పిల్లల కోసం జపాన్‌ తహతహ

జపాన్‌లో జననాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. జనవరి నుంచి సెప్టెంబరు వరకూ ఆ దేశంలో మొత్తం 5,99,636 మంది పిల్లలే పుట్టారు.

Updated : 29 Nov 2022 06:12 IST

టోక్యో: జపాన్‌లో జననాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. జనవరి నుంచి సెప్టెంబరు వరకూ ఆ దేశంలో మొత్తం 5,99,636 మంది పిల్లలే పుట్టారు. గత సంవత్సరం ఇదే సమయం కంటే ఇది 4.9% తక్కువ. ఇదే రేటున జననాలుంటే 2022 మొత్తమ్మీద 8,11,000 మందే పుడతారని చీఫ్‌ కేబినెట్‌ కార్యదర్శి హిరొకజు మట్సునో తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్‌లో జీవన వ్యయాలు చాలా ఎక్కువగా ఉండగా, వేతనాల పెంపు అంతంతమాత్రంగానే ఉంటోంది. పిల్లలు, మహిళలు, మైనారిటీలకు సమాజం మరింత అనుకూలంగా ఉండేలా కన్జర్వేటివ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గర్భం దాల్చినందుకు, పిల్లలు పుట్టినందుకు, పిల్లల సంరక్షణకు పలు రకాల రాయితీలు ప్రకటిస్తున్నా.. ఇవేవీ పెద్దగా ఫలితాలనివ్వట్లేదు. ఉద్యోగావకాశాలు అంతగా లేకపోవడం, ప్రయాణాలకు కష్టపడాల్సి రావడం, ఇద్దరూ ఉద్యోగాలు చేయడానికి కార్పొరేట్‌ సంస్కృతి అనుకూలంగా లేకపోవడంతో జపాన్‌ యువత పెళ్లి చేసుకోవడానికి, కుటుంబ వ్యవస్థకు విముఖంగా ఉంటోంది. 1973 నుంచి జపాన్‌లో జననాల సంఖ్య క్రమంగా పడిపోతోంది. అప్పట్లో ఏడాదికి 21 లక్షలు ఉండేది. 2040 నాటికి అది 7.40 లక్షలకు పడిపోతుందని అంచనా. 12.5 కోట్లుగా ఉన్న జపాన్‌ జనాభా గత 14 ఏళ్లుగా తగ్గిపోతోంది. 2060 నాటికి అది 8.67 కోట్లకు తగ్గుతుందని భావిస్తున్నారు. పిల్లలు పుట్టకపోతుండటం, మరోవైపు వృద్ధుల జనాభా పెరిగిపోవడంతో ఆర్థికవ్యవస్థ మీద, జాతీయ భద్రత మీద పెను ప్రభావం పడుతోంది. చైనా దూకుడును తట్టుకోవడానికి సైన్యాన్ని బలోపేతం చేయాలని జపాన్‌ భావిస్తోంది. కానీ, పడిపోతున్న జననాల రేటు వల్ల ఈ లక్ష్యం నెరవేరడం కష్టమని ప్రభుత్వ కమిటీ ఒకటి ప్రధానమంత్రి ఫుమియో కిషిదకు గతవారం నివేదిక ఇచ్చింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని