వ్యక్తిగత ప్రయోజనాలు వీడి పార్టీని బలోపేతం చేయండి

ప్రధానాంశాలు

వ్యక్తిగత ప్రయోజనాలు వీడి పార్టీని బలోపేతం చేయండి

ఐక్యత, క్రమశిక్షణ విజయానికి సోపానాలు

పీసీసీ అధ్యక్షులకు సోనియా గాంధీ దిశానిర్దేశం

భాజపా, ఆరెస్సెస్‌ అసత్యాలను ఎండగట్టాలని పిలుపు

నవంబరు ఒకటి నుంచి కాంగ్రెస్‌ సభ్యత్వాల నమోదు

ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలోకి వస్తున్న రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ

ఈనాడు, దిల్లీ: ‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, కాంగ్రెస్‌ పార్టీ భావజాలాన్ని కాపాడే ప్రక్రియ... తప్పుడు వార్తలకు దీటుగా బదులివ్వడంతోనే ప్రారంభమవుతుంది. భాజపా, ఆరెస్సెస్‌ చేసే దుష్పచ్రారాన్ని సైద్ధాంతికంగానే ఎదుర్కోవాలి. ఈ యుద్ధంలో గెలవాలంటే వారి ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టి ప్రజల ముందు ఎండగట్టాలి. అందుకు పార్టీలో క్రమశిక్షణ, ఐక్యమత్యం ఉండాలి’ అని పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీ సూచించారు. వ్యక్తిగత స్వప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆమెÅ విస్పష్టం చేశారు. ఐక్యత, క్రమశిక్షణతోనే విజయాలు సాధించగలమని హితబోధ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ త్వరలో సంస్థాగత ఎన్నికలు, శిక్షణ కార్యక్రమాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మంగళవారం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పీసీసీ అధ్యక్షుల సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. రాహుల్‌ గాంధీ కూడా హాజరయ్యారు. ‘‘పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జులు, కొత్త సభ్యులే ఏ పార్టీకైనా జీవం. తమ ఆకాంక్షలకు గొంతుకనివ్వాలని దేశవ్యాప్తంగా ఉన్న యువతీ, యువకులు కోరుకుంటున్నారు. వారికి తగిన వేదిక కల్పించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందువల్ల పార్టీలోకి కొత్త సభ్యులను విరివిగా చేర్చుకోవాలి’’ అని సోనియా గాంధీ తెలిపారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే విషయానికి ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కి చెప్పారు. దేశంలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగ యువత, చిన్న మధ్య తరహా వ్యాపారులు, అణగారిన వర్గాల కోసం కాంగ్రెస్‌ పోరాటాన్ని రెట్టింపు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. దేశంలోని యువతీ యవకులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా గళమెత్తాలనుకుంటున్నారని, వారికి వేదిక ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనని సోనియా చెప్పారు. త్వరలో జరగబోయే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ కార్యకర్తలంతా సిద్ధమవుతున్నారు. సమాజంలోని అన్ని వర్గాలతో చర్చించి, స్వీకరించిన నిర్మాణాత్మక విధానాలు, కార్యక్రమాల ఆధారంగా మన ప్రచారం కొనసాగాలని పీసీసీ అధ్యక్షులకు ఆమె పిలుపునిచ్చారు.

సమావేశంలో తీర్మానించిన అంశాలివీ..

* నవంబరు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వరకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలి.

* ఓటు హక్కు వయసు వచ్చిన వారందర్నీ ఓటర్లుగా నమోదు చేయించాలి.

* కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలున్న ప్రాంతాలకు వెళ్లి వారి సంక్షేమం కోసం ఇదివరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాలు చేపట్టిన విధానాలను వివరించాలి.

* వ్యవసాయ రంగం, కోట్లాది మంది రైతులపై ప్రభుత్వం చేస్తున్న దాడికి వ్యతిరేకంగా పోరాడాలి.

* పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, వంటనూనెలు, భవన నిర్మాణ వస్తువుల ధరలు, నిరుద్యోగం అసాధారణ పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలి.

* నవంబరు 14 నుంచి 29వ తేదీవరకు పార్టీ తలపెట్టిన జన్‌జాగరణ్‌ అభియాన్‌ను విజయవంతం చేయాలి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని