China: వద్దు వద్దంటున్నా.. తైవాన్‌కు పెలోసీ

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన అగ్రరాజ్యాల మధ్య అగ్గి రాజేసింది. చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్‌ రాజధాని తైపీలో మంగళవారం రాత్రి పెలోసీ అడుగుపెట్టారు. ‘తైవాన్‌

Updated : 03 Aug 2022 05:47 IST

చైనా హెచ్చరికలు బేఖాతరు

బీజింగ్‌కు రష్యా సంఘీభావం

బీజింగ్‌, తైపీ, మాస్కో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన అగ్రరాజ్యాల మధ్య అగ్గి రాజేసింది. చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్‌ రాజధాని తైపీలో మంగళవారం రాత్రి పెలోసీ అడుగుపెట్టారు. ‘తైవాన్‌ ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడంలో అమెరికా నిబద్ధతకు మా పర్యటన నిదర్శనం. దీర్ఘకాలంగా యూఎస్‌ అనుసరిస్తున్న విధానాలకు ఈ పర్యటన విరుద్ధం కాదు’ అని పెలోసీ ఇక్కడకు రాగానే వ్యాఖ్యానించారు. వీరి బృందానికి తైపీ ఘనస్వాగతం పలికింది. ‘వెల్‌కం టు తైవాన్‌, స్పీకర్‌ పెలోసీ’ అంటూ ఎల్‌ఈడీ విద్యుద్దీపాలతో భవనాలపై అలంకరించారు. రాజధానిలో పెలోసీ బృందం బస చేయనున్న గ్రాండ్‌ హయత్‌ హోటలు బయట బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తైపీకి వీరు కాసేపట్లో చేరుకుంటారనగా మంగళవారం సాయంత్రం తైవాన్‌ అధ్యక్ష కార్యాలయ వెబ్‌సైటుపై సైబర్‌ దాడి జరగడం గమనార్హం. ఆ తర్వాత వెబ్‌సైటును పునరుద్ధరించినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. పెలోసీ బుధవారం తైవాన్‌ అధ్యక్షుడితో సమావేశమయ్యే అవకాశముంది.

* తైవాన్‌కు వస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చైనా పదే పదే చెప్పినా.. అమెరికా  వెనక్కు తగ్గలేదు. పెలోసీ బృందం తైవాన్‌ పర్యటన నేపథ్యంలో చైనా సైనిక విన్యాసాల జోరు పెంచింది. అమెరికా సైతం తమ ఆసియా - పసిఫిక్‌ కమాండ్‌ను అప్రమత్తం చేసింది. దీంతో ఈ పర్యటన క్షణక్షణం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. చైనా తన యుద్ధ విమానాలను తైవాన్‌ భూభాగం వైపు పంపినట్లు స్థానికంగా కథనాలు వెలువడుతున్నాయి.  తైవాన్‌ ద్వీపానికి తూర్పు వైపు తీరంలో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధనౌకలను మోహరించినట్లు రాయిటర్స్‌ వార్తాకథనం వెల్లడించింది. అమెరికా నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ‘యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగన్‌’ దక్షిణ చైనా సముద్రాన్ని దాటుకొని ఫిలిప్పీన్స్‌ సముద్రంలోకి చేరుకుందని ఆ కథనం పేర్కొంది. ‘అమెరికా జాతీయ విశ్వసనీయతకు ఇది విఘాతం. ఆ దేశ రాజకీయవేత్తలు కొందరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. ఈ పరిణామం అమెరికాను ప్రపంచంలోనే అతిపెద్ద శాంతి విధ్వంసక దేశంగా నిలిపింది’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మండిపడ్డారు. చైనాకు తాము సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నట్లు రష్యా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని