Published : 12/01/2023 20:58 IST

చిరు ధాన్యాల లడ్డు.. చెరకు మురుకులు..

‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. సరదాలు తెచ్చిందే తుమ్మెదా..’ అంటూ తెలుగు ప్రజలంతా సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకునే అతి ముఖ్యమైన పండగే మకర సంక్రాంతి. ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకొనే ఈ పండగలో భాగంగా రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడిపందాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలుంటాయి. అంతేనా.. పండగొచ్చిందంటే చాలు.. ప్రత్యేకమైన పిండి వంటలతో తెలుగు లోగిళ్లన్నీ ఘుమఘుమలాడతాయి. మరి, ఈ సంక్రాంతి సందర్భంగా నోరూరించే కొన్ని ప్రత్యేక వంటకాలు..

చిరు ధాన్యాల లడ్డు

కావాల్సినవి

కొర్రలు, రాగులు, సజ్జలు, అరికలు, సామలు, పెసరపప్పు, బార్లీ- తగినన్ని

తురిమిన బెల్లం

యాలకుల పొడి

నెయ్యి

జీడిపప్పు

తయారీ

ముందుగా స్టౌపై ఒక ప్యాన్‌ పెట్టి.. అందులో నెయ్యి వేడి చేసి జీడిపప్పును దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్‌లో కొర్రలు, రాగులు, సజ్జలు, అరికలు, సామలు, పెసరపప్పు, బార్లీలను ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయించుకొని చల్లార్చుకోవాలి. ఆపై వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దీనిలో తురిమిన బెల్లం కూడా వేసి మళ్లీ గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని.. ఇందులో వేయించిన జీడిపప్పు, కరిగించిన నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. అరచేతులకు నెయ్యి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. ఇలా తయారైన లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 2-3 వారాల పాటు నిల్వ ఉంటాయి.


మొక్కజొన్న గారెలు

కావాల్సినవి

మొక్కజొన్న గింజలు - ఒకటింపావు కప్పు

శెనగపప్పు - అరకప్పు (గంట పాటు నీళ్లలో నానబెట్టాలి)

ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగినవి)

అల్లం - చిన్నముక్క

జీలకర్ర - అరటీస్పూన్

తరిగిన కొత్తిమీర - కొద్దిగా

ఉప్పు - రుచికి తగినంత

నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ

ముందుగా మిక్సీ జార్‌లో కప్పు మొక్కజొన్న గింజలు, నానబెట్టిన శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం.. వేసి బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, మిగిలిన పావు కప్పు మొక్కజొన్న గింజలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అరచేతులకు కాస్త నూనె రాసుకొని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని మునివేళ్లతో గారెల మాదిరిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసుకొని ఈ గారెల్ని అందులో వేసి బంగారు వర్ణంలో మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రడీ!


చెరకు మురుకులు

కావాల్సినవి

చెరకు రసం - అర కప్పు

బియ్యప్పిండి - కప్పు

వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు (కరిగించినది)

నువ్వులు - టీస్పూన్

ఉప్పు - టీస్పూన్

నూనె - డీప్‌ ఫ్రైకు సరిపడా

తయారీ

ఒక గిన్నెలో బియ్యప్పిండి, వెన్న, నువ్వులు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆపై ఇందులో చెరుకు రసాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ, చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ పై బాండీ పెట్టి అందులో డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇందాక తయారుచేసుకున్న పిండి మిశ్రమాన్ని మురుకుల ప్రెస్సర్‌లో వేసుకొని నూనెలో ఒత్తుకోవాలి. వీటిని డీప్‌ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెరకు మురుకులు రడీ అయినట్లే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని