రిపోర్టింగ్‌ చేస్తుండగా జర్నలిస్టు తలపై తుపాకీతో కాల్చి..

పాలస్తీనా.. ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణలు నానాటికీ తీవ్రంగా మారుతున్నాయి. జెనిన్‌లోని ఆక్రమిత్ వెస్ట్‌ బ్యాంక్‌ పట్టణంలో ఇజ్రాయెల్‌ దళాలు చేపట్టిన దాడుల్లో అల్‌

Published : 11 May 2022 14:37 IST

ఇజ్రాయెల్‌ దాడుల్లో అల్‌ జజీరా మహిళా విలేకరి దారుణ హత్య

జెరూసెలం: పాలస్తీనా.. ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణలు నానాటికీ తీవ్రంగా మారుతున్నాయి. జెనిన్‌లోని ఆక్రమిత్ వెస్ట్‌ బ్యాంక్‌ పట్టణంలో ఇజ్రాయెల్‌ దళాలు చేపట్టిన దాడుల్లో అల్‌ జజీరాకు చెందిన ఓ ప్రముఖ రిపోర్టర్‌ మృతిచెందారు. అయితే ఆమెను అతి దారుణంగా హత్య చేశారంటూ అల్‌ జజీరా ఆరోపిస్తోంది.

పాలస్తీనాకు చెందిన షిరీన్‌ అబు అఖ్లే అల్‌ జజీరా సంస్థలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జెనిన్‌ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరుపుతోన్న దాడులను ఆమె కవర్‌ చేస్తున్నారు. బుధవారం కూడా ఈ ఘర్షణలను కవర్‌ చేస్తుండగా అక్కడ జరిగిన కాల్పుల మోతలో షిరీన్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పాలస్తీనా జర్నలిస్టు కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారు.

ఘటన సమయంలో షిరీన్‌ బుల్లెట్‌ జాకెట్ ధరించింది. దానిపై ప్రెస్‌ అని కూడా రాసి ఉంది. షిరీన్‌ మృతిని అల్‌ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్‌ దళాలు ఉద్దేశపూర్వకంగానే ఆమెపై కాల్పులు జరిపారని, ఇది దారుణ హత్య అని ఆరోపించింది. అటు ఖతార్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కూడా దీనిపై స్పందించారు. షిరీన్‌ ప్రెస్‌ వెస్ట్‌, హెల్మెట్‌ ధరించారని, అయితే ఆమె తలపై తుపాకీతో కాల్చడంతో మరణించారని పేర్కొన్నారు. కాగా.. ఇజ్రాయెల్‌ మాత్రం ఈ ఆరోపణలు తోసిపుచ్చింది. పాలస్తీనా గన్‌మెనే ఆమెను కాల్చి ఉంటారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఆ దేశ మిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది. 51 ఏళ్ల షిరీన్‌ 1997 నుంచి అల్‌ జజీరాలో పనిచేస్తున్నారు.

వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాన్ని 1967 యుద్ధంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఈ భూభాగం కోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని