Drugs: ‘కుష్‌’ కోసం సమాధులు తవ్వుతున్నారు.. చేసేదిలేక ఎమర్జెన్సీ!

Drugs: మాదకద్రవ్యాల సమస్యలతో సియెర్రా లియోన్‌ దేశం సతమతమవుతోంది. పరిస్థితి చేయిదాటడంతో ఎమర్జెన్సీ విధించింది. డ్రగ్స్‌ తయారీలో వాడే మనుషుల ఎముకల కోసం దుండగులు అమానవీయ చర్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 09 Apr 2024 18:55 IST

ఫ్రీటౌన్‌: సాధారణంగా ఒక దేశంలో ఆర్థిక పరిస్థితి అదుపు తప్పితేనో, లేక రాజకీయ సంక్షోభం తలెత్తితేనో అత్యవసర పరిస్థితి విధిస్తారు. శాంతి భద్రతలు చేయి దాటిపోయినా కఠిన ఆంక్షలు అమలుచేస్తారు. కానీ, దేశ ప్రజలు డ్రగ్స్ మత్తులో ఊగిపోతున్నారని ఎమర్జెన్సీ విధించారని ఎప్పుడైనా విన్నారా? పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో (Sierra Leone) అదే జరిగింది. యువకుల్లో చాలామంది ఓ రకమైన మత్తు పదార్థం తీసుకొని వీధుల్లో పడిపోతున్నారు. పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో చేసేది లేక ఆ దేశ అధ్యక్షుడు జులియస్‌ బయో ఇటీవల అత్యవసర పరిస్థితిని విధించారు.

అంతా ‘కుష్‌’ మాయ..

కుష్‌ (Kush Drug) అనే మత్తుపదార్థమే సియెర్రా లియోన్‌ ఎదుర్కొంటున్న సమస్యకు ప్రధాన కారణం. ఇది దాదాపు ఆరేళ్ల క్రితం ఆ దేశంలోకి ప్రవేశించింది. నిత్యం అంతర్గత కల్లోలాలు, జాతుల మధ్య వైరం వంటి సమస్యలతో సతమతమయ్యే అక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు తక్కువ. దీంతో చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. దీనికి కుష్‌ తోడవటంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రధాన పట్టణాల వీధుల్లో ఎక్కడ చూసినా యువకులు దాని మత్తులో ఊగిపోతుండడం సర్వ సాధారణమైపోయింది.

శ్మశానాల్లో దొంగతనాలు..

కుష్‌ వివిధ రకాల మత్తు పదార్థాల మిశ్రమం. దీంట్లో మనిషి ఎముకలను కూడా వాడతారని స్థానికులు తెలిపారు. ఈ డ్రగ్‌కు డిమాండ్‌ పెరగడంతో డీలర్లు అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. దొంగలకు డబ్బులిచ్చి సమాధులను తవ్విస్తున్నారు. అస్థిపంజరాలను వెలికితీసి ఆ ఎముకలను తయారీదారులకు అందజేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వందలాది సమాధులను తవ్వినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రభుత్వం శ్మశానాల వద్ద భద్రతను ఏర్పాటుచేస్తోంది. ముఖ్యంగా ఫ్రీటౌన్‌ వంటి పెద్ద పట్టణాల్లో సమాధుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.

దేశ అస్థిత్వానికే ముప్పు..

వినాశకరమైన సింథటిక్ డ్రగ్ కుష్ వల్ల సియెర్రా లియోన్‌ (Sierra Leone) అస్థిత్వానికే ముప్పు ఏర్పడిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు బయో ఆందోళన వ్యక్తంచేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. డ్రగ్స్‌ తీసుకుంటున్న వారిలో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ప్రతీ డిస్ట్రిక్ట్‌లో డీ-అడిక్షన్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అలాగే డీలర్ల పని పట్టేందుకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సరఫరాను నిలిపివేయడమే సమస్య పరిష్కారానికి తొలిమెట్టని తెలిపారు.

వందలాది మంది మృత్యువాత..

ఇప్పటివరకు కుష్‌ వినియోగం వల్ల చనిపోయిన వారి సంఖ్య ఎంతనేది అధికారిక గణాంకాలేమీ లేవు. కానీ, ఇటీవల వందల మంది యువకులు ఈ డ్రగ్‌ కారణంగా అవయవాలు దెబ్బతిని మరణించారని వైద్యుడొకరు తెలిపారు. కుష్‌ వల్ల ముఖాలు వాచిపోయి శరీరమంతా గాయాలతో చాలామంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించారు. సియెర్రా లియోన్‌ సైకియాట్రిక్‌ హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య 2020 నుంచి 2023 మధ్య 4,000 శాతం పెరిగినట్లు చెప్పారు.     

అయితే, ఎమర్జెన్సీ ప్రకటనపై ఆ దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటినుంచి శాంతిభద్రతలపై దృష్టిసారిస్తే ఈ సమస్య తలెత్తేది కాదని కొందరు వాదిస్తున్నారు. పరిస్థితి చేయిదాటిన తర్వాత చర్యలు చేపట్టినా ఉపయోగం లేదంటున్నారు. మరికొందరేమో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. డ్రగ్స్‌ సమస్యను పరిష్కరించేందుకు ఎమర్జెన్సీ సరైన నిర్ణయమంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు