Updated : 26/08/2021 16:12 IST

వర్షాకాలం.. వ్యాధుల కాలం.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

ఆనంద్‌ హీరోయిన్‌ కమలినీ ముఖర్జీలా కీర్తనకు కూడా వర్షంలో తడవడమంటే మహా సరదా. చిటపట చినుకులు మొదలయ్యాయంటే చాలు.. ‘జల్లంత కవ్వింత కావాలిలే’ అంటూ వానలో చిందులేయడం మాత్రం మానుకోదు. ఇంకేముంది జలుబు, దగ్గు షురూ..!

అతిశుభ్రత విషయంలో వర్షిత.. ‘మహానుభావుడు’ హీరో శర్వానంద్‌కు ఏమాత్రం తీసిపోదు. అయితే ఇలా ఇంటిని ఎంత అద్దంలా మెరిపించినా, ఇంటి కాంపౌండ్‌ వాల్‌ చుట్టూ ఉన్న అపరిశుభ్రతే ఆమె అసలు చిక్కంతా! సాయంత్రం అయ్యిందంటే చాలు.. తాను ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. దోమలు తన సైన్యంతో సహా వర్షిత ఇంటిపై దాడిచేస్తాయి. అలా ఇటీవలే ఆమె ఇద్దరు పిల్లల్ని జబ్బు పడేలా చేశాయి.

వీళ్లిద్దరి మాదిరిగా ఈ కాలంలో చాలామంది చాలా రకాల అనారోగ్యాలకు లోనవుతుంటారు. వీటికి తోడు మరో పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరి, ఇలాంటి ప్రతికూల పరిస్థితులున్న ప్రస్తుత తరుణంలో సీజనల్‌ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఎక్కువగా అటాక్‌ అయ్యే వ్యాధులేంటి? వాటి బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి? తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

మసాలా ఛాయ్‌, వేడివేడి పకోడీలు, మొక్కజొన్న పొత్తులు.. వీటన్నింటితో వర్షాకాలం ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు. అయితే ఈ ఆనందంతో పాటు అనేక వ్యాధుల్నీ మోసుకొస్తుందీ కాలం. వర్షంలో ఎంజాయ్‌ చేయడం, నచ్చిన ఆహారాన్ని ఇష్టమొచ్చినట్లు తినడం వల్ల ఆ క్షణం వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మాత్రం పలు అనారోగ్యాల్ని ఎదుర్కోక తప్పదు. అందుకే వర్షాకాలంలో ఎక్కువగా అటాకయ్యే అనారోగ్యాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

‘విటమిన్‌-డి’ లోపం లేకుండా..!

ఎముకల దృఢత్వానికి విటమిన్‌ ‘డి’ చాలా అవసరం. మరి, ఈ విటమిన్‌ పొందాలంటే సూర్యరశ్మి తప్పనిసరి. అయితే ఈ కాలంలో ఆకాశం మబ్బులు పట్టడం వల్ల ఎండ వచ్చే రోజుల్ని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ఫలితంగా శరీరానికి సరిపడా విటమిన్‌ ‘డి’ అందకపోవడం వల్ల వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. పైగా వీటి ప్రభావం అన్ని వయసుల వారిపై కూడా ఉంటుందట! అంతెందుకు.. ఈ విటమిన్‌ లోపం వల్ల కరోనా వైరస్‌ సోకే అవకాశమూ ఎక్కువగానే ఉన్నట్లు వివిధ అధ్యయనాల్లో వెల్లడైన విషయం తెలిసిందే. అందుకే ఈ కాలంలో సూర్యరశ్మి లేకపోయినా విటమిన్‌-డి కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించమని సూచిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో డాక్టర్‌ సలహా మేరకు సప్లిమెంట్స్‌ తీసుకోవడంతో పాటు ‘డి’ విటమిన్‌ అధికంగా లభించే చేపలు, గుడ్లలోని పచ్చసొన, పుట్ట గొడుగులు, ఛీజ్‌, కమలాఫలం.. వంటి ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

దోమల నుంచి రక్షణకు..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దోమల బెడదతో ప్రతి ఒక్కరూ తలలు పట్టుకుంటున్నారు. ఇవి ఇంట్లోకి రాకుండా సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు అన్ని మూసేసినా, ఇంటిని పరిశుభ్రంగా ఉంచినా సరే.. ఎలాగోలా అవి ఇంట్లోకి ఎంటరైపోతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా.. వంటి అనారోగ్యాల్ని మోసుకొస్తున్నాయి. నిజానికి మనం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతున్నామనుకుంటాం.. కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే దోమలు రావడానికి కారణమవుతున్నాయి. ఇంట్లో చెత్తడబ్బాలో వేసిన చెత్త ఏ రోజుకారోజు బయట పడేయకపోవడం; ఇంటి బయట, లేదంటే ఇంట్లో నీళ్లు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకోవడం.. ఇలాంటివే దోమలు రెట్టింపు కావడానికి దోహదం చేస్తున్నాయి. ఇక ఈ దోమలు కుట్టడం వల్ల జ్వరం, తలనొప్పి.. వంటి సీజనల్‌ వ్యాధుల లక్షణాలు కనిపించినా.. అది కరోనా వల్లేనేమో అన్న భయం అందరిలో ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే దోమలను నివారించేందుకు సిద్ధం కావాలి. ఇందుకోసం ఇంటి చుట్టూ క్రిమిసంహారకాలను స్ప్రే చేయడం, నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడడం, ఒకవేళ డ్రైనేజీ నీళ్లు నిలిచి పోయి ఉంటే అందులో కాస్త కిరోసిన్‌ పోయడం, తులసి-బంతి-లావెండర్‌.. వంటి మొక్కలను ఇంటి చుట్టూ కుండీల్లో పెంచుకోవడంతో పాటు ఇంట్లో అక్కడక్కడా కొన్ని అత్యవసర నూనెలు, కర్పూరం.. వంటివి ఉంచడం వల్ల దోమల బెడదను తగ్గించుకోవచ్చు.

ఆహారం విషయంలో అజాగ్రత్త వద్దు!

ఇక ఈ వర్షాకాలంలో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు, పకోడీలు, స్వీట్‌కార్న్‌.. వంటి వాటిపైకి మనసు లాగడం సహజం. అందుకే వీధి చివర్ల వద్ద ఉండే బజ్జీల బండ్లు, పానీపూరీ బండ్లు ఈ కాలంలో కిటకిటలాడతాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ చాలామంది ఇలాంటి బండ్ల దగ్గర గుమిగూడడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసిన ఆహారం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడి నీళ్లు తాగడం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇలా కలుషితమైన ఆహారం, నీళ్ల ద్వారా ఈ కాలంలో టైఫాయిడ్‌, కలరా, వాంతులు, విరేచనాలు, జాండిస్‌.. వంటివి అటాకయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఏ అనారోగ్యం బారిన పడినా సరే.. మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఈ కాలంలో ఇలాంటి అనారోగ్యాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసిన ఆహారం, మరిగించి చల్లార్చిన నీళ్లు తీసుకోవడం మంచిది. అలాగే బయటి నుంచి తీసుకొచ్చిన కాయగూరలు, పండ్లు, ఆకుకూరల్ని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగాకే ఇంట్లోకి తీసుకురావాలి. తద్వారా అటు సీజనల్‌ వ్యాధులు, ఇటు కరోనా ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఇలా చేస్తే సీజనల్‌ అలర్జీలు పరార్!

వాతావరణంలోని మార్పుల వల్ల జలుబు, దగ్గు.. వంటి సీజనల్‌ సమస్యలు తలెత్తడం సహజం. అయితే ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వారిలో ఇవి మరింత ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి ఇంట్లో ఉండే కంటికి కనిపించని క్రిమికీటకాలు, దుమ్మును కలుగజేసే పురుగులు.. వంటివి కూడా ఇలాంటి సీజనల్‌ అలర్జీలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి వీటి బారిన పడకుండా ఉండేందుకు.. ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫయర్‌ ఏర్పాటుచేసుకోవడంతో పాటు డాక్టర్‌ సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్‌ వేయించుకోవడం కూడా మంచిదేనని సూచిస్తున్నారు. అలాగే చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం (డ్రైఫ్రూట్స్‌, ‘సి’ విటమిన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు, పెరుగు, ఆకుకూరలు.. మొదలైనవి) తీసుకోవడం, ఆవిరి పట్టడం.. వంటివి క్రమం తప్పకుండా పాటించడం వల్ల అటు సీజనల్‌ అలర్జీలకు దూరంగా ఉండచ్చు.. ఇటు కరోనా నుంచీ రక్షణ పొందచ్చు.

చర్మ సౌందర్యం తగ్గకుండా..!

వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల చర్మంపై అలర్జీలు, హైపర్‌పిగ్మెంటేషన్‌, జిడ్డుదనం-మొటిమలు.. వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. ఇంటి పనుల రీత్యా చేతులు, కాళ్లు ఎక్కువ సేపు నీటిలో నానడం వల్ల కూడా ఆయా భాగాల్లో చర్మంపై పగుళ్లు, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తాయి. అందుకే ఈ కాలంలో మన చర్మాన్ని ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇంటి పనులు చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం, బయటికి వెళ్లేటప్పుడు రెయిన్‌షూస్‌ వేసుకోవడం వల్ల చేతులు, కాళ్లను సంరక్షించుకోవచ్చు. అలాగే చర్మ ఆరోగ్యానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఇక ఎండ ఉన్నా, లేకపోయినా మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మంచిది. ఇక వీటన్నింటితో పాటు సౌందర్య నిపుణుల సలహా మేరకు ఇంట్లోనే చిన్న చిన్న బ్యూటీ చిట్కాలు పాటిస్తే అందంగా, ఆరోగ్యంగా మెరిసిపోవచ్చు.

ఇవి గుర్తుంచుకోండి!

* చాలామంది కాయగూరలు, పండ్లను ముందే కట్‌ చేసుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటుంటారు. కానీ వర్షాకాలంలో ఈ అలవాటు మానుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ కాలంలో గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు కట్‌ చేసిన ఆహారంపైకి చేరతాయి. మనం వాటిని మళ్లీ కడగకుండా తినేయడం వల్ల అవి మన కడుపులోకి చేరి లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతాయి. కాబట్టి ముందుగా ఆయా కాయగూరలు, పండ్లను ఉప్పు నీటిలో కాసేపు నానబెట్టడం, ఎప్పటికప్పుడే తాజాగా వాటిని కట్‌ చేసుకోవడం ఉత్తమం.

* వండుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉదయం వండినవి రాత్రి, రాత్రి మిగిలిపోయినవి మరునాడు ఉదయం తినడం అస్సలు మంచిది కాదు. ఏ పూటకాపూటే వేడివేడిగా వండుకొని తీసుకోవాలి.

* సాధారణంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల దాహం వేయదు. అలాగని నీళ్లు తాగకపోయారనుకోండి.. డీహైడ్రేషన్‌, ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ కాలంలోనూ మీ బరువును బట్టి సరైన మోతాదులో నీళ్లు తాగాలి. అవి కూడా మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది. ఈ చిట్కా వల్ల ప్రస్తుతం పొంచి ఉన్న కరోనా ముప్పు నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అలాగే బరువూ తగ్గచ్చు.

* మనం ఎలాంటి అనారోగ్యాల బారిన పడకూడదంటే మనలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. అందుకు మనం తీసుకునే ఆహారంతో పాటు మనం ఎంత సేపు నిద్ర పోతున్నామన్నది కూడా ముఖ్యమే..! రోజులో ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే మానసిక ఒత్తిడి, ఆందోళనలకు గురై.. దీని ప్రభావం రోగనిరోధక వ్యవస్థపై పడుతుంది.

* ఆఫీసుల్లో ఒకరు తెచ్చిన లంచ్‌ బాక్స్ మరొకరు తినడం, కూరలు పంచుకోవడం.. ఇలాంటివన్నీ కామన్‌. అయితే వర్షాకాలపు వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే ఈ అలవాటు మానుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వంట చేసే క్రమంలో మనం పరిశుభ్రత పాటించచ్చు.. కానీ అవతలి వాళ్లు పాటించకపోవచ్చు.. ఫలితంగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వైరల్‌ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది.. కాబట్టి ఏ కాలంలోనైనా మొహమాటాలకు పోయి ఇలాంటి షేరింగ్స్‌ అస్సలు వద్దంటున్నారు నిపుణులు. ఈ అలవాటు మానుకోవడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తిని కూడా అరికట్టచ్చు.

* ఇక ఈ సీజన్‌లో నూనె పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నూనెలు, కొవ్వు సంబంధిత పదార్థాలు సులభంగా జీర్ణం కావు. పైగా వర్షాకాలంలో మన జీర్ణక్రియ మందకొడిగా సాగుతుంది. కాబట్టి త్వరగా అరగని పదార్థాలు తింటే గ్యాస్ట్రిక్‌, అజీర్తి.. వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యే కాయగూరలు, సూప్స్‌, బ్రెడ్, పెరుగన్నం.. వంటివి తీసుకోవడం మంచిది.

గమనిక: వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడూ పలు అనారోగ్యాలు తలెత్తుతూనే ఉంటాయి. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే ఆయా అనారోగ్యాల్ని నయం చేసుకోవచ్చు. ఇక మీ ఆరోగ్యం గురించి ఏ చిన్న అనుమానం తలెత్తినా మీ సొంత వైద్యం కాకుండా.. నిపుణుల సలహా తీసుకున్నాకే ఆయా మాత్రలు, సప్లిమెంట్స్‌ వేసుకోవాలన్న విషయం గుర్తుపెట్టుకోండి..!


Advertisement

మరిన్ని