బంగ్లాదేశ్‌ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్‌

ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్‌ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు.

Published : 26 Apr 2024 05:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్‌ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. పాక్‌ వర్తకులతో ఇటీవల జరిగిన భేటీలో బంగ్లాదేశ్‌ ఆర్థికవృద్ధిని ఆయన ఉదాహరించారు. ఎగుమతుల ద్వారా ఆర్థికవ్యవస్థను పెంపొందించే మార్గాలపై చర్చించేందుకు ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలతో చర్చించిన షెహబాజ్‌ దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతపై నేరుగా స్పందించలేదు. వాస్తవమైన పారిశ్రామిక, వ్యవసాయ వృద్ధి సాధించడం, వచ్చే అయిదేళ్లలో ఎగుమతులను రెట్టింపు చేయడంపై దృష్టి పెడతామని చెప్పారు. ఇది కష్టమైనదే అయినప్పటికీ అసాధ్యం కాదన్నారు. బంగ్లాదేశ్‌ ఆర్థికవృద్ధి గురించి మాట్లాడుతూ.. ‘‘తూర్పు పాకిస్థాన్‌గా పిలిచే ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు దేశానికి భారంగా భావించాం. ఇప్పుడు పారిశ్రామిక వృద్ధిలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. నేను యువకుడిగా ఉన్న రోజుల్లో మన భుజాలపై అదో భారం అని చెప్పేవాళ్లు. ఈరోజు చూస్తే.. ఆర్థికపరంగా ఆ దేశం ఎక్కడికి చేరిందో మనందరికీ తెలుసు. మనం వాళ్లను చూసి సిగ్గుపడుతున్నాం’’ అని షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని