Indo-American Engineer: హిందీలో మాట్లాడితే ఉద్యోగం పోయింది!

భారతదేశంలో అవసాన దశలో ఉన్న తన బావతో హిందీభాషలో వీడియోకాల్‌ మాట్లాడినందుకు 78 ఏళ్ల భారతీయ అమెరికన్‌ ఇంజినీర్‌ అనిల్‌ వర్ష్‌ణే ఉద్యోగం ఊడిపోయింది.

Updated : 02 Aug 2023 08:35 IST

కోర్టుకెక్కిన ఇండో అమెరికన్‌ ఇంజినీర్‌

వాషింగ్టన్‌: భారతదేశంలో అవసాన దశలో ఉన్న తన బావతో హిందీభాషలో వీడియోకాల్‌ మాట్లాడినందుకు 78 ఏళ్ల భారతీయ అమెరికన్‌ ఇంజినీర్‌ అనిల్‌ వర్ష్‌ణే ఉద్యోగం ఊడిపోయింది. ఈయన అమెరికా రక్షణ రహస్యాలను బయటకు చేరవేస్తున్నాడని హిందీభాష తెలియని శ్వేతజాతి సహోద్యోగి ఫిర్యాదు చేయడంతో అనిల్‌కు ఉద్వాసన తప్పలేదు. ఈ జాతివివక్ష వల్ల తాను గత అక్టోబరు నుంచి నిరుద్యోగిగా ఉన్నానని, జరిగిన అన్యాయానికి తాను పనిచేస్తున్న సంస్థ ‘పార్సన్స్‌ కార్పొరేషన్‌’ నష్టపరిహారం చెల్లించాలంటూ ఆయన కోర్టుకెక్కారు. 1968లో అమెరికాకు వలసవెళ్లిన అనిల్‌ దంపతులు ఆ దేశ పౌరసత్వం కూడా తీసుకున్నారు. ఆయన భార్య 1989 నుంచి నాసాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అనిల్‌ హంట్స్‌విల్‌లోని పార్సన్స్‌ కార్పొరేషనులో సిస్టమ్స్‌ ఇంజినీర్‌. అమెరికా ప్రభుత్వ క్షిపణి రక్షణ సంస్థ (ఎండీఏ)కు ఇది గగనతల రక్షణ సేవలు అందించే సంస్థ. భూతలంపై క్షిపణి నిరోధక వ్యవస్థను రూపొందించి ఎండీఏకి 50 లక్షల డాలర్లు ఆదా చేసినందుకు అనిల్‌కు గతంలో మేటి ఉద్యోగి అవార్డు కూడా లభించింది. భారత్‌లో ఉంటున్న అనిల్‌ బావ కె.సి.గుప్తా అవసానదశలో ఉండగా.. గతేడాది సెప్టెంబరు 26న అనిల్‌కు వీడియోకాల్‌ చేశారు. దాదాపుగా తుదిపలుకులు మాట్లాడేందుకే ఆయన కాల్‌ చేశారు.

బావతో మళ్లీ మాట్లాడే అవకాశం లభించకపోవచ్చని అనిల్‌ ఒక ఖాళీ గదిలోకి వెళ్లి హిందీలో మాట్లాడసాగారు. ఈ సంభాషణ రెండు నిమిషాలపాటు నడిచింది. ఇంతలో ఒక సహోద్యోగి వచ్చి వీడియోకాల్‌ మాట్లాడకూడదని ఆయనతో అన్నారు. దీంతో అనిల్‌ వెంటనే ఫోన్‌ ఆఫ్‌ చేశారు. హిందీభాష తెలియని సహోద్యోగి ఆయన రహస్య సమాచారాన్ని బయటకు తరలిస్తున్నాడని అనుమానించాడు. వీడియోకాల్స్‌ను కంపెనీ నిషేధించకపోయినా, అనిల్‌ భద్రతా నియమాలను ఉల్లంఘించారంటూ ఆ కంపెనీ ఆయనకు ఉద్వాసన పలికింది. అంతేకాదు, ఎండీఏ కార్యక్రమాల్లో ఎన్నటికీ పాల్గొనకూడదని నిషేధించింది. అనిల్‌ను గూఢచారిగా అనుమానించింది. ఎండీఏ అధికారులు ఆయన ఫైళ్లను, ఇతర సామగ్రినీ క్షుణ్నంగా శోధించినా నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. తనను మళ్లీ  ఉద్యోగంలోకి తీసుకోవాలి లేదా నష్టపరిహారం చెల్లించాలని అనిల్‌ కోర్టుకెక్కారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని