Royal Navy: జలాంతర్గాముల్లో లైంగిక వేధింపులు..! విచారణకు ఆదేశించిన బ్రిటన్‌ రాయల్‌ నేవీ

బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన జలాంతర్గాముల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోఫీ బ్రూక్‌ అనే మాజీ నౌకాదళ అధికారి ఇంటర్వ్యూ ఆధారంగా ఓ వార్తాసంస్థ శనివారం ప్రచురించిన కథనం తీవ్ర చర్చనీయాంశమైంది.

Published : 30 Oct 2022 01:34 IST

లండన్‌: బ్రిటన్‌ రాయల్‌ నేవీ(Royal Navy)కి చెందిన జలాంతర్గామి(Submarines)ల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల(Sexual Harassment) ఆరోపణల విషయంలో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోఫీ బ్రూక్‌ అనే మాజీ నౌకాదళ అధికారి ఇంటర్వ్యూ ఆధారంగా ఓ వార్తాసంస్థ శనివారం ప్రచురించిన కథనం తీవ్ర చర్చనీయాంశమైంది. లైంగిక వేధింపులు, మహిళా సిబ్బందిపై  ‘అత్యాచార జాబితా’ రూపొందించడం వంటి దుశ్చర్యలను ఆమె వెల్లడించారు. మరికొందరి ఆరోపణలను కథనంలో ఉటంకించారు.

దీంతో.. బ్రిటన్‌ నేవల్‌ స్టాఫ్‌ చీఫ్‌ బెన్‌ కీ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ‘లైంగిక ఆరోపణలు దిగ్భ్రాంతికరం. రాయల్‌ నేవీలో వీటికి చోటే లేదు. ఇటువంటి వాటిని సహించం. దోషులుగా తేలిన వారెవరైనా.. ర్యాంకుతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వెల్లడించారు.

బ్రిటన్‌ రాయల్ నేవీ.. 2011 నుంచి తన సబ్‌మెరైన్‌ సేవల్లో మహిళా సిబ్బందిని నియమిస్తోంది. ఈ క్రమంలోనే సోఫీ బ్రూక్‌ సైతం విధుల్లో చేరారు. కొన్నేళ్లకు జలాంతర్గామి కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించాలంటూ ఆమెకు ఆదేశాలు అందాయి. కానీ, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు భరించలేక అంతలోనే ఆమె ఆత్మహత్యకు యత్నించారు. దీంతో నేవీ ఆమెను విధుల్లోంచి తొలగించింది. తదనంతరం ఆమె.. తన ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

‘అత్యాచార జాబితానూ రూపొందించారు’

‘విధుల సమయంలో కొంతమంది లైంగికంగా వేధించేవారు. నిద్రపోయే సమయంలో శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవారు. ఏదైనా విపత్తు సంభవించినట్లయితే.. ముందుగా అత్యాచారం చేయాల్సిన మహిళా సిబ్బంది జాబితానూ రూపొందించారు. అందులో నా పేరు కూడా ఆరో స్థానంలో ఉండటం చూసి షాక్‌కు గురయ్యా. నగ్న చిత్రాల ప్రదర్శన, లైంగిక వేధింపులపై మహిళా సిబ్బంది అధికారికంగా చేసిన ఫిర్యాదునూ తొక్కిపెట్టారు. తనను తాను గాయపర్చుకుని, విధుల నుంచి బయటకు వచ్చినా.. ఆమెపై నిరంతరం నిఘా ఉంచారు’ అని బ్రూక్‌ తన ఇంటర్వ్యూలో ఆరోపించారు.

బాధితులకు న్యాయ సహాయం అందించే స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ మిలిటరీ జస్టిస్’ డైరెక్టర్ ఎమ్మా నార్టన్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల బారినపడే మహిళల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే అధికారికంగా ఫిర్యాదు చేస్తారని తెలిపారు. న్యాయం దక్కదనే భావనతో చాలామంది ముందుకు రారని చెప్పారు. ఇటువంటి ఫిర్యాదుల విషయంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని రాయల్ నేవీకి పదే పదే సిఫార్సులు చేసినా.. తగు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని నార్టన్ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని