రామప్ప సందర్శనకు అధికారుల కమిటీ

ప్రధానాంశాలు

రామప్ప సందర్శనకు అధికారుల కమిటీ

యునెస్కో షరతులు పూర్తిచేయడంపై దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: ములుగు జిల్లా పాలంపేటకు వెళ్లి రామప్ప ఆలయాన్ని పరిశీలించాలని అధికారుల కమిటీ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏర్పాటైన కేంద్ర, రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు, రెవెన్యూ అధికారితో కూడిన కమిటీ తొలి భేటీ బుధవారం జరిగింది. కేంద్ర పురావస్తుశాఖ(ఏఎస్‌ఐ) సూపరింటెండెంట్‌ నోడల్‌ అధికారిగా, ములుగు జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటైంది. ఆన్‌లైన్‌లో జరిగిన సమావేశంలో రామప్ప ఆలయ సంరక్షణ, నిర్వహణ ప్రణాళికపై ప్రాథమికంగా చర్చించారు. త్వరలో ఆ ఆలయానికి వెళ్లి రావాలని కమిటీ నిర్ణయించింది. రామప్పకు వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవాలని, యునెస్కో షరతులను పూర్తిచేయాలని, అధికారుల కమిటీ ఆగస్టు 4న మొదటి సమావేశం నిర్వహించాలని హైకోర్టు ఇటీవల ఆదేశించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయాన్ని పరిశీలించాక అక్కడ చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించాలని.. ఈనెల 25 కల్లా హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ఆలయ సరిహద్దుల గుర్తింపు, భక్తులకు సౌకర్యాలు వంటి పదికి పైగా షరతుల్ని యునెస్కో విధించింది. 2022 డిసెంబరు 31లోపు వీటిని అమలుచేయాల్సి ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని