జైల్లోనే ఇమ్రాన్‌ను హత్యచేసేలా కుట్ర!

మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ను జైల్లోనే గుట్టుగా మట్టుబెట్టేందుకు కుట్రలు జరిగాయని ఆయన తరఫు న్యాయవాదులు సంచలనాత్మక ఆరోపణలు చేశారు.

Published : 14 May 2023 02:52 IST

గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చి చిత్రహింసలు
పాక్‌ మాజీ ప్రధాని న్యాయవాదుల వెల్లడి
వేర్వేరు కేసుల్లో రెండు వారాల బెయిల్‌
అరెస్టుకు లాహోర్‌ పోలీసుల తాజా యత్నం

ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ను జైల్లోనే గుట్టుగా మట్టుబెట్టేందుకు కుట్రలు జరిగాయని ఆయన తరఫు న్యాయవాదులు సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఖాన్‌ అరెస్టు అక్రమమనీ, వెంటనే విడుదల చేయాలని పాక్‌ సుప్రీంకోర్టు గురువారం ఆదేశించిన నేపథ్యంలో ఇమ్రాన్‌తో గంటపాటు న్యాయవాదులు భేటీ అయ్యారు. జైల్లో నిద్ర పోనివ్వలేదని, మరుగు వసతి, మంచం లేని ఒక గదిలో ఉంచారని ఇమ్రాన్‌ తమకు తెలిపినట్లు వారు చెప్పారు. మూత్రవిసర్జనకు కూడా అనుమతించడం లేదని, చిత్రహింసలు పెట్టి నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే పదార్థాలు, ఇంజెక్షన్లు ఇచ్చారని ఇమ్రాన్‌ వాపోయినట్లు న్యాయవాదులు తెలిపారు. అరెస్టు అనంతరం ఇస్లామాబాద్‌లోని పోలీస్‌ లైన్స్‌కు తీసుకువెళ్లి, ఆహారమైనా ఇవ్వలేదని ఆరోపించారు.

ప్రత్యేక ధర్మాసనం ఎదుట వాదనలు

అల్‌ ఖదీర్‌ ట్రస్ట్‌ అవినీతి కేసులో ఇమ్రాన్‌పై శుక్రవారం ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపి, రెండువారాల రక్షణాత్మక బెయిల్‌ మంజూరు చేసింది. ఖాన్‌ ఈ నెల 9 అరెస్టైన తర్వాత దాఖలైన ఏ కేసులోనూ ఆయన్ని ఈ నెల 17 వరకు అరెస్టు చేయవద్దని, కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఇదే కోర్టులో మరో ధర్మాసనం ఇంకో పిటిషన్‌పై ఆదేశించింది. ఒక హత్య కేసులో ఖాన్‌కు ఇచ్చిన బెయిల్‌ను ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు మూడో ధర్మాసనం ప్రకటించింది. దీంతో ఒకేరోజు వేర్వేరు కేసుల్లో ఇమ్రాన్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది. సుప్రీంకోర్టు రక్షణలో ఖాన్‌ను ఉంచి, తదుపరి విచారణ కోసం శుక్రవారం ఉదయం హైకోర్టులో హాజరుపరచాలని, అక్కడి ఆదేశాలకు కట్టుబడి ఉండాలని పాక్‌ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో భారీ భద్రత మధ్య ఆయన్ని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. ఖాన్‌ అనుకూల న్యాయవాది ఒకరు నినాదాలు చేయడంతో ఇద్దరు న్యాయమూర్తులు కొద్దిసేపు కోర్టురూం నుంచి బయటకు వెళ్లిపోయారు. తమ క్లయింట్‌పై ఉన్న అన్ని కేసులను ఒకేచోటకు చేర్చి, వాటిలోని వివరాలేమిటో తెలిపేలా ఆదేశించాలని ఖాన్‌ న్యాయవాదులు కోరారు.

కోర్టు వద్ద ఉద్రిక్తత

విచారణ ముగిశాక పీటీఐ అధినేత విలేకరులతో మాట్లాడారు. తనను అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లాకే వారెంటు చూపించారనీ, ఇది ఆటవిక న్యాయమని అన్నారు. కోర్టువద్దకు ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. బెయిల్‌ మంజూరైన తర్వాత కూడా రాత్రి పొద్దుపోయేవరకు కోర్టులోనే ఇమ్రాన్‌ఖాన్‌ ఉన్నారు. తనను బలవంతంగా అక్కడ ఉంచారనీ, మళ్లీ ఏదోచేయాలనే దురుద్దేశం దాని వెనుక ఉందని వీడియో సందేశం వెలువరించారు. చివరకు పోలీసు ఉన్నతాధికారి వాహనంలో తన భద్రత సిబ్బందితో కలిసి అక్కడినుంచి వెళ్లారు.

ఇద్దరు సీనియర్‌ నేతల అరెస్టు

ఖాన్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు- మాజీ మంత్రి షిరీన్‌ మజారీ, పంజాబ్‌ ప్రావిన్స్‌ మాజీ మంత్రి యాస్మిన్‌ రషీద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఇమ్రాన్‌పై తమ పరిధిలో దాఖలైన పలు కేసులకు సంబంధించి ఆయన్ని అరెస్టు చేసేందుకు లాహోర్‌ పోలీసులు డీఐజీ నేతృత్వంలో ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. మాజీ ప్రధానిని మళ్లీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయని పీటీఐ నేతలు ఆరోపించారు. మొత్తం 121 కేసులు ఆయనపై పెండింగులో ఉన్నాయి.

న్యాయం చచ్చిపోయింది: షెహబాజ్‌

పాకిస్థాన్‌లో న్యాయం చచ్చిపోయిందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్ర వ్యాఖ్య చేశారు. ఇమ్రాన్‌కు బెయిల్‌ ఇవ్వడం ద్వారా పాక్‌ సుప్రీంకోర్టు ద్వంద్వ ప్రమాణాలను చాటుకుందని శుక్రవారం కేబినెట్‌ సమావేశంలో విమర్శించారు. ‘ఇమ్రాన్‌, ఆయన పార్టీ నేతలు అబద్ధాలకోరులు. ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని నాశనం చేయడానికి వారు చూస్తున్నారు. నా సోదరుడు నవాజ్‌షరీఫ్‌ వంటి ‘పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌’ పార్టీ నేతల్ని ఇమ్రాన్‌ఖాన్‌ పదవీకాలంలో జైలు పాల్జేసినప్పుడు కోర్టులు మౌనం దాల్చాయి. కావాల్సినవారికి మేలు చేయాలనుకుంటే దేశంలో బందిపోట్లు అందరినీ విడుదల చేసేయండి’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఖాన్‌ విడుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ర్యాలీలు చేపడతామని అధికార పార్టీ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని