కీలక మంత్రిపై పుతిన్‌ వేటు

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జెలెన్‌స్కీ సేనలు మెరుపు దాడులతో మాస్కో బలగాలను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రక్షణమంత్రి

Published : 27 Sep 2022 05:53 IST

ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బల నేపథ్యంలోనే...

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జెలెన్‌స్కీ సేనలు మెరుపు దాడులతో మాస్కో బలగాలను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రక్షణమంత్రి జనరల్‌ దిమిత్రి బుల్గకోవ్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో కర్నల్‌ జనరల్‌ మిఖాయిల్‌ మిజింట్సేవ్‌ను నియమించారు. బుల్గకోవ్‌ 2008 నుంచి రష్యా మిలిటరీ లాజిస్టిక్స్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తూ వచ్చారు. లాజిస్టిక్స్‌ నిర్వహణలో వైఫల్యం కారణంగానే ఇటీవల ఖర్కివ్‌ ప్రాంతం నుంచి మాస్కో సేనలు వెనుదిరగాల్సి వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే పుతిన్‌ బుల్గకోవ్‌ను పదవి నుంచి తప్పించినట్టు చెబుతున్నారు. మిజింట్సేవ్‌.. మేరియుపోల్‌ విధ్వంసకుడిగా అపకీర్తి మూటగట్టుకున్నారు. అక్కడి ఆర్ట్‌ గ్యాలరీలు, ప్రసూతి ఆసుపత్రులు, థియేటర్లు ఆయన ఆధ్వర్యంలోనే నేలమట్టమయ్యాయి.

సైనిక సమీకరణను వ్యతిరేకిస్తూ కాల్పులు

సైనిక సమీకరణలో భాగంగా తమను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నారంటూ రష్యా యువకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పుతిన్‌ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఇప్పటివరకూ సుమారు రెండు వేల మంది ఆందోళనకారులను అరెస్టుచేశారు. ఈ క్రమంలో ఉస్ట్‌ ఇలిమ్స్‌ ప్రాంతానికి చెందిన రుస్లాన్‌ జినిన్‌ (25).. సైనికులుగా చేరేవారి పేర్లను నమోదుచేసే కార్యాలయంలోకి వెళ్లాడు. ‘‘మేము ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లం. మా ఇళ్లకు వెళ్లిపోతున్నాం’’ అంటూ వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో అక్కడున్న ఓ సైనిక అధికారిని కాల్చి చంపాడు. జినిన్‌కు కఠిన శిక్ష విధించే అవకాశాలున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం

అమెరికా భద్రతా విభాగం మాజీ కాంట్రాక్టర్‌ ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు... అధ్యక్షుడు పుతిన్‌ రష్యా పౌరసత్వం మంజూరు చేశారు! ఇందుకు సంబంధించిన డిక్రీని అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు. అమెరికా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించినట్టు స్నోడెన్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ కేసులో విచారణను తప్పించుకునేందుకు 2013లోనే ఆయన రష్యాకు వలస వచ్చాడు.


అణుదాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు : అమెరికా

పుతిన్‌ సైనిక సమీకరణ ఆదేశాలతో పశ్చిమదేశాల్లో గుబులు రేగింది. యుద్ధంలో ఓటమిని తప్పించుకునేందుకు రష్యా చిన్నపాటి టాక్టికల్‌ అణుబాంబును ప్రయోగించవచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అమెరికా ఓ ప్రైవేటు సందేశాన్ని నేరుగా రష్యాకు పంపింది. అణు యుద్ధాన్ని మొదలుపెడితే తీవ్ర పరిణామాలు తప్పవని ఇందులో హెచ్చరించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ధ్రువీకరించారు.

డ్రోన్లతో దాడి

ఉక్రెయిన్‌కు చెందిన ఒడెసా రేవుపై రష్యా అర్ధరాత్రి వేళ డ్రోన్లతో విరుచుకుపడింది. సమీపంలోని సైనిక వసతులు, మందుగుండు సామగ్రి నిల్వలపై భారీ విధ్వంసానికి పాల్పడింది. దీంతో ఇక్కడ భారీగా మంటలు చెలరేగాయి. రష్యాలో విలీనమయ్యే విషయమై దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌లలో రష్యా అనుకూల అధికారులు చేపడుతున్న రెఫరెండం ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. ఇది పూర్తయిన తర్వాత రష్యా మరింత ఉద్ధృతంగా ఉక్రెయిన్‌పై విరుచుకుపడవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు