అరటి తొక్కతో అందంగా! - beauty benefits of banana peel in telugu
close
Updated : 13/07/2021 20:11 IST

అరటి తొక్కతో అందంగా!

ఆరోగ్యాన్నిచ్చే అరటిపండ్లతో ముఖ సౌందర్యాన్నీ పెంపొందించుకోవచ్చన్న సంగతి తెలిసిందే! అయితే వృథా అని తీసిపడేసే అరటి తొక్కతోనూ అందాన్ని ఇనుమడింపజేసుకోవచ్చన్ని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలా సాధ్యమో తెలుసుకుందాం రండి..

అరటి తొక్కలో ‘బి6’, ‘బి12’ విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్‌, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అంతేకాదు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-సి చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.

మాస్క్‌తో మెరుపు!

అరటి తొక్కలో చర్మ పోషణకు సహకరించే ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక అరటి పండు తొక్కను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. ఇందులో రెండు చిన్నగా కట్‌ చేసిన అరటి పండు ముక్కల్ని కూడా చేర్చి మిక్సీ పట్టుకోవాలి. ఆపై రెండు టేబుల్‌ స్పూన్ల పాలు కలిపి మళ్లీ గ్రైండ్‌ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపై బయటకు తీసి ముఖం, మెడ భాగాల్లో అప్లై చేసుకోవాలి. అరగంట పాటు ఉంచుకొని ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

మృతకణాలు పోవాలంటే..!

మృతకణాలు, జిడ్డుదనం.. ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటప్పుడు అరటితొక్కతో ముఖాన్ని, మెడను నెమ్మదిగా, మృదువుగా రుద్దుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా పది నిమిషాల పాటు రుద్దుకున్నాక.. అరగంట పాటు అలాగే ఉంచుకొని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల క్రమంగా మృతకణాలు తొలగిపోతాయి.. జిడ్డుదనమూ తగ్గుతుంది. అంతేకాదు.. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే కొలాజెన్‌ని ఉత్పత్తి చేయడంలో అరటితొక్క సమర్థంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. చర్మాన్ని బిగుతుగానూ మార్చుతుంది. తద్వారా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నవయవ్వనంగా మెరిసిపోవచ్చు.

కళ్ల కింద వలయాలా?

ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ని ఎక్కువ సేపు ఉపయోగించడం, పని ఒత్తిడి, నిద్రలేమి.. వీటి ప్రభావం కళ్ల పైనే నేరుగా పడుతుంది. తద్వారా కళ్లు అలసిపోయి ఉబ్బడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా కంటి సమస్యలు కూడా అందాన్ని దెబ్బతీస్తాయి. అయితే వీటి నుంచి విముక్తి పొందాలంటే అది అరటి తొక్కతోనే సాధ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కంటి కింద పెట్టుకునేలా చిన్న ముక్కలుగా కట్‌ చేసిన రెండు అరటి తొక్కల్ని పావుగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపై వాటిని కళ్ల కింద పెట్టుకొని అరగంట పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే కంటి సమస్యలన్నీ తొలగిపోయి.. అటు కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇటు అందంగానూ కనిపించేయచ్చు.

మెరిసే పలువరుస!

తళతళ మెరిసే దంతాలు అందాన్ని ఇనుమడిస్తాయి. అయితే మన ఆహారపుటలవాట్లు, నోటి శుభ్రత లోపించడం వల్ల అవి పసుపు రంగులోకి మారడం, చిగుళ్లలో వాపు.. వంటి దంత సమస్యలు ఎదురవుతాయి. మరి, వాటన్నింటికీ చెక్‌ పెట్టి మెరిసే పలువరుసను సొంతం చేసుకోవాలంటే అరటి తొక్కతో కాసేపు దంతాలపై రుద్దితే సరి! ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు దంత సమస్యల్ని దూరం చేస్తాయి. ఈ చిట్కాను వారం పాటు రోజూ పాటిస్తే పళ్లు మేలిమి మెరుపును సొంతం చేసుకుంటాయి.

చుండ్రును తగ్గిస్తుంది!

ముఖ సౌందర్యానికే కాదు.. జుట్టు ఆరోగ్యానికీ అరటితొక్క మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చుండ్రు సమస్య నుంచి ఇది విముక్తి కలిగిస్తుందట! ఇందుకోసం అరటి తొక్క లోపలి లేయర్‌ని స్పూన్‌ సహాయంతో తీసి.. దీనికి కొన్ని కొబ్బరి పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై ఇందులో టేబుల్‌స్పూన్‌ చొప్పున పెరుగు, కొబ్బరి నూనెతో పాటు కొద్దిగా తేనె కూడా కలుపుకొని మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ హెయిర్‌మాస్క్‌ను కుదుళ్లు, జుట్టుకు పట్టించి అరగంట పాటు ఉంచుకొని ఆపై తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందచ్చు.

 

ఇవి కూడా!

* ప్రతిరోజూ 10 నిమిషాల పాటు అరటితొక్కతో పెదాల్ని మృదువుగా మర్దన చేయడం వల్ల.. అవి మృదువుగా మారతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పెదాలపై వాపును తగ్గించడంలో తోడ్పడతాయి.

* అరటితొక్కలో పొటాషియం, తేమ నిండి ఉంటాయి. ఇవి పొడిబారిన చర్మానికి తేమనందించి మృదువుగా మార్చడంలో సహకరిస్తాయి.

* మొటిమల సమస్యకు అరటి తొక్క చక్కటి పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ తొక్కతో కాసేపు ముఖంపై రుద్దుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు.

* అరటి తొక్కతో కుదుళ్లకు మర్దన చేయడం వల్ల అందులోని సిలికా కుదుళ్ల చర్మంలోకి ఇంకి కొలాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.

* ఒత్తిడి ప్రభావం జుట్టు పైనా పడుతుంది. తద్వారా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం, నిర్జీవమైపోవడం.. వంటి సమస్యలొస్తాయి. వీటికి చెక్‌ పెట్టాలంటే అరటి తొక్కతో కుదుళ్లను మర్దన చేయడమే సరైందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్లలోకి ఇంకి వాటిని దృఢంగా మార్చుతాయి.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని