ఇజ్రాయెల్‌కు ఐసీసీ వారెంట్ల గుబులు!

కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది.

Updated : 30 Apr 2024 05:49 IST

ఏ క్షణంలోనైనా జారీ

జెరూసలెం: కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఊహాగానాలపై ఐసీసీ నుంచి ఎటువంటి సూచనలు లేనప్పటికీ, విదేశాంగశాఖ మాత్రం ఇతర దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలకు ఈమేరకు అప్రమత్తం చేసింది. 2014 నాటి గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌, హమాస్‌ మిలిటెంట్లు యుద్ధనేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం మూడేళ్ల క్రితం విచారణను ప్రారంభించింది. పాలస్తీనీయన్లు తమ భవిష్యత్తు దేశం కోసం కోరుతున్న భూభాగంలో ఇజ్రాయెల్‌ స్థావరాలను నిర్మించడం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది. అయితే.. ఈ కేసులో వారెంట్ల జారీపై ఇటీవల కాలంలో ఎటువంటి సూచనలు ఇవ్వలేదు. ఒకవేళ వారెంట్లు జారీ అయితే.. ఆ దేశ అధికారులను ఇతర దేశాల్లో అరెస్టుచేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే గాజాలో భీకర దాడులపై నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ.. ఈ పరిణామం టెల్‌అవీవ్‌కు శరాఘాతంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత గాజా యుద్ధంలో కూడా ఇజ్రాయెల్‌ నరమేధం జరిపిందా లేదా అన్న అంశంపైనా ఐసీసీ దర్యాప్తు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని