ఆ మాట చెబితే.. ‘అది నీకెక్కడ సాధ్యం’ అనేవారు!

పదవి కోసం కాదు.. ప్రజల శ్రేయస్సుకు పాటుపడడమే అసలైన రాజకీయ నాయకత్వ లక్షణం అంటుంటారు. 27 ఏళ్ల నదియా మొహమ్మద్‌కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి.

Published : 15 Nov 2023 12:10 IST

(Photos: Twitter)

పదవి కోసం కాదు.. ప్రజల శ్రేయస్సుకు పాటుపడడమే అసలైన రాజకీయ నాయకత్వ లక్షణం అంటుంటారు. 27 ఏళ్ల నదియా మొహమ్మద్‌కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఒక శరణార్థిగా సోమాలియా నుంచి అమెరికా వచ్చిన ఆమె.. తాను ఎక్కడుంటే అదే తన స్వస్థలం అనుకుంది.. అక్కడి ప్రజలంతా తన వారే అనుకుంది. ఈ ఆలోచనతోనే వారి శ్రేయస్సుకు పాటుపడుతూ అక్కడి ప్రజల విశ్వసనీయతను చూరగొంది. ఈ నమ్మకమే ఆమెను నాలుగేళ్ల క్రితం సెయింట్‌ లూయిస్‌ పార్క్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యురాలిని చేసింది. ఇక తాజాగా అక్కడి మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గెలిచి మేయర్‌ పదవికీ ఎంపికైంది నదియా. తద్వారా ఆ నగర మేయర్‌గా పదవి చేపట్టనున్న తొలి సోమాలీ అమెరికన్‌గా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ యువ మేయర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

సోమాలియా.. ప్రపంచంలో అత్యంత బీద దేశాల్లో ఇది ఒకటి. వేసవిలో ఇసుక తుపానులు, వర్షాకాలంలో వరదలు అక్కడి ప్రాంతాల్ని ముంచెత్తుతాయి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు తోడు తరచూ ఉగ్రవాద దాడులు, నేరాలు, ప్రజల ఆందోళనలు, హత్యలు, అపహరణలు.. అక్కడ సర్వసాధారణం! కారణమేదైనా.. ఇలాంటి చోట మనలేక కొన్నేళ్ల క్రితమే అమెరికాలోని మిన్నెసోటాకు శరణార్థిగా వచ్చింది నదియా కుటుంబం. అప్పుడు ఆమె వయసు పదేళ్లు.

రాజకీయాలపై మక్కువతో..!

మిన్నెసోటాలోని సెయింట్‌ లూయిస్‌ పార్క్‌లో స్థిరపడిన నదియా.. స్థానిక స్కూళ్లలోనే చదువుకుంది. హెచ్‌ఆర్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ప్రస్తుతం ‘ఎడ్యుకేషనల్‌ లీడర్‌షిప్‌’లో మాస్టర్స్‌ చదువుతోంది. నదియాకు చిన్న వయసు నుంచే రాజకీయాలపై మక్కువ ఎక్కువ. ‘ఎప్పటికైనా మిన్నెసోటా సిటీ మేయర్‌’ కావడమే తన లక్ష్యంగా పెట్టుకున్న నదియా.. తన కల నెరవేరాలంటే ముందు ప్రజల మెప్పు పొందాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కాలేజీకి సెలవులొచ్చినప్పుడు, ఇతర ఖాళీ సమయాల్లో తన ప్రాంత ప్రజల వద్దకు వెళ్లేది. వాళ్ల సమస్యలు తెలుసుకునేది. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది. అంతేకాదు.. ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఇంకా ఏమేం చేయాలో కూడా సలహాలిచ్చేది. ఇలా విద్యార్థిగా ఉన్న సమయంలోనే ప్రజా శ్రేయస్సుకు పాటుపడిన నదియా.. 2018లో ‘నగర మానవ హక్కుల పురస్కారం’ అందుకుంది. ఆ మరుసటి ఏడాదే సెయింట్‌ లూయిస్‌ పార్క్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యురాలిగా ఎంపికైంది నదియా. ఈ బృందంలో తొలి ముస్లిం సభ్యురాలు, అతిపిన్న వయస్కురాలు ఆమే.

ప్రజల మనిషిగా..!

గత నాలుగేళ్లుగా సెయింట్‌ లూయిస్‌ పార్క్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యురాలిగా కొనసాగుతోన్న నదియా.. తన ప్రాంత అభివృద్ధి కోసం కౌన్సిల్‌ బృందంతో కలిసి వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో గృహనిర్మాణం, ఆర్థికాభివృద్ధి, సుస్థిరత.. వంటి అంశాలపై దృష్టి సారించింది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపడంతో పాటు ప్రజల మధ్య సఖ్యత నెలకొనేందుకు పలు ప్రచార కార్యక్రమాలూ నిర్వహించిందామె.

‘రాజకీయ నాయకులు చెప్పడం, ప్రజలు వినడం.. ఎక్కడైనా ఇదే చూస్తాం. కానీ నేను మాత్రం ప్రజలకే మాట్లాడే అవకాశం కల్పిస్తున్నా.. ఇలాంటి స్వేచ్ఛనిచ్చినప్పుడే వాళ్లు తమ సమస్యల్ని బయటపెట్టగలుగుతారు. అలాగే ప్రజలు, సంస్థలు ఒకరికొకరు సహకరించుకోవాలి.. చక్కటి భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలి.. ప్రాంతమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఈ ఐకమత్యమే కావాలి..’ అంటోన్న నదియా.. తన ప్రాంత ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి, తద్వారా తన ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

వివక్షను పెకిలించి..!

ఇలా తన రాజకీయ చతురతతో నాలుగేళ్లలోనే అక్కడి ప్రజలకు తలలో నాలుకలా మారిన నదియా.. ఇటీవలే సెయింట్‌ లూయిస్‌ పార్క్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. 58 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థిని ఓడించిన ఆమె.. ఆ నగర మేయర్‌గా ఎన్నికైన తొలి సోమాలీ అమెరికన్‌గా చరిత్ర సృష్టించింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ పదవి చేపట్టనుంది నదియా.

‘నేను భవిష్యత్తులో ఈ నగర మేయర్‌ కావాలనుకుంటున్నా అని చిన్నప్పుడు ఎవరితోనైనా అంటే.. అది నీకెక్కడ సాధ్యమన్నట్లు చూసేవారు. నాలుగేళ్ల క్రితం కౌన్సిల్‌ సభ్యురాలిగా పదవి చేపట్టాకా.. నాపై ఎన్నో విమర్శలొచ్చాయి. వర్ణ వివక్ష, జాతి వివక్షకు గురయ్యా. ‘ఇంత చిన్న వయసులో ఈ బాధ్యతలన్నీ నీకెందుకు?’, ‘శరణార్థివి శరణార్థిలా ఉండు.. సోమాలియా నుంచి వచ్చి ఇక్కడ అధికారం చలాయించడమేంటి?’ అన్న వారూ లేకపోలేదు. కానీ నేను అవేవీ పట్టించుకోలేదు. ఇప్పుడు నా చిరకాల కోరిక నెరవేరడంతో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి నాకు ఓటు వేసి గెలిపించిన వారికి రుణపడి ఉంటా. ఇకపై వారి గొంతుకనవుతా. వారి సమస్యలకు పరిష్కారం చూపించడమే నా అంతిమ లక్ష్యం. ఈ క్రమంలో వర్ణ, జాతి వివక్షకు తావివ్వను..’ అంటోంది యువగళం. ప్రస్తుతం ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈ యంగ్‌ లీడర్‌.. మరోవైపు కొన్ని సంస్థలకు డీఈఐ (డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్‌) నిపుణురాలిగా కొనసాగుతోంది. ఇక ఖాళీ సమయాల్లో తన కుటుంబంతో సమయం గడపడానికి ఆసక్తి చూపుతానంటోన్న నదియాకు.. ప్రయాణాలంటే ఇష్టమట!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్