Published : 09/10/2022 14:25 IST

ఈ నొప్పులు గమనిస్తే జాగ్రత్త!

సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. కేవలం పిరియడ్స్ అప్పుడే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా కడుపునొప్పి రావడం మనం గమనిస్తూనే ఉంటాం. దీనికి సరైన కారణమేంటో చాలామందికి తెలియకపోవచ్చు. పైగా ఇది చిన్న సమస్యే కదా అని దాన్ని అశ్రద్ధ చేయడం లేదా ఇంటి చిట్కాలు పాటించడం.. అదీ కాదంటే మాత్రలు వేసుకోవడం.. ఇలా దాన్నుంచి ఏదోలాగా ఉపశమనం పొందుతుంటాం. అయితే ఇలా చేసే ముందు నొప్పి వస్తున్న విధానాన్ని బట్టి అది ఎలాంటి ఆరోగ్య సమస్యలకు సూచనో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా నొప్పిని గుర్తించి, దాన్ని వైద్యులకు వివరించి సరైన చికిత్స పొందే అవకాశం కూడా ఉంటుంది.

ఇన్ఫెక్షన్ కావచ్చు..

మూత్రనాళంలో మొదలై పొత్తికడుపు వరకు నొప్పి చేరుకొంటే దాన్ని మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లకు సూచనగా భావించాలి. కడుపు నొప్పితో పాటు యూరిన్‌కి వెళ్లేటప్పుడు మంట, నొప్పి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు. కొన్ని సందర్భాల్లో మూత్రంతో పాటు రక్తం కూడా పడే అవకాశాలుంటాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. ఇన్ఫెక్షన్ ప్రభావం కిడ్నీల వరకు వ్యాపిస్తుంది. అప్పుడప్పుడూ మూత్ర వ్యవస్థలో కణితులు ఏర్పడటం వల్ల కూడా ఇలా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మూత్రనాళం నుంచి పొత్తికడుపు వరకు నొప్పి వస్తున్నట్లయితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించడం మంచిది. మూత్రపరీక్ష చేయడం ద్వారా వైద్యులు మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకొని ఆ తర్వాత చికిత్స చేయడం ప్రారంభిస్తారు. అంతేకానీ.. చిన్న సమస్యే కదా అని వదిలేస్తే అది క్రమంగా ప్రాణాల మీదకు వచ్చే అవకాశమూ లేకపోలేదు.

పొత్తికడుపు మధ్యభాగంలో..

కొంతమంది మహిళల్లో పొత్తికడుపు మధ్య భాగంలో తరచూ నొప్పి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీనికి గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయాల్లో ఏదో ఒకదానిలో నొప్పి వస్తున్నట్లు భావించాలి. ఇది మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఎండో మెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్, అండాశయాల్లో సిస్టులు.. వంటి ఆరోగ్య సమస్యలకు సూచనగా భావించాలి. వీటిని నిర్లక్ష్యం చేస్తే.. గర్భస్రావం జరగడం లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (ఫెలోపియన్ ట్యూబ్స్‌లో బిడ్డ పెరగడం) వంటి క్లిష్టమైన సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి పొత్తికడుపు మధ్య భాగంలో తరచూ నొప్పి వస్తుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

బొడ్డు దగ్గర మొదలై..

కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి బొడ్డు దగ్గర మొదలై ఛాతీ వరకు పాకుతుంది. దాంతో పాటు కడుపులో మండుతున్నట్లుగానూ అనిపిస్తే అది పెప్టిక్ అల్సర్‌కి సూచనగా భావించవచ్చు. ముఖ్యంగా ఇది రాత్రివేళల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనితో పాటు ఒక్కసారిగా బరువు తగ్గడం, ఆహారం జీర్ణం కాకపోవడం, వాంతులవడం, ఛాతీ నొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.

కడుపు ఉబ్బరంతో పాటు..

కడుపు ఉబ్బినట్లుగా అనిపించడంతో పాటు ఎక్కువ నొప్పి వస్తే.. అది ఉదర సంబంధిత క్యాన్సర్లకు సూచన కావచ్చు. కాబట్టి సత్వరమే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

కటిభాగంలో..

కొంతమంది స్త్రీలలో కటిభాగంలో చాలా తక్కువ స్థాయిలో నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి తీవ్రత తక్కువగా ఉంది కదా అనే ఉద్దేశంతో చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆరు నెలలకు మించి ఈ నొప్పిని భరిస్తున్నట్లయితే.. దాన్ని పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్‌కి సూచనగా భావించాలి. దీనికి సత్వరమే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. కాబట్టి నొప్పి తీవ్రస్థాయికి చేరుకోకముందే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని