Published : 17/12/2022 19:05 IST

చనుబాలిచ్చేటప్పుడు.. ఇవి తెలుసుకోండి!

తల్లి పాల నుంచి పాపాయికి వివిధ రకాల పోషకాలు అందుతాయన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా పాలివ్వడం వల్ల ఇటు తల్లులకూ అనేక రకాల ప్రయోజనాలుంటాయి. బిడ్డకు ఎక్కువ కాలం పాటు పాలివ్వడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా చాలావరకు తగ్గుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే ఈక్రమంలో పాలిచ్చే తల్లులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

బిడ్డకు పాలివ్వడం వల్ల పాపాయే కాదు.. తల్లి కూడా పలు అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చన్న విషయం తెలిసిందే! అంతేకాదు.. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. ఎంత ఎక్కువ కాలం పాటు పాలిస్తే రిస్క్‌ అంత తగ్గుతుందంటున్నారు నిపుణులు.

అలాగని పాలిస్తే రాదు కదా అన్న నిర్లక్ష్యం కూడా పనికి రాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాలిచ్చే తల్లుల్లో చాలా అరుదుగా ఈ మహమ్మారి బారిన పడే అవకాశం ఉందట! ఈ క్రమంలో తరచూ ఇంట్లోనే వక్షోజాల్ని పరీక్షించుకోవడం, ఏదైనా అనుమానం కలిగితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.

అయితే పాలిచ్చే తల్లులు తమ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి మమోగ్రామ్‌ (రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధారించే పరీక్ష) చేయించుకోవచ్చా, లేదా అని అనుమానపడుతుంటారు. ఈ క్రమంలో ముందుగా డాక్టర్‌ని సంప్రదించి వారి సలహాలు పాటించాలి.

అదేవిధంగా రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత శరీరంలో, ఆరోగ్యం విషయంలో చాలా మార్పులొస్తాయి. కాబట్టి ఈ సమయంలో బిడ్డకు పాలివ్వాలనుకుంటే ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది. తద్వారా మీకు జరిగిన చికిత్సను బట్టి ఈ విషయంలో తగిన సలహా ఇస్తారు.

సాధారణంగా బిడ్డకు ఎక్కువ కాలం పాటు పాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సరే కాదు.. ఎండోమెట్రియల్‌, ఒవేరియన్‌ క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా చాలావరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రతి విషయంలోనూ కొన్ని పరిమితులుంటాయి. క్యాన్సర్ సోకడం అనేది ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో - వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటూ, ఏమాత్రం అనుమానం వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని