Sri Lanka: దేశం దివాలా తీయడానికి అధ్యక్షుడిదే బాధ్యత.. వారికి పాలించే నైతికత లేదు

దేశం దివాలా తీసే పరిస్థితుల్లోకి జారుకోవడానికి అధ్యక్షుడు రాజపక్సదే (Rajapaksa) బాధ్యత అని శ్రీలంకలోని ప్రముఖ చర్చి (Church of Ceylon) పెద్దలు ఉద్ఘాటించారు.

Published : 12 Jul 2022 02:04 IST

తక్షణమే రాజీనామా చేయాలన్న సిలోన్‌ చర్చి పెద్దలు

కొలంబో: ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలను ఎదుర్కొంటున్న శ్రీలంక పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. విదేశీ సహాయం అంతంతమాత్రమే ఉండగా రుణాలు ఇవ్వడానికి అంతర్జాతీయ సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. ఇలా దేశం దివాలా తీసే పరిస్థితుల్లోకి జారుకోవడానికి అధ్యక్షుడు రాజపక్సదే (Rajapaksa) బాధ్యత అని శ్రీలంకలోని ప్రముఖ చర్చి (Church of Ceylon) పెద్దలు ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడితోపాటు ప్రధానమంత్రికి దేశాన్ని పాలించే నైతికత లేదని.. తక్షణమే వారి పదవులకు రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు.

‘అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్‌ పౌరసమాజం మొదలు మతపెద్దల వరకు భారీ స్థాయిలో కనిపిస్తోంది. దేశాన్ని పాలించే అధికారం రాజపక్సకు ఏమాత్రం లేదనడానికి వేల మంది సామాన్య పౌరులు వీధుల్లోకి రావడమే స్పష్టమైన ఉదాహరణ. దేశం దివాలా తీసే పరిస్థితులు నెలకొనడానికి అధ్యక్షుడే బాధ్యత వహించాలి. మరోవైపు ప్రజలు క్యూలైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోతున్నా.. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రణాళిక ప్రధానమంత్రి వద్ద కూడా లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని కూడా తన పదవికి రాజీనామా చేయాలి’ అని పేర్కొంటూ శ్రీలంకలోని ప్రముఖ సిలోన్‌ చర్చి ప్రకటన విడుదల చేసింది.

ప్రజల విశ్వాసంతోపాటు అంతర్జాతీయ సమాజం దృష్టిలో నమ్మకాన్ని పొందగలిగే మధ్యంతర ప్రభుత్వం ఏర్పడాలని సిలోన్‌ చర్చి పిలుపునిచ్చింది. అటువంటి ప్రభుత్వానికి సంక్షోభాన్ని ఎదుర్కొనే తక్షణ దిద్దుబాటు చర్యల ప్రణాళికతో పాటు దీర్ఘకాలిక కార్యాచరణ కలిగి ఉండాలని అభిప్రాయపడింది. తీవ్ర సంక్షోభాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు ఆచి తూచి వ్యవహరించాలని సిలోన్‌ చర్చి సూచించింది.

ఇదిలాఉంటే, తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ఇప్పటికే స్కూళ్లు మూతపడ్డాయి. అత్యవసర సేవలకూ అవసరమైన ఇంధనం దొరకడం కష్టంగా మారింది. రోగులు ఆస్పత్రులకు వెళ్లడానికీ ఇబ్బందే. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక ప్రజలు చివరకు అధ్యక్ష భవనాన్ని ముట్టడించి.. లోనికి దూసుకెళ్లారు. తాజా పరిణామాలతో దేశ అధ్యక్షుడు ఆచూకీ లేకుండా పోయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని