అడ్డగోలు వినియోగాన్ని అడ్డుకోవలసిందే

ప్రధానాంశాలు

అడ్డగోలు వినియోగాన్ని అడ్డుకోవలసిందే

యాంటీబయాటిక్స్‌పై జాతీయ వైద్య కమిషన్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ ఔషధాలను వినియోగించడంతో వాటి సామర్థ్యం తగ్గిపోతోంది. కొన్ని సందర్భాల్లో ఆఖరి దశలో వినియోగించాల్సిన యాంటీబయాటిక్స్‌ను కూడా తొలిదశలోనే ఇచ్చేస్తున్నారు. ఫలితంగా వీటికి త్వరితగతిన నిరోధకత ఏర్పడుతోంది. దీంతో మున్ముందు అవసరమైన సందర్భాల్లో పనికి రాకుండా పోతాయనీ, ఇది పెనుముప్పుగా పరిణమిస్తోందని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆందోళన వెలిబుచ్చింది. యాంటీబయాటిక్స్‌ను అడ్డగోలుగా వినియోగించకుండా చూడాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రులకూ ఆదేశాలు జారీచేసింది.

నిర్వీర్యంగా కమిటీలు

యాంటీబయాటిక్స్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ 2017లో జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే అమలులో సమగ్రత లోపించినట్లు ఆరోగ్యశాఖ తాజాగా గుర్తించింది. కొన్ని ఆసుపత్రుల్లోనే యాంటీబయాటిక్స్‌ నిరోధక కమిటీలను నియమిచారు. అవి కూడా నామమాత్రంగా పనిచేస్తున్నాయి. ఆసుపత్రుల్లో సత్వర నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా వైద్యులు ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్‌ను ఇస్తున్నారు. కొవిడ్‌ చికిత్సలో ఈ ధోరణి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఇటీవలే జాతీయ వైద్య కమిషన్‌కు లేఖ రాశారు. బోధనాసుపత్రుల్లో యాంటీబయాటిక్స్‌ వినియోగాన్ని క్రమబద్ధీకరించాల్సిన అవసరముందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జాతీయ వైద్య కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సురేష్‌చంద్ర శర్మ తాజాగా ఆదేశాలు జారీచేశారు.

ఇవీ సూచనలు

అన్ని ఆసుపత్రుల్లోనూ యాంటీబయాటిక్స్‌ నిరోధక కమిటీని నియమించాలి.

ప్రతి బోధనాసుపత్రిలోనూ నిరంతరం పనిచేసే ల్యాబోరేటరీ ఉండాలి. తద్వారా పరీక్షల ఫలితాలు వెంటనే పొంది అవసరమైన యాంటీబయాటిక్స్‌ను ఇవ్వడానికి అవకాశముంటుంది.

ఏ ఇన్‌ఫెక్షన్‌కు..ఏ దశలో.. ఎటువంటి యాంటీబయాటిక్స్‌ను.. ఎంత మోతాదులో వినియోగించాలనే పట్టికను గోడలపై ప్రదర్శించాలి. వైద్యులకు, నర్సులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలి.
- ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు కూడా పెద్దపీట వేయాలి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని