రేపటి నుంచే భూముల కొత్త విలువ!

ప్రధానాంశాలు

రేపటి నుంచే భూముల కొత్త విలువ!

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలూ పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కొత్త విలువల అమలుకు రంగం సిద్ధమైంది. భూముల విలువతో పాటు పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలూ బుధవారం నుంచి అమల్లోకి వచ్చేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో భూములు విలువను ప్రాంతాలవారీగా పెంచారు. గరిష్ఠంగా 50 శాతం వరకు పెరగ్గా కనిష్ఠంగా 20 శాతం ఉంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువతో పాటు ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లకు కొత్త విలువలను నిర్ధారించారు. పెంచిన విలువల అమలుకు సంబంధించి మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. సవరించిన విలువలను సబ్‌రిజిస్ట్రార్లకు పంపగా వారు సమగ్రంగా పరిశీలించి ధ్రువీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్లు/ఆర్డీవోలు ఛైర్మన్‌గా, సబ్‌రిజిస్ట్రార్లు కన్వీనర్‌గా, తహసీల్దార్‌, ఎంపీడీవోఓలు, జిల్లా రిజిస్ట్రార్‌ సభ్యులుగా ఉన్న మార్కెట్‌ విలువల సవరణ కమిటీలు కూడా పరిశీలించి ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రంలోని జిల్లా రిజిస్ట్రార్‌లందరూ మార్కెట్‌ విలువల సవరణ అసలు(ఒరిజినల్‌) రిజిస్టర్‌లను మంగళవారం హైదరాబాద్‌లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. భూముల మార్కెట్‌ విలువల పెంపుతో పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను ప్రభుత్వం పెంచనుంది. 6 శాతం ఉన్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 7 లేదా 7.5 శాతానికి పెంచనున్నట్లు సమాచారం. ఆర్థికమంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక నేపథ్యంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుపై ఇటీవలి మంత్రివర్గ భేటీలో చర్చించారు. పెంచిన భూముల విలువ, పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని