Ukraine Crisis: అంతర్జాతీయ బాధ్యతల్ని నిర్వర్తిద్దాం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకొంది. అమెరికా, చైనాలు కొద్ది రోజులుగా పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో- ఆ దేశాల అధ్యక్షులు జో బైడెన్‌, జిన్‌పింగ్‌లు

Updated : 19 Mar 2022 05:55 IST

శాంతి స్థాపనకు కృషి చేద్దాం

బైడెన్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

వాషింగ్టన్‌/బీజింగ్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకొంది. అమెరికా, చైనాలు కొద్ది రోజులుగా పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో- ఆ దేశాల అధ్యక్షులు జో బైడెన్‌, జిన్‌పింగ్‌లు శుక్రవారం వీడియో ద్వారా దాదాపు 2గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం మనం కోరుకున్నది కాదని... ప్రపంచంలో శాంతి నెలకొనేలా అమెరికా-చైనాలు తమ అంతర్జాతీయ బాధ్యతలను కలిసికట్టుగా నిర్వర్తించాలని, ఆ దిశగా కృషి చేద్దామని జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. బైడెన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ- ‘‘రష్యాతో మాకున్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో ఉంచుకునే, ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ఖండించలేదు. ప్రపంచంలో శాంతి, సుస్థిరతలకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. విభేదాలు, ఘర్షణలు ఎవరికీ ప్రయోజనం కలిగించవు. శాంతి భద్రతలకు అంతర్జాతీయ సమాజం అత్యంత ప్రాధాన్యమివ్వాలి. తైవాన్‌, హాంకాంగ్‌, జింజియాంగ్‌, టిబెట్‌ తదితర అంశాల విషయంలో గందరగోళంలో పడిన అమెరికా-రష్యా సంబంధాలను మళ్లీ గాడిన పెట్టాల్సి ఉంది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న భారీ ఆర్థిక వ్యవస్థలుగా.. ఉభయ దేశాలు తమ సంబంధాలను సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది’’ అని జిన్‌పింగ్‌ అన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముగింపు పలికేందుకు అమెరికాతో కలిసి డ్రాగన్‌ కృషి చేయాలని జిన్‌పింగ్‌ ఆశిస్తున్నారా? అన్నది మాత్రం సుస్పష్టంగా తెలియరాలేదు. అమెరికా, చైనా రాయబారులు గత సోమవారం రోమ్‌లో భేటీ అయిన క్రమంలోనే బైడెన్‌, జిన్‌పింగ్‌లు వీడియో ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో బైడెన్‌.. జిన్‌పింగ్‌ మద్దతు కోరారు.

బీజింగ్‌ను నిలువరించేందుకే...

రష్యాకు సైనిక, ఆర్థిక సాయం అందించకుండా చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో నేతలిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. రష్యాకు మద్దతుగా నిలవడమే కాకుండా, ఉక్రెయిన్‌పై దాడిని ఎందుకు ఖండించలేదని జిన్‌పింగ్‌ను బైడెన్‌ ప్రశ్నిస్తారని ఈ భేటీకి ముందు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జెన్‌ సాకి తెలిపారు. అమెరికా-చైనాల మధ్య చాలాకాలంగా లుకలుకలున్నాయి. తైవాన్‌కు వ్యతిరేకంగా సైన్యాన్ని ఉసిగొల్పడం, మైనార్టీల హక్కులను కాలరాయడం, న్యాయవాదులపై ఉక్కుపాదం మోపడం వంటి విషయాల్లో బైడెన్‌ పదేపదే చైనాను తప్పు పడుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో- అమెరికా, చైనాల సంబంధాలు మరింత క్షీణించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని