విమానాలకు దారి చూపిస్తారు!

రోడ్డుపై ట్రాఫిక్‌ రద్దీని ఎలా నియంత్రిస్తారో మనందరికీ తెలుసు! మరి ఆకాశంలో రద్దీని ఎలా నియంత్రిస్తారో తెలుసా? ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏమరుపాటుకు తావులేని పని.

Updated : 11 Mar 2023 05:06 IST

రోడ్డుపై ట్రాఫిక్‌ రద్దీని ఎలా నియంత్రిస్తారో మనందరికీ తెలుసు! మరి ఆకాశంలో రద్దీని ఎలా నియంత్రిస్తారో తెలుసా? ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏమరుపాటుకు తావులేని పని. ఈ వృత్తిలో రాణిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న అమ్మాయిలు..

ముంబయి, దిల్లీ, బెంగళూరు తర్వాత అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. రోజూ 500 వరకు విమానాలు రాకపోకలు సాగిస్తాయిక్కడ. వీటిని నియంత్రించే కీలకమైన వ్యవస్థే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ). వాతావరణ మార్పులకు అనుగుణంగా పైలట్లకు దిశానిర్దేశం చేస్తూ, సురక్షితంగా అవి గమ్యానికి చేరేలా చూసే ఈ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మొత్తం 105 మంది సిబ్బంది విధుల్లో ఉంటే అందులో 30 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఏమరుపాటుకు ఏమాత్రం చోటులేని ఈ విభాగంలో విజయవంతంగా రాణిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లు, అకాడమీలు, బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వేర్వేరు ఏటీసీ కేంద్రాలున్నాయి. రక్షణ రంగానికి సంబంధించిన నిర్వహణ అంతా డిఫెన్స్‌ సిబ్బంది పర్యవేక్షణలో ఉండగా.. బేగంపేట్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుల్లోని వ్యవస్థ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పర్యవేక్షణలో ఉంది. రాత్రివేళల్లో అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఇంత రద్దీ నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు రాడార్‌ పరిధిలోని 10 నాటికల్‌ మైళ్ల వ్యాసార్ధంలో వాటి మార్గాలను సునిశితంగా గమనిస్తూ, పైలట్లతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉండకూడదు. విమానాల వేగం, వాటి మార్గాలు, వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తుండాలి. ల్యాండ్‌ అయ్యే విమానాలు.. టేకాఫ్‌ అయ్యే విమానాల మధ్య సమయాన్ని బేరీజు వేస్తూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు రాడార్‌ వ్యవస్థ నుంచి అవతలి రాడార్‌కు అనుసంధానమవుతూ ఉంటారు.


ఒత్తిడి ఉన్నా సరే..

ఏడేళ్లుగా ఈ విభాగంలో పనిచేస్తున్నా. ప్రతి క్షణం ఒత్తిడి ఉంటుంది. 2016 వరకు టీసీఎస్‌లో సిస్టమ్‌ ఇంజినీర్‌గా పనిచేశా. మొదట్లో ఈ ఉద్యోగం ఏంటి.. ఎలా ఉంటుంది అనే ప్రాథమిక విషయాలు కూడా తెలియవు. ఆ సమయంలో తెలిసిన వాళ్ల ద్వారా ఏటీసీ విభాగానికి వెళ్లి అక్కడి వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించా. అప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. మా అన్నయ్య సైంటిస్ట్‌... ఆయనే నాకు స్ఫూర్తి. ఉద్యోగంలో చేరాక అమ్మా, నాన్న, అన్నయ్య అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తే అందరూ ఎంతో గర్వంగా ఫీలయ్యారు.

-సుకన్య, విశాఖపట్నం.


అలా మనసుపడ్డా... 

మొదటిసారి ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు ఈ ఏటీసీ టవర్‌ చూశా. దాని గురించి తెలుసుకున్నాక ఈ రంగంలో చాలా నేర్చుకోవచ్చని అనిపించింది. 2018లో బీటెక్‌ పూర్తి చేశాక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించా. అప్పుడే ఏఏఐ నోటిఫికేషన్‌ చూసి దరఖాస్తు చేశా. పరీక్షలు, ఇంటర్వ్యూ పూర్తయ్యాక మొదటి పోస్టింగ్‌ ఇక్కడే వచ్చింది. ఒకసారి టవర్‌లోకి అడుగుపెట్టాక మొబైల్‌ను పక్కన పెట్టాల్సిందే. అది ప్రతి ఏటీసీలోనూ ఉండే నిబంధనే. ఏకాగ్రతతో పనిచేయాల్సిన ఉద్యోగం ఇది. మావారి ప్రోత్సాహంతో ఇంటినీ, కెరియర్‌ని సమన్వయం చేసుకుంటున్నా.

-స్వాతి, ఉత్తరప్రదేశ్‌


.. అలాంటప్పుడు సవాలే!

బాధ్యతతో పాటు జవాబుదారీతనం ఉండే వృత్తి ఇది. పదేళ్ల క్రితం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన పరీక్షల్లో దేశవ్యాప్తంగా 200 మందిని ఎంపిక చేస్తే అందులో 24 మంది మహిళలం ఉన్నాము. మహిళలు ప్రవేశించని రంగమే అయినా వెనకడుగు వేయలేదు. మార్పు మాతోనే మొదలవ్వాలనుకున్నా. అనుకున్నట్టుగానే ఇక్కడ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. బీటెక్‌ చదువుతున్నప్పుడు ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టు చేస్తున్న సమయంలో ఈ ఏటీసీ గురించి తెలిసింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ తర్వాత పోస్టింగ్‌ వచ్చింది. సవాళ్లు ప్రతిరంగంలో ఉన్నట్టే ఇక్కడా ఉంటాయి. జీవితాన్ని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడం ముఖ్యం. వాతావరణం సరిగా లేని సమయంలో, పైలట్లకు దిశానిర్దేశం చేయడం చాలా కష్టం. పదేళ్ల అనుభవంలో అలాంటి ఘటనలు ఎన్నో ప్రత్యక్షంగా చూశా.

విప్లవ, విజయవాడ. 

కాసాల ప్రశాంత్‌గౌడ్‌, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్