాత గాజు సీసాలు ఏమవుతాయో గమనించారా? మనం పెద్దగా దృష్టి సారించని ఆ వ్యర్థాలని వాడి వీళ్లు వ్యాపారం చేస్తున్నారు. తోటి మహిళలకు ఉపాధినీ ఇస్తున్నారు... టైలరింగ్‌ వ్యర్థాలను అందమైన ఫ్యాషన్‌ ఉత్పత్తులుగా తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది నమ్రుతా రామనాథన్‌.. 

Updated : 04 Dec 2023 05:14 IST

దుస్తులు కుట్టగా మిగిలిన ఆ వ్యర్థాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఉపయోగించిన తర్వాత పాత గాజు సీసాలు ఏమవుతాయో గమనించారా? మనం పెద్దగా దృష్టి సారించని ఆ వ్యర్థాలని వాడి వీళ్లు వ్యాపారం చేస్తున్నారు. తోటి మహిళలకు ఉపాధినీ ఇస్తున్నారు...

మొదటి ఆర్డర్‌ అమెరికా నుంచి

టైలరింగ్‌ వ్యర్థాలను అందమైన ఫ్యాషన్‌ ఉత్పత్తులుగా తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది నమ్రుతా రామనాథన్‌..  

‘అమ్మ గీత. నాన్న రామనాథన్‌.. బ్యాంకు ఉద్యోగి. మాది చెన్నై. డిగ్రీ పూర్తిచేశాక 9 ఏళ్లపాటు వివిధ సంస్థల్లో పని చేశా. మా నానమ్మ ఓ రోజు నాకు డ్రెస్‌ కుట్టిన తర్వాత.. మిగిలిన ముక్కలతో వీధిలో అందరికీ సరిపడా మాస్కులు తయారు చేసిచ్చింది. ఒక్క డ్రెస్‌లో మిగిలిన ముక్కలతోనే ఇన్ని మాస్కులు తయారైతే.. చెన్నై నగరంలోని ఒక రోజు సేకరించిన వస్త్ర వ్యర్థాలతో ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చో అనిపించింది. ఆ రోజే సిటీలోని టైలరింగ్‌ షాపులకు వెళ్లి.. వస్త్రాలు కుట్టగా మిగిలిన రద్దుని ఏం చేస్తారని అడిగా. కాల్చేయటమో, పారేయడమో చేస్తామన్నారు. అలా చేయడం వల్ల పర్యావరణానికి ఇబ్బంది కదా అనిపించింది.

పోనీ వాటితో ఏం చేద్దామన్నా.. నాకు టైలరింగ్‌లో ఓనమాలు కూడా రావు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేశాను. మూడు నెలలపాటు బ్యాగులు కుట్టడంలో శిక్షణ తీసుకున్నా. నేను నేర్చుకున్నదాన్ని స్థానిక మహిళలకూ నేర్పించా. ఆ తర్వాత టైలరింగ్‌ దుకాణాల నుంచి వ్యర్థాలు సేకరించి.. వాటిని విడదీసి, ప్రాసెస్‌ చేసేవాళ్లం. ఆ వ్యర్థాలతో ట్రావెలింగ్‌ బ్యాగులు, కార్పొరేట్‌ అవసరాలకు తగిన బ్యాగులు, హెయిర్‌ బ్యాండ్లు, చిన్నపిల్లలకు బొమ్మలు, కీచైన్లు, హ్యాండ్‌ పౌచులు, పర్సులు, దిండు కవర్లు వంటి వస్తువులను తయారు చేస్తున్నాం. 2021 నుంచీ ‘అప్‌సైక్లి’ పేరుతో వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చా. ప్రస్తుతం విదేశాల నుంచీ ఆర్డర్లు అందుకుంటున్నాం. మొట్టమొదటి ఆర్డర్‌ అమెరికా నుంచి వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం నా దగ్గర 22 మంది మహిళలు పనిచేస్తున్నారు. భవిష్యత్తులో అన్ని రకాల వ్యర్థాలనూ రీసైకిల్‌ చేసి మరింత మంది మహిళలకు ఉపాధినివ్వాలని ఉంది.

నారగోని రమేశ్‌ కుమార్‌, ఈజేఎస్‌  


గాజుతో అలంకార వస్తువులు..

గాజు సీసాలు చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నా.. వాటిని ఇంట్లో పేర్చుకోలేం కదా! చెత్తలో పారేస్తాం. కానీ వాటిని ట్రేలు, గడియారాలు, హ్యాంగింగ్స్‌ ఇలా ఒక్కటేంటి అనేక రూపాల్లోకి మార్చేస్తోంది కేరళ అమ్మాయి రెంజినీ...

‘నా చదువంతా దుబాయ్‌లోనే సాగింది. కొన్నాళ్లపాటు ఏవియేషన్‌, మీడియా రంగాల్లో పనిచేశా. చిన్నప్పట్నుంచీ కళలంటే ఆసక్తి ఉన్నా, దాన్ని కెరియర్‌గా మలుచుకోవాలనుకోలేదు. కానీ పెళ్లయ్యాక ఆ అవకాశం వచ్చింది. కారణం మావారు ఆర్టిస్ట్‌. సినిమాలకు సౌండ్‌ ప్రొడ్యూస్‌ చేసే స్టూడియో ఆయనకు ఉంది. ఆ స్టూడియో పనుల్లో భాగంగా మేము స్క్రాప్‌ డీలర్లను తరచూ కలుస్తుండే వాళ్లం. అక్కడ చాలా వస్తువులు నిరుపయోగంగా పడి ఉంటాయి కదా! వాటిల్లో గాజు సీసాలు నన్ను ఆకట్టుకున్నాయి. వాటిని చూసినప్పుడల్లా ఏదో ఒకటి కొత్తగా చేయాలనిపించి.. గాజు వ్యర్థాలను కొనుక్కొచ్చేదాన్ని. వాటితో అందమైన గృహాలంకరణ వస్తువులు తయారుచేసి ఇంట్లో ఉంచేదాన్ని.

వాటిని చూసి స్నేహితులు, బంధువులు దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదని సలహా ఇచ్చారు. 2020లో ‘క్లైమేట్‌ కలెక్టివ్‌’ అనే సంస్థ మహిళా వ్యాపారుల కోసం పోటీ పెడితే అందులో పాల్గొన్నా. అక్కడ పర్యావరణానికి ఉపయోగపడే స్టార్టప్‌ ఐడియాలివ్వాలి. నేనిచ్చిన ఐడియా.. సెమీ ఫైనల్స్‌ వరకు వెళ్లింది. అది కూడా వ్యాపార అనుభవం లేకుండా. ఆ ఉత్సాహంతో 2021లో ‘వాపసీ’ పేరుతో నా సొంత బ్రాండ్‌ ప్రారంభించా. గాజు తయారీ రిస్క్‌తో కూడిన వ్యవహారం. వాటిని మనం కోరుకున్న ఆకృతిలోకి మార్చాలంటే చాలా ఓపిక అవసరం. మెలకువలు తెలుసుకుని, వీటి తయారీపై పట్టు సాధించా. ఇప్పటి వరకు 21 వేల గాజు సీసాలను రీసైకిల్‌ చేశా. ఐదువేలకు పైగా కొబ్బరి చిప్పలు, 800కేజీల చెక్క, 500 కిలోల లోహ వ్యర్థాలను రీసైకిల్‌ చేసి దీపాలు, వాల్‌ హ్యాంగింగ్‌లు, సైడ్‌ టేబుళ్లు, గిన్నెలు, గడియారాలు వంటి గృహాలంకరణ వస్తువులుగా తీర్చిదిద్దా. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచి విక్రయాలు మొదలుపెట్టా. ఎక్కువమంది మహిళలకు ఉపాధినివ్వాలన్నదే నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్