PM Modi: ఎలాంటి వివాదాలైనా చర్చల ద్వారానే పరిష్కారం: మోదీ

ఎంతటి  సంక్లిష్ట సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని భారత్‌  విశ్వసిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 14 Jul 2023 22:01 IST

పారిస్‌: భారత్‌ (India) పురోగతిలో ఫ్రాన్స్ (France) సహజ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రాన్స్‌తో భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పి 25 సంవత్సరాలు పూర్తయిందని గుర్తు చేసుకున్న ఆయన.. రానున్న 25 ఏళ్లకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం, అణుశక్తి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తదితర అంశాల్లో సహకారం దిశగా మరింత ముందుకు వెళ్తామన్నారు. భారత్‌లో జాతీయ మ్యూజియం ఏర్పాటుకు ఫ్రాన్స్‌ భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన బాస్టీల్‌ డే పరేడ్‌ను ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కలిసి వీక్షించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని దేశ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’ అవార్డుతో మోదీని ఫ్రాన్స్‌ సత్కరించింది.

పరేడ్‌ అనంతరం ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్త్రృతంగా చర్చించారు. అనంతరం మేక్రాన్‌తో కలిసి, మోదీ మీడియాతో మాట్లాడారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వం తనకు చేసిన సత్కారం 140కోట్ల మంది భారతీయులకు చెల్లుతుందన్నారు. భారత్‌లో అవలంబిస్తున్న యూపీఐ పేమెంట్‌ విధానాన్ని ఫ్రాన్స్‌లోనూ తీసుకొచ్చేందుకు ఇరు దేశాలు సమ్మతించినట్లు తెలిపారు. కొవిడ్‌, ఉక్రెయిన్‌ సంక్షోభాల ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఫ్రాన్స్‌లోని భారతీయుల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక వీసా విధానాన్ని ప్రధాని స్వాగతించారు. భారతదేశంలో క్యాంపస్‌లను తెరవడానికి ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలను ఆయన ఆహ్వానించారు. ఈ వ్యూహాత్మక చర్యలు రెండు దేశాల మధ్య విద్య,  సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

ఎంత సంక్షిష్టమైన వివాదాలనైనా చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవచ్చని భారత్‌ పూర్తిగా విశ్వసిస్తోందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. శాంతిస్థాపనకు భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సహకారానికి ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని