BRICS summit: వేదికను పంచుకోనున్న మోదీ-జిన్‌పింగ్‌..!

దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్‌ సదస్సు (15th BRICS summit)కు చైనా అధ్యక్షుడు వ్యక్తిగతంగా హాజరు అవుతారని ఆ దేశ విదేశాంగ ప్రకటించింది.

Published : 18 Aug 2023 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) మరోసారి భేటీ కానున్నారు. వచ్చే వారం దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్‌ సదస్సు (15th BRICS summit) ఇందుకు వేదిక కానుంది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు వ్యక్తిగతంగా హాజరు అవుతారని ఆ దేశ విదేశాంగ ప్రకటించింది. దీంతో మోదీ-జిన్‌పింగ్‌ భేటీపై ఆసక్తి నెలకొంది. ఇరువురు నేతలు చివరిసారి గతేడాది నవంబర్‌లో బాలి (ఇండోనేసియా)లో జరిగిన జీ20 సదస్సులో మాట్లాడుకున్నారు. అంతకుముందు ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో మాత్రం ఇద్దరు నేతలు పలకరించుకోకపోవడం గమనార్హం.

అంతర్జాతీయ వ్యవహారాలపై పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి సవాలు చేసే భౌగోళిక రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలనే విషయంపై చర్చించేందుకు బ్రిక్స్ (BRICS) దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో జొహాన్నెస్‌బర్గ్‌ వేదికగా ఆగస్టు 22-24 తేదీల్లో సమావేశం కానున్నాయి. అయితే, ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యక్తిగతంగా పాల్గొనడం లేదని దక్షిణాఫ్రికా ఇటీవలే వెల్లడించింది. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు అరెస్టు వారెంటు ఉండటం.. దక్షిణాఫ్రికా వెళ్తే అరెస్టు తప్పదనే భయంతో పుతిన్‌ ఇందుకు దూరంగా ఉన్నారు. దీంతో రష్యా అధ్యక్షుడు మినహా.. బ్రిక్స్‌ సభ్యదేశాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

పలకరించుకోని మోదీ, జిన్‌పింగ్‌.. వేదికపై ఎడముఖం పెడముఖం.!

బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్న ఈ కూటమి.. 2019 తర్వాత తొలిసారి ముఖాముఖీగా భేటీ అవుతోంది. సభ్యదేశాల్లో ఒకటైన రష్యా.. ఉక్రెయిన్‌పై ఏడాదిన్నరగా యుద్ధం చేయడం, దక్షిణాఫ్రికా ఆర్థిక పరిస్థితి దిగజారుతుండటం, భారత్‌-చైనాల మధ్య పలు అంశాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో ఈ సభ్యదేశాలన్నీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని