China: స్వయంగా కొవిడ్‌ అంటించుకున్న చైనా లేడీ సింగర్‌.. ఎందుకో తెలుసా..!

చైనాలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోన్న వేళ.. ఓ ప్రముఖ గాయని ఉద్ధేశపూర్వకంగా కొవిడ్‌ అంటించుకున్నట్లు వెల్లడించింది. నూతన సంవత్సర వేడుకల్లో ఓ ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపిన ఆమె.. అప్పుడు వైరస్‌ సోకితే ఇబ్బంది అవుతుందని ముందస్తుగానే వైరస్‌ సోకేలా ప్రయత్నించానంటూ సోషల్‌ మీడియాలో ఆమె స్వయంగా వెల్లడించింది.

Published : 22 Dec 2022 14:59 IST

బీజింగ్‌: చైనాలో (China) విజృంభిస్తోన్న కరోనా వైరస్.. అక్కడ విలయతాండవం చేయనుందనే వార్తలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. వైరస్‌ సోకి లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి తరుణంలో కొవిడ్‌కు దూరంగా ఉండేందుకు పౌరులు జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఓ మహిళా సింగర్‌ మాత్రం ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్‌ను అంటించుకుంది. వచ్చే నూతన సంవత్సర వేడుకల్లో తానో కార్యక్రమంలో పాల్గొంటున్నానని.. అప్పుడు కరోనా వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ముందస్తుగానే వైరస్‌ బారిన పడినట్లు చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించడంతో సామాజిక మాధ్యమాల్లో సదరు సింగర్‌ తీరుపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.

‘నూతన సంవత్సర వేడుకల్లో (China New Year) ఇవ్వబోయే ప్రదర్శన సమయంలో అనారోగ్యం బారినపడతానేమోననే ఆందోళన చెందా. నాతోపాటు సహచరులకూ ఇబ్బంది కలుగుతుందని భావించా. అందుకే పాజిటివ్‌ వచ్చిన కొందరు వ్యక్తుల ఇళ్లకు నేరుగా  వెళ్లి కలిశా. ప్రస్తుతం నాకూ వైరస్‌ సోకింది. దీంతో నూతన సంవత్సర వేడుకల నాటికి వైరస్‌ నుంచి కోలుకునేందుకు సమయం దొరికింది’ అంటూ జేన్‌ ఝాంగ్‌ (Jane Zhang) పేర్కొన్నారు. బాధితులను కలిసి వచ్చిన తర్వాత జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పుల వంటి కొవిడ్‌ లక్షణాలు (Covid Symptoms) కనిపించాయని చెప్పారు. అయితే, అవి కేవలం ఒక్క రోజు మాత్రమే ఉన్నాయని.. రోజు మొత్తం విశ్రాంతి తీసుకున్న తర్వాత అవి తగ్గిపోయినట్లు వివరించారు. ఈ కథనాన్ని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు (SCMP) కూడా ప్రచురించింది.

చైనాలో ప్రమాదకరమైన బీఎఫ్‌.7 వేరియంట్‌ (Omicron) వణికిపోతోన్న వేళ.. ఓ సింగర్‌ ఇటువంటి ప్రకటన చేయడం వైరల్‌గా (Viral) మారింది. ఆమె తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతోపాటు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై స్పందించిన జేన్‌ ఝాంగ్‌.. వెంటనే క్షమాపణలు చెబుతూ సోషల్‌ మీడియా(Social Media)లో ఆ పోస్టును తొలగించారు. మరోవైపు చైనాలో కరోనా వైరస్‌ తీవ్రతకు ఆసుపత్రులు, శ్మశానవాటికలు నిండిపోతున్నాయనే వార్తలు వస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని