Suni lee: చెట్టెక్కితే కాళ్లు విరగ్గొడతాననేది అమ్మ...

ఆడవాళ్లు కొబ్బరి చెట్టెక్కడమేంటి అంటూ ఊరంతా విమర్శించారు... అయినా ఆమె వెనకడుగు వేయలేదు. వ్యతిరేకతలన్నింటినీ దాటి చెట్టెక్కడంలో శిక్షణ తీసుకొన్నారు.  ఇప్పడు తనే దేశవిదేశాల్లో వేలమంది మహిళలకు శిక్షణనిచ్చి ఉపాధి అందేలా చేస్తున్నారు.

Published : 31 May 2023 00:32 IST

ఆడవాళ్లు కొబ్బరి చెట్టెక్కడమేంటి అంటూ ఊరంతా విమర్శించారు... అయినా ఆమె వెనకడుగు వేయలేదు. వ్యతిరేకతలన్నింటినీ దాటి చెట్టెక్కడంలో శిక్షణ తీసుకొన్నారు.  ఇప్పడు తనే దేశవిదేశాల్లో వేలమంది మహిళలకు శిక్షణనిచ్చి ఉపాధి అందేలా చేస్తున్నారు. దేశంలోనే తొలి మహిళా శిక్షకురాలిగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకొన్న 51 ఏళ్ల సునీ లీ స్ఫూర్తి కథనమిది.

సునీ వాళ్ల స్వస్థలం కేరళలోని పాలయంకున్ను. ఈమె భర్త లీ ముంబయిలో డ్రైవరు. 2010లో ఆలయ ఉత్సవాలకు కుటుంబంతో సొంతూరికెళ్లారీమె. కొబ్బరికాయల కోసం చెట్టెక్కించడానికి ఎంత వెతికినా ఒక్కరూ దొరకలేదు. ఇది సునీని ఆశ్చర్యపరిచింది. అప్పడే ఎలాగైనా చెట్టెక్కడంలో శిక్షణ తీసుకోవాలనే ఆలోచన వచ్చిందామెకు. ‘చిన్నప్పటి నుంచి చెట్లెక్కడం నేర్చుకుంటానంటే కాళ్లు విరగ్గొడతానని అమ్మ తిట్టేది. మగ పనులు చేయకు అనేది. ఆ తర్వాత పెళ్లై ముంబయి వెళ్లిపోయా. ఓసారి కారాకుళంలో ‘కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు’ (సీడీబీ)లో ఆరురోజుల శిక్షణనిస్తున్నారని తెలిసింది. అందులో మావారితోపాటు నేను కూడా చేరా. అలా 39 ఏళ్ల వయసులో ఈ శిక్షణలో చేరా. అక్కడ 30 మందిలో నేనొక్కరినే మహిళను’ అని గుర్తు చేసుకుంటారు సుని.

మరం కేరీ అనేవారు..

సొంతూరికి వెళ్లినప్పుడల్లా భర్తతో కలిసి సుని కూడా కొబ్బరి కాయలు కోసేది. ‘ఊరి వాళ్లంతా మగవాళ్ల పనిని నువ్వు చేయడమేంటనేవారు. ‘మరం కేరీ (చెట్లెక్కే మహిళ)’ అని హేళన చేసే వారు. అవేవీ పట్టించుకొనేదాన్ని కాదు’ అంటారు సుని. ‘ఓసారి సీడీబీ నుంచి పిలుపొచ్చింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మహిళలకు కొబ్బరిచెట్టు ఎక్కడంలో శిక్షణ కార్యక్రమానికి నేతృత్వం వహించమని కోరారు. అక్కడి కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు చెట్టెక్కడమెలాగో చూపించమన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో చెట్టెక్కి చూపించాను. ఆయన ఎంత ప్రశంసించారో చెప్పలేను. ఆ తర్వాత ఇది నా కెరియర్‌గా మారింది. దేశవ్యాప్తంగా  మహిళలకు దీంట్లో శిక్షణనిచ్చే అవకాశాలొచ్చాయి. గత పదేళ్లలో జమైకా, సింగపూర్‌, మలేసియా, ఇండోనేషియా, శ్రీలంక వంటి  దేశాల్లోనూ పర్యటించి కొబ్బరి చెట్లెక్కడంలో తర్ఫీదునిచ్చే మొదటి మహిళగా గుర్తింపు పొందా. ఇప్పటివరకు వేలమంది మహిళలకు శిక్షణనందించి ఉపాధి కల్పించగలిగా. ముంబయి నుంచి వచ్చి, మా సొంతూరులో కొబ్బరిచెట్ల పెంపకాన్ని ప్రారంభించా. 150 మంది సభ్యులతో ‘కోకోనట్‌ ప్రొడ్యూసర్స్‌ సొసైటీ’ స్థాపించా. దీని ద్వారా రైతులకు కొబ్బరి తోటల పెంపకం, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌పై అవగాహన కలిగిస్తున్నా. వ్యవసాయం, కోళ్ల, చేపల పెంపకాన్ని కూడా  మొదలుపెట్టానంటు’న్న సునీకి గత సెప్టెంబరులో కేంద్రప్రభుత్వం నుంచి ‘ద బెస్ట్‌ కోకోనట్‌ ట్రీ క్లైంబింగ్‌ ట్రైనర్‌’ అవార్డు వరించింది. ‘విమర్శలను సవాళ్లుగా తీసుకుంటా. అనుకున్నది సాధించాలనే సంకల్పం ఉంటే చాలు, ఇబ్బందులను దాటి విజయాన్ని సాధించొచ్చు’ అంటారీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్