ఆంగ్‌సాన్‌ సూకీకి మరో ఆరేళ్ల జైలుశిక్ష

మయన్మార్‌లోని ఓ కోర్టు ఆంగ్‌సాన్‌ సూకీని మరికొన్ని అవినీతి అభియోగాల్లో దోషిగా నిర్ధరించింది. ఇప్పటికే విధించిన 11 ఏళ్ల జైలుశిక్షకు అదనంగా తాజా కేసుల్లో ఆమెకు మొత్తం ఆరేళ్ల జైలుశిక్ష విధించినట్లు న్యాయాధికారి ఒకరు తెలిపారు. మయన్మార్‌లో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన సూకీ ప్రభుత్వాన్ని

Published : 16 Aug 2022 05:48 IST

బ్యాంకాక్‌: మయన్మార్‌లోని ఓ కోర్టు ఆంగ్‌సాన్‌ సూకీని మరికొన్ని అవినీతి అభియోగాల్లో దోషిగా నిర్ధరించింది. ఇప్పటికే విధించిన 11 ఏళ్ల జైలుశిక్షకు అదనంగా తాజా కేసుల్లో ఆమెకు మొత్తం ఆరేళ్ల జైలుశిక్ష విధించినట్లు న్యాయాధికారి ఒకరు తెలిపారు. మయన్మార్‌లో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన సూకీ ప్రభుత్వాన్ని దించేసిన సైన్యం 2021 ఫిబ్రవరిలో పాలనపగ్గాలు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమెపై పలు అభియోగాలను మోపి నిర్బంధంలోకి తీసుకుంది. తాజాగా సూకీపై విచారణ నాలుగ్గోడల మధ్య జరిగింది. మీడియాను గానీ, ప్రజలను గానీ అనుమతించలేదు. విచారణకు సంబంధించిన సమాచారాన్ని బయటకు వెల్లడించరాదని ఆమె తరఫు న్యాయవాదులకు కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆమెపై నమోదైన 4 అవినీతి కేసుల్లో సోమవారం కోర్టు ఆదేశాలిచ్చింది. గతంలో ఆమె తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్‌ ధర కంటే తక్కువకు అద్దెకు ఇచ్చారని, ధార్మిక విరాళాలతో నివాసాన్ని నిర్మించుకున్నారని తదితర అభియోగాలపై విచారణ జరిపింది. 4 కేసుల్లో మూడేళ్లు వంతున జైలుశిక్ష విధించింది. అయితే 3 కేసుల్లో విధించిన శిక్షను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని పేర్కొనడంతో ఆమెకు మొత్తంగా 6 సంవత్సరాల జైలుశిక్ష పడింది. తనపై వచ్చిన అభియోగాలను సూకీ తోసిపుచ్చారు. దీనిపై ఆమె తరఫు న్యాయవాదులు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని