Published : 25/11/2021 19:41 IST

New Couple : ఉదయాన్నే ఇలా చేస్తే మీ బంధం పదిలం!

నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రకు ఉపక్రమించే దాకా ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమవుతుంటారు భార్యాభర్తలు. అలాంటప్పుడు ఒకరితో ఒకరు గడిపే తీరిక, సమయం ఇంకెక్కడుంటుంది. నిజానికి ఈ బిజీ షెడ్యూలే ఆలుమగల అనుబంధాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. మరీ ముఖ్యంగా కొత్త జంటలకు ఒకరిపై ఒకరు అవగాహన పెంచుకోవడానికి కలిసి గడపడమే కీలకమంటున్నారు. అందుకే రోజంతా సమయం కేటాయించలేకపోయినా.. ఉదయాన్నే కొన్ని పనులతో ఒకరికొకరు మరింత దగ్గర కావచ్చంటున్నారు.

* రాత్రుళ్లు నిద్రపోవడానికి పడకగదిలోకి ప్రవేశించే దంపతులు ఎవరికి వారుగా కాకుండా కలిసి వెళ్లడం వల్ల వారి మధ్య అనుబంధం మరింతగా బలపడుతుందంటున్నారు నిపుణులు. ఈ నియమం ఉదయం లేచే విషయంలోనూ వర్తిస్తుంది. ఒకేసారి నిద్ర లేవడం వల్ల ఓ ముద్దు-ఓ హగ్గుతో శుభోదయం చెప్పుకోవడం, ఆ తర్వాత చేయాల్సిన పనుల్ని పంచుకోవడం, కాసేపు మాట్లాడుకోవడం.. ఇలా కలిసి గడపడానికి బోలెడంత సమయం దొరకుతుంది. పైగా మనసూ ఉత్తేజితమవుతుంది.

* ఆలుమగలిద్దరూ కలిసి చేసే వ్యాయామాలూ వారి మధ్య అనుబంధాన్ని రెట్టింపు చేస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి కొన్ని నిమిషాల పాటు సరదాగా మాట్లాడుతూ వర్కవుట్‌ చేయడం వల్ల అందులో అలసట తెలియకపోగా.. ఏదో తెలియని మధురానుభూతిని సొంతం చేసుకోవచ్చు.

* ఉదయాన్నే ఎవరి హడావిడిలో వాళ్లు ఉండకుండా.. ఒకరి కోసం ఒకరు కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఉదాహరణకు.. మీ వారికి కాఫీ పెట్టివ్వడం, మీ భార్యామణి కోసం అల్పాహారం తయారు చేసి పెట్టడం, ఉద్యోగాలకు వెళ్లే వారైతే ఒకరి లంచ్‌ బాక్సుల్ని మరొకరు సిద్ధం చేయడం.. ఇవన్నీ తెలియకుండానే ఇద్దరినీ మరింత దగ్గర చేస్తాయి.

* మీ భాగస్వామి మీకోసం పెట్టిన కాఫీ బాగున్నా, అల్పాహారం రుచిగా ఉన్నా లేదంటే తను వేసుకున్న డ్రస్‌ బాగున్నా.. ఇలా ఏ విషయంలోనైనా ఓ కాంప్లిమెంట్‌ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి పొగడ్తలు ఇద్దరినీ దగ్గర చేయడమే కాదు.. సెరటోనిన్‌ అనే హ్యాపీ హార్మోన్‌ విడుదలయ్యేలా చేస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.

* నిద్ర లేవగానే హడావిడిగా ఎవరి పనుల్లోకి వాళ్లు దూరిపోవడం కాకుండా.. ఓ ఐదు పది నిమిషాల పాటు ఇద్దరూ కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందంటున్నారు నిపుణులు.

* దాంపత్యంలో అన్యోన్యత పెరగాలంటే ఇద్దరూ కలిసి కాసేపు జోక్స్‌ వేసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ఉదయాన్నే ఇలా చేయడం వల్ల ఆ జోష్‌ రోజంతా మనతోనే ఉంటుంది.

* ఆలుమగలిద్దరూ మరింత దగ్గరవ్వాలంటే అందులో శృంగారం పాత్ర కీలకం! అది కూడా ఉదయం పూట ఈ పని చేయడం వల్ల మనసు ఉత్తేజితమవుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా ఇతర పనులపైనా ఏకాగ్రత పెట్టగలుగుతాం.

మరి, అన్యోన్యమైన అనుబంధానికి మీరు ఎలాంటి సూత్రాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని