Updated : 10/01/2023 21:36 IST

పెద్దమ్మాయి అన్నిటికీ భయపడుతోంది.. ఏం చేయాలి?

మాకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయికి ౧౧, చిన్నమ్మాయికి 6 ఏళ్లు. పెద్దమ్మాయి కాస్త నిదానంగా ఉంటుంది. చిన్నది అలా కాదు. చాలా గడుసుది. పెద్దమ్మాయిని కూడా ఏడిపిస్తుంటుంది. అయినా అది చిన్నదాన్ని ఏమీ అనదు. స్కూల్లో కూడా అందరూ పెద్దమ్మాయి చాలా భయస్తురాలు అని చెబుతున్నారు. పెద్దపాపలో ధైర్యం నింపాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. పెద్దమ్మాయి భయస్తురాలు, చిన్నమ్మాయి గడుసుదని చెప్తున్నారు. చాలా కుటుంబాల్లోని పిల్లలు ఇలానే ఉంటారు. ఒకరు బాగా చురుగ్గా ఉంటే, మరొకరు నిదానంగా ఉంటారు. దీనికి పరోక్షంగా తల్లిదండ్రుల ప్రవర్తన కూడా కారణమే. ఎందుకంటే చురుగ్గా ఉండేవారికి మరింత స్వేచ్ఛనివ్వడం, ఇండిపెండెంట్ గా వదిలేయడం.. నెమ్మదిగా ఉండేవారి పట్ల అతి జాగ్రత్త చూపడం వల్ల వారి లక్షణాలు మరింతగా ఎక్కువవుతుంటాయి. కాబట్టి ఎవరిలో ఎలాంటి లోపాలు ఉన్నాయో గమనించి వాటిని సరిచేయడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో మీ పెద్దమ్మాయికి తన వయసుకు తగ్గ బొమ్మలు కొనివ్వడం, వయసుకు తగ్గ విషయాలను విడమరిచి చెప్పడం చేయాలి. అలాగే తనతో ఒక స్నేహితురాలిగా మెలగాలి. వివిధ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తుండాలి. దీనివల్ల తనలో కొంతమేరకు మార్పు వచ్చి, భయం తగ్గే అవకాశం ఉంటుంది.

మీ పెద్దమ్మాయి స్కూల్లో కూడా భయపడుతోందంటున్నారు. అంటే తనలో కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ చాలా తక్కువగా ఉన్నాయి. బహుశా తనకు చిన్నప్పటి నుంచి నేను ఏమీ చేయలేననే భావన ఉండి ఉండచ్చు. దానివల్ల భయపడుతుండచ్చు. అయితే ఎలాంటి అంశాల్లో తనను తాను తక్కువ చేసుకుంటోందో ఒక తల్లిగా గుర్తించండి. వాటిని మీరు దగ్గరుండి చేయించడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో తను కొంచెం సరిగా చేసినా సరే ప్రశంసించండి. దానివల్ల తనలో ‘నేను చేయగలను’ అన్న నమ్మకం క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే తోబుట్టువుల మధ్య కూడా సఖ్యత అవసరం. ఈ క్రమంలో మీరు మీ చిన్నమ్మాయితో అక్కతో ఏవిధంగా ప్రవర్తించాలో చెప్పండి. అలాగే అన్ని విషయాల్లోనూ ఇద్దరినీ సమానంగా చూడండి. దానివల్ల వారి మధ్య బంధం బలపడుతుంది. అలాగే పెద్దమ్మాయిలో ధైర్యం కూడా పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని