అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా

ఉక్రెయిన్‌ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన సైన్యాన్ని ఆదేశించారు.

Updated : 07 May 2024 06:10 IST

మాస్కో: ఉక్రెయిన్‌ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన సైన్యాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో ‘విన్యాసాల్లో భాగంగా.. సన్నద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటాం. వ్యూహాత్మక అణ్వాయుధాలను వినియోగిస్తాం’ అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే వీటి కసరత్తు మొదలవుతుందని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో తాము మరింత జోక్యం చేసుకునే అవకాశం ఉందంటూ పాశ్చాత్య దేశాల సీనియర్‌ అధికారులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు, బెదిరింపుల నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.  వ్యూహాత్మక అణ్వాయుధాల విన్యాసాలు సాధారణమే అయినప్పటికీ యుద్ధం వేళ వీటి కసరత్తుపై రష్యా బహిరంగ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌ మిత్ర దేశాలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలకు దీటుగా పుతిన్‌ నుంచి ఈ హెచ్చరిక వచ్చినట్లు తెలుస్తోంది.

బ్రిటన్‌ సైనిక స్థావరాలపై దాడులు చేస్తాం

బ్రిటన్‌ అందించే ఆయుధాలతో రష్యా భూభాగాలపై ఉక్రెయిన్‌ దాడులకు దిగితే.. ఆ పరిస్థితి ఉక్రెయిన్‌లోని లేదా మరెక్కడైనా బ్రిటన్‌ సైనిక స్థావరాలు, ఆయుధాగారాలపై తాము దాడులకు దిగేలా ప్రేరేపిస్తుందని క్రెమ్లిన్‌ హెచ్చరించింది. ఈ మేరకు బ్రిటిష్‌ రాయబారితో రష్యా విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని