నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్‌

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు.

Updated : 07 May 2024 06:06 IST

మూడోసారి యాత్ర చేపడుతున్న భారత సంతతి వ్యోమగామి

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో సునీత.. మిషన్‌ పైలట్‌గా వ్యవహరించనున్నారు. ఆమెతో పాటు బుచ్‌ విల్‌మోర్‌ కూడా అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో వారం పాటు బసచేస్తారు. స్టార్‌లైనర్‌ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి.

వెంట గణనాథుడి విగ్రహం

తాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘గణేశుడు నా అదృష్ట దైవం. అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళతాను. నేను ఆధ్యాత్మికవాదిని. ఐఎస్‌ఎస్‌కు వెళ్తుంటే.. సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.  స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉందన్నారు. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదని చెప్పారు. రోదసిలో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టమని తెలిపారు. సునీత ఒక మారథాన్‌ రన్నర్‌. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్‌ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని