Published : 28/09/2022 12:51 IST

కుటుంబంతో వెకేషన్‌ ప్లాన్‌ చేస్తున్నారా?

పిల్లలిద్దరికీ దసరా సెలవులిచ్చేశారు.. మనమూ ఓ నాలుగు రోజులు ఆఫీస్‌కు సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్లొద్దామండీ.. అంటోంది కావేరి తన భర్తతో!

అంజలి కూడా ప్రస్తుతం వెకేషన్‌కి వెళ్లే హడావిడిలోనే ఉంది. ముందు నుంచే దీని కోసం ప్లాన్‌ చేస్తోన్న ఆమె ఈసారి మేఘాలయను ఎంచుకుంది.

పిల్లలకు సెలవులొస్తున్నాయంటే.. ఆఫీసుకు సెలవు పెట్టి ఇలాంటి టూర్లు, వెకేషన్లకు ప్రణాళిక వేసుకునే వారు ఎంతోమంది ఉంటారు. అయితే ఈ క్రమంలో కొంతమంది మహిళలు తెలిసో, తెలియకో చేసే కొన్ని పొరపాట్లు వారు వెకేషన్‌ని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నాయంటున్నారు నిపుణులు. అందుకే పర్యాటక ప్రదేశానికి వెళ్లాలని ప్రణాళిక వేసుకునే ముందే కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా ఆ పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకుందాం రండి..

త్యాగం వద్దు!

వెకేషన్‌ అనగానే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిస్తుంటారు. వాళ్లకు నచ్చిన ప్రదేశానికి వెళ్లడానికే నిర్ణయించుకుంటారు. ఇక కొందరు మహిళలు తమ భర్త, పిల్లలకు ఇష్టమైతే చాలు.. తనదేముంది? అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. మిగతా విషయాలేమో గానీ.. పర్యటనకు ప్లాన్‌ చేసుకునే విషయంలో మాత్రం ఈ త్యాగాలను పక్కన పెట్టడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్లే వెకేషన్‌ కోసం అందరికీ నచ్చిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటేనే టూర్‌ని పూర్తిగా ఆస్వాదించగలం అంటున్నారు. అలాగే దీంతో పాటు సీజన్‌ను బట్టి వెళ్లాలనుకునే ప్రాంతాన్ని ఎంచుకోవడమూ ముఖ్యమే! ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే మేఘాలయ, కూర్గ్‌ (కర్ణాటక), లోనావాలా (మహారాష్ట్ర), గోవా.. వంటి ప్రదేశాలు మరింత ఆహ్లాదాన్ని పంచుతాయంటున్నారు నిపుణులు.

టూర్‌.. ఎన్ని రోజులు?

పర్యటన అనగానే.. మళ్లీ ఈ అవకాశం ఎప్పటికి వస్తుందోనన్న ఆలోచనలో ఉంటారు చాలామంది. ఈ క్రమంలోనే రోజుల తరబడి వెకేషన్‌కి ప్లాన్‌ చేసుకుంటారు. అయితే టూర్ ఎన్ని రోజులు అన్న విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే సెలవుల్లో టూర్లే కాదు.. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. పిల్లలకు ప్రాజెక్ట్‌ వర్క్‌ అని, ప్రత్యేక కోర్సులని, వారికి నచ్చిన అంశాల్లో శిక్షణ ఇప్పించాలని.. ఇలా ఎవరి ప్రణాళికలు వాళ్లకుంటాయి. కాబట్టి సెలవులన్నీ వెకేషన్‌లోనే గడిచిపోతే ఉపయోగం ఉండదు. అలాగే ఆఫీసులో మీరు చేయాల్సిన పనులు కూడా వాయిదా పడిపోతాయి. కాబట్టి ఈ సెలవుల్ని అటు వినోదానికి, ఇటు విజ్ఞానానికి కేటాయించేలా ప్లాన్‌ చేసుకోవాలి.

ఆ లగేజీ తగ్గించండి!

పర్యటనలనగానే చాలామంది మహిళలు.. తమ వెంట తీసుకెళ్లే స్నాక్స్‌పై దృష్టి పెడుతుంటారు. బయట ఆహారం తినడం మంచిది కాదని.. ఇంటి వద్ద నుంచే బోలెడన్ని పిండి వంటకాలు సిద్ధం చేసుకొని తీసుకెళ్తుంటారు. సమయం లేని వారు ఆర్డర్‌ ఇచ్చి మరీ తయారుచేయించుకుంటారు. నిజానికి అసలు లగేజీ కంటే వీటి బరువే ఎక్కువవుతుంది. ఇది సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఒక చోటికి వెళ్లినప్పుడు ఇలాంటి చిరుతిండ్లు, నూనె పదార్థాలు అమితంగా తీసుకుంటే దాని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. కాబట్టి అన్నీ కాకుండా కొన్ని ఆరోగ్యకరమైన పదార్ధాలను మాత్రమే ప్యాక్‌ చేసుకుంటే మితంగా తినచ్చు. అలాగే వెళ్లిన చోట కూడా అన్ని రకాల రుచుల్ని ఆస్వాదించాలన్న ఆతృత ఉంటుంది చాలామందికి! ఇది కూడా మంచిది కాదు.. దీనివల్ల డబ్బు కూడా వృథా! అందుకే అక్కడ బాగా పేరుపొందిన వంటకాల రుచుల్ని ఆస్వాదించడం మంచిది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండే పదార్థాలేమైనా ఉంటే ప్యాక్‌ చేయించుకొని ఇంటికొచ్చాక నెమ్మదిగా వాటి రుచిని ఆస్వాదించచ్చు.

కలిసి వెళ్లినా.. ఏకాంతంగా!

కుటుంబం, పిల్లలతో కలిసి టూర్‌కి వెళ్లినప్పుడు అందరూ ఒకే హోటల్‌ రూమ్‌ బుక్‌ చేసుకోవడం పరిపాటే! దీనివల్ల బడ్జెట్‌ కలిసొస్తుంది.. పిల్లలూ సురక్షితంగా ఉంటారనేది చాలామంది ఆలోచన! కానీ అందరితో కలిసి వెళ్లినా భార్యాభర్తలు కూడా తమకంటూ కాస్త ఏకాంత సమయం కేటాయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు బుక్‌ చేసుకునే హోటల్‌లో కనెక్టింగ్‌ రూమ్స్ సదుపాయం ఉందో, లేదో తెలుసుకోండి. దీనివల్ల ఇంట్లో మాదిరిగానే మీరూ మీ గదిలో ఉండచ్చు.. అటు పిల్లల్నీ వాళ్ల గదిలో పడుకోబెట్టచ్చు. వాళ్ల పైనా ఓ కన్నేసి ఉంచచ్చు.

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నారా?

వెకేషన్‌కి ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకున్న తర్వాత అందుకోసం ఫ్లైట్‌ టికెట్స్, హోటల్‌ రూమ్స్.. మొదలైనవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. అయితే ఇలా ప్లానింగ్‌ అంతా ముందుగానే పూర్తయినా కొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా ప్రయాణం రద్దు కావచ్చు.. లేదంటే వాయిదా పడచ్చు. ఈ క్రమంలో- ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మీరు వెళ్లిన చోట మీ వస్తువులేమైనా పోగొట్టుకున్నా, మీకు ఏమైనా ప్రమాదం జరిగినా, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తినా.. ఇలా ఈ ఖర్చులన్నీ ఈ పాలసీ కింద కవరవుతాయంటున్నారు. ఇలాంటి ఒక బీమా ఉంటే.. వెకేషన్‌ని సంతృప్తిగా ఆస్వాదించచ్చంటున్నారు. ముఖ్యంగా తరచూ వెకేషన్లకు ప్లాన్‌ చేసుకునే వారికి ఈ పాలసీ ప్రయోజనకరంగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని