Suella Braverman: రిషి సునాక్‌ కీలక నిర్ణయం: సుయెల్లా బ్రేవర్మన్‌పై వేటు.. కేబినెట్‌లోకి మాజీ ప్రధాని

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించారు. 

Updated : 13 Nov 2023 17:30 IST

లండన్‌: బ్రిటన్‌ (Britain) ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak).. ఆ దేశ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ (Suella Braverman)ను పదవి నుంచి తొలగించారు. కొద్ది రోజుల క్రితం లండన్‌లో పాలస్తీనా మద్దతుదారులు చేపట్టిన ర్యాలీని నియంత్రించడంలో పోలీసుల తీరును విమర్శిస్తూ సుయెల్లా బ్రేవర్మన్‌ ఒక కథనాన్ని ప్రచురించారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆమె ఇతరులను రెచ్చగొట్టే విధంగా కథనాన్ని ప్రచురించారని, దానివల్లే పాలస్తీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున లండన్‌ వీధుల్లోకి వచ్చారని, ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌లు పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్రేవర్మన్‌ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ సోమవారం ప్రధాని సునాక్‌ నిర్ణయం తీసుకున్నారు.

బ్రిటన్‌ కేబినెట్‌లో సుయెల్లా బ్రేవర్మన్‌ సీనియర్‌ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వం గందరగోళ సమయాన్ని ఎదుర్కొంటోందని విమర్శలు చేశారు. అదే సమయంలో మైగ్రేషన్‌ అంశంపై అధికారిక పత్రాలకు సంబంధించి నిబంధనలను ఉల్లఘించినందుకు బాధ్యత వహిస్తూ.. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రిషి సునాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమెకు మద్దతుగా నిలిచి, ఇంటీరియర్‌ మినిస్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె ప్రచురించిన కథనం వివాదాస్పదం కావడంతో మరోసారి పదవి కోల్పోయారు. గతంలో ఆమె వలసదారులపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి.

డేవిడ్‌ కామెరాన్‌కు విదేశాంగ శాఖ..

మరోవైపు, మంత్రివర్గంలో రిషి సునాక్‌ కీలక మార్పులు చేశారు. సుయెల్లా బ్రేవర్మన్‌ స్థానంలో జేమ్స్‌ క్లేవర్లీకి హోం మంత్రిత్వ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక, విదేశాంగ శాఖ బాధ్యతలను మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌కు అప్పగించారు. కాగా.. ఓ మాజీ ప్రధాని, చట్టసభల్లో లేని నేతకు ఇలా కేబినెట్‌లో స్థానం కల్పించడం యూకే రాజకీయాల్లో అరుదైన సందర్భంగా. త్వరలోనే ఆయన ఎగువ సభకు నామినేట్‌ చేయనున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన దాదాపు ఏడేళ్ల తర్వాత.. కామెరాన్‌ మళ్లీ యూకే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు.

కామెరాన్‌ 2010 నుంచి 2016 వరకు యూకే ప్రధానిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వైదొలిగే అంశంపై 2016లో కామెరాన్‌ మూడు రెఫరండమ్‌లు తీసుకొచ్చారు. దీనిపై ఓటింగ్‌ చేపట్టగా.. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా యూకే ప్రజలు ఓటేశారు. బ్రిట‌న్ ఈయూలోనే కొన‌సాగాల‌ని కామెరాన్‌ గట్టిగా ప్రచారం చేసినప్పటికీ.. మెజార్టీ ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. దీంతో 2016లో జూన్‌లో కామెరాన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఆ సయమంలో రిషి సునాక్‌ కూడా బ్రెగ్జిట్‌కు మద్దతు ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని