Putin: అవి అణు బెదిరింపులు కావు.. అమెరికా వక్రీకరించింది: క్రెమ్లిన్‌

తమ అధ్యక్షుడు పుతిన్‌(Putin) మాటలను అమెరికా వక్రీకరిస్తోందని అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ ఆరోపించింది. 

Published : 14 Mar 2024 18:21 IST

మాస్కో: తమ దేశ ఉనికిని, సార్వభౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలు చేపట్టినా అణు దాడికి వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మాటలను తప్పుగా అన్వయించారంటూ అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ పేర్కొంది. 

‘‘పుతిన్ మాటలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా అన్వయించారు. ఇంటర్వ్యూలో ఆయన అణ్వాయుధాలను ఉపయోగించడం గురించి ఎలాంటి బెదిరింపులు చేయలేదు. వాటి వినియోగానికి దారితీసే కారణాల గురించి మాత్రమే మాట్లాడారు’’ అంటూ అమెరికాపై విమర్శలు గుప్పించింది. మార్చి 15-17 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం పుతిన్‌ స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆయన విజయంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

స్వయంగా యుద్ధ ట్యాంకు నడిపిన కిమ్‌

అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన అవసరం రష్యాకు లేదని ఈ ఇంటర్వ్యూలో పుతిన్‌ స్పష్టంచేశారు. ‘‘సాంకేతికంగా అణు యుద్ధానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ, అందుకు తొందరపడటం లేదు. మాకు కొన్ని విధివిధానాలున్నాయి. ఈ విషయం అమెరికాకు తెలుసు. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యాన్ని పంపితే.. యుద్ధంలో ఆ దేశం నేరుగా జోక్యం చేసుకున్నట్లే. దానికి తప్పకుండా బదులిస్తాం. రష్యా-అమెరికా మధ్య సంబంధాలను వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు చాలామంది నిపుణులు ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. అయితే, ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగాలన్నారు. ఒకవేళ అమెరికా అణు పరీక్షలు చేపడితే.. రష్యా కూడా వాటిని పరీక్షిస్తుందని పుతిన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని