Afghanistan: అప్పట్లో పేరొందిన జర్నలిస్టు.. ‘తాలిబన్ల ఇలాకాలో సమోసాలు అమ్ముకుంటూ..’

అఫ్గాన్‌లో గుర్తింపు పొందిన ఓ జర్నలిస్టు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రస్తుతం వీధుల్లో ఆహారం అమ్ముకుంటున్న ఫొటోలు అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

Published : 17 Jun 2022 02:23 IST

దీనస్థితిలో అఫ్గాన్‌ పౌరులు

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత ఇతర దేశాలతో అక్కడి ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల పాలనను ఇప్పటికీ ప్రపంచ దేశాలు గుర్తించకపోవడంతో వారితో దౌత్య, వాణిజ్య సంబంధాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఇలా అక్కడ నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ఎంతోమంది నైపుణ్యం కలిగిన అఫ్గాన్‌వాసులు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అఫ్గాన్‌లో గుర్తింపు పొందిన ఓ జర్నలిస్టు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రస్తుతం వీధుల్లో ఆహారం అమ్ముకుంటున్న ఫొటోలు అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

ముసా మొహమ్మది అనే అఫ్గాన్‌ టీవీ యాంకర్‌ అక్కడి వీధుల్లో ఆహారం అమ్ముకుంటూ జీవనం సాగిస్తోన్న ఫొటోను అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ ప్రభుత్వంలో పనిచేసిన కబీర్‌ హక్మల్‌ ట్వీట్‌ చేశారు. ‘ఎన్నో ఏళ్లుగా మీడియా రంగంలో ఉన్న హక్మల్‌.. అత్యంత దారుణమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆయనకు ఎటువంటి ఆదాయం లేదు. దీంతో ప్రస్తుతం వీధుల్లో ఆహారం అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత అఫ్గాన్‌ కనీవిని ఎరుగని పేదరికాన్ని ఎదుర్కొంటోంది’ అని పేర్కొన్నాడు. కబీర్‌ హక్మల్‌ చేసిన ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతోపాటు అక్కడి నేషనల్‌ రేడియో, టెలివిజన్‌ డైరెక్టర్‌ అహ్మదుల్లా వాసిక్‌ దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన ఆయన.. మాజీ టీవీ జర్నలిస్టుకు తన విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నాడు. అంతేకాకుండా అఫ్గాన్‌ నిపుణులందరూ తమకు ఎంతో అవసరమని చెప్పుకొచ్చాడు.

ఇదిలాఉంటే, తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత అఫ్గాన్‌లో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే మహిళా ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తోన్న తాలిబన్లు.. బాలికల విద్యకు ఆటంకం కలిగిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. మరోవైపు తాలిబన్ల పాలనలో అఫ్గాన్‌ తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఐరాస కూడా పేర్కొంది. ఇలా అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న అఫ్గాన్‌లో పౌరుల తలసరి ఆదాయం దారుణంగా పడిపోయిందని ప్రపంచ బ్యాంకు ఇటీవలే వెల్లడించింది. ప్రపంచంలో పేదదేశాల్లో ఒకటైన అఫ్గాన్‌.. ప్రస్తుతం మరింత పేదదిగా మారిందని ప్రపంచ బ్యాంకు సీనియర్‌ ఆర్థికవేత్త టొబియస్‌ హక్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు