NISAR: ఇక అందరి దృష్టీ ‘నిసార్‌’ వైపు..!

నాసా (NASA), ఇస్రో (ISRO) సంయుక్తంగా చేపడుతున్న ‘నిసార్‌’ మిషన్‌లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్‌, అమెరికా రూపొందించిన ఉపగ్రహ విడిబాగాలను ఒకదానికొకటి అనుసంధానించి సింగిల్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ను రూపొందించినట్లు నాసా అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది.

Updated : 14 Aug 2023 18:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayan 3) ప్రయోగం విజయం దిశగా అడుగులు వేస్తోంది. శుక్రవారం సాయంత్రం సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్‌-3 నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశించి.. అక్కడి నుంచి క్రమంగా చంద్రుడి వైపు పయనం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో త్వరలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఇస్త్రో సంయుక్తంగా చేపట్టబోయే ప్రాజెక్టు నిసార్‌ (నాసా-ఇస్రో సింథటిక్‌ ఎపర్చర్‌ రేడార్‌) మిషన్‌ వైపు అందరి దృష్టీ మళ్లింది.

అంతేకాకుండా ఈ ప్రయోగంలో తాజాగా కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నాసా అభివృద్ధి చేసిన ఉపగ్రహ విడి భాగాలను బెంగళూరు తీసుకొచ్చి యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఇస్రో రూపొందించిన మరో కొన్ని భాగాలతో అనుసంధానించి సింగిల్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను తయారు చేసినట్లు నాసా తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతమైన తర్వాత ప్రయోగం కోసం శాటిలైట్‌ను శ్రీహరికోట తీసుకురానున్నారు. అమెరికాతో కలిసి భారత్‌ చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇదే.

ఏమిటీ నిసార్‌?

భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు భారత్‌-అమెరికా కలిసి సంయుక్తంగా చేపడుతున్న అంతరిక్ష ప్రయోగమే ఈ నిసార్‌. ఇది విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను ముందస్తుగా గుర్తించేందుకు వీలుంటుంది. కేవలం భూ ఉపరితలంపైనే కాకుండా భూమి పొరల్లో జరిగే కదలికలను కూడా పసిగట్టొచ్చు. ఫలితంగా భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, సముద్రమట్టం పెరుగుదల ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సంకేతాలను ముందుగానే గుర్తించొచ్చు. ఆయా అంశాల్లో జరిపే అధ్యయనాలకు నిసార్‌ అందించే సమాచారం మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహం సాయంతో హిమాలయాల్లోని హిమనీనదాల ప్రవాహ తీరు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించే యోచనలో ఇస్రో ఉంది.

భూ గ్రహంపై దాదాపు అన్ని ప్రదేశాలను కనీసం 12 రోజులకు ఒకసారైనా పరిశీలించే సామర్థ్యం నిసార్‌కు ఉందని నాసా స్పష్టం చేసింది. ఎస్‌యూవీ వాహనం పరిమాణంలో ఉండే ఈ ఉపగ్రహం 2,800 కిలోల బరువు ఉంటుంది. ఈ ఉపగ్రహంలో ఎల్‌-బ్యాండ్‌, ఎస్‌-బ్యాండ్, సింథటిక్ ఎపార్చర్ రాడార్ (SAR) వంటి పరికరాలు ఉన్నాయి. ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా హై-రిజల్యూషన్‌ ఫొటోలను తీస్తుంది. 2024లో శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పెట్టేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. దీని అంచనా వ్యయం రూ.12,150 కోట్లు. దీని నిర్మాణానికి 2014 సెప్టెంబరులో ఇస్రో, నాసా ముందుకొచ్చాయి. ఈ ఉపగ్రహం జీవితకాలం మూడేళ్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని