Cuba : రష్యా కిరాయి సైనికులుగా మార్చేందుకు క్యూబా పౌరులను తరలిస్తున్న ముఠా అరెస్ట్‌!

క్యూబా (Cuba) పౌరులను కిరాయి సైనికులుగా మార్చే ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 17 మందిని అధికారులు అరెస్టు చేశారు. 

Published : 08 Sep 2023 17:20 IST

హవానా : రష్యా (Russia) దాదాపు 18 నెలలుగా ఉక్రెయిన్‌పై (Ukraine) దండయాత్ర చేస్తోంది. దాంతో ఇరు దేశాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అయినా యుద్ధాన్ని కొనసాగించడానికే రష్యా మొగ్గు చూపుతోంది. కానీ.. యుద్ధ భూమిలో పోరాడేందుకు సరిపడా సైనికులు ఆ దేశంలో లేరు. ఈ నేపథ్యంలో రష్యా యుద్ధంలో పాల్గొనడానికి తమ పౌరులను తరలిస్తున్నారనే అనుమానంతో క్యూబా (Cuba) అధికారులు 17 మందిని అరెస్టు చేశారు. రష్యన్‌ సైన్యంలో క్యూబన్‌ పౌరులను కిరాయి సైనికులుగా నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వారిపై అభియోగాలు మోపారు. క్యూబాలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా ఆట కట్టిస్తామని గత వారంలోనే ఆ దేశ ఉన్నతాధికారులు ప్రకటించారు. అందుకోసం క్యూబా, రష్యాలో నిఘా పెట్టామని తెలిపారు. ‘పరిశోధనల ఫలితంగా ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేశాం. ఇందులో మధ్యవర్తులు కూడా ఉన్నారని’ క్యూబా అంతర్గత మంత్రిత్వశాఖ కల్నల్ సీజర్‌ రోడ్రిగ్జ్‌ పేర్కొన్నారు. 

అంగారకుడిపై ఆక్సిజన్‌ ఉత్పత్తి.. నాసా రోవర్‌ ఘనత

ఈ అక్రమ రవాణాలో పాల్గొన్న వ్యక్తుల పేర్లను కల్నల్‌ సీజర్‌ వెల్లడించలేదు. ఉక్రెయిన్‌లో రష్యా కిరాయి సైన్యంగా పోరాడేందుకు ఓ ముఠా నాయకుడు క్యూబా పౌరులను సమీకరిస్తున్నాడని చెప్పారు. ఆ ముఠా నాయకుడికి క్యూబా దీవిలోని ఇద్దరు వ్యక్తులు సహకరిస్తున్నట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. ఈ విషయంపై ప్రాసిక్యూటర్‌ జోస్‌ లూయిస్‌ రేయిస్‌ మాట్లాడుతూ ఈ కుంభకోణానికి పాల్పడిన వారికి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా, కిరాయి సైనికులుగా మారడం, విదేశీ గడ్డపై శత్రు చర్యకు దిగడం వంటి నేరాల తీవ్రత ఆధారంగా మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుందన్నారు. 

కమ్యూనిస్టు దేశమైన క్యూబాతో రష్యాకు దృఢమైన రాజకీయ సంబంధాలున్నాయి. స్వదేశంలో ఆర్థిక స్తబ్దత నుంచి తప్పించుకోవడానికి పలువురు క్యూబా వలసదారులు రష్యా వెళ్తుంటారు. గతేడాది తమ సైన్యంలో విదేశీయులు చేరడానికి అనుమతించే డిక్రీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతకం చేశారు. అలా వచ్చిన వారికి ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పౌరసత్వం కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదని క్యూబా ప్రకటించింది. తమ పౌరులను కిరాయి సైనికులుగా మార్చడాన్ని తిరస్కరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు