కంగారూ కేర్: ఆ నులివెచ్చటి స్పర్శ వల్ల తల్లీబిడ్డలకు ఎన్ని ప్రయోజనాలో! - dear moms all you need to know about this mother baby bonding method kangaroo care in telugu
close
Updated : 15/07/2021 17:10 IST

కంగారూ కేర్: ఆ నులివెచ్చటి స్పర్శ వల్ల తల్లీబిడ్డలకు ఎన్ని ప్రయోజనాలో!

తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, నెలలు నిండకుండానే జన్మించిన చిన్నారుల్ని కొన్నాళ్ల పాటు ఇంక్యుబేటర్‌లో పెట్టడం మనకు తెలిసిందే! అయితే ఇప్పుడంటే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.. మరి, పాత కాలంలో ఇలాంటి నవజాత శిశువుల్ని సంరక్షించడానికి ఏం చేసేవారు? అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. అందుకు సమాధానమే ఈ ‘కంగారూ మదర్‌ కేర్‌’. నిజానికి ఇప్పుడిప్పుడే ఈ పద్ధతికి మన దేశంలో ఆదరణ పెరుగుతున్నప్పటికీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇది ఎప్పట్నుంచో అందుబాటులో ఉందని చెప్పచ్చు. ఇందులో భాగంగా తల్లి నులివెచ్చటి స్పర్శ ద్వారా బిడ్డలోని అనారోగ్యాలు దూరమవడమే కాదు.. తల్లీబిడ్డల మధ్య అనుబంధమూ రెట్టింపవుతుందంటున్నారు నిపుణులు. అందుకే పిల్లలు తల్లిపాలు తాగకపోయినా, వారిలో రోగనిరోధక శక్తి పెరగాలన్నా ప్రస్తుతం డాక్టర్లు ఇదే పద్ధతిని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఈ పద్ధతిని ఎలా పాటించాలి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? మనమూ తెలుసుకుందాం రండి..

కంగారూ మదర్‌ కేర్‌.. కంగారూ తన పిల్లల్ని ఎలాగైతే తన పాకెట్‌లో దాచుకుంటుందో.. అలాగే తల్లి కూడా తన బిడ్డను పొత్తిళ్లకు హత్తుకోవడమే ఈ పద్ధతి ముఖ్యోద్దేశం. నిజానికి ఈ పద్ధతి మన దేశంలోకి ప్రవేశించి కొన్నాళ్లే అయినా.. పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉందని చెప్పచ్చు. కొలంబియాలోని బొగొటాలో ఓ ఆస్పత్రిలో దీన్ని మొదటిసారి ఉపయోగించారట! ఆ ఆస్పత్రిలో ఎక్కువమంది చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు రావడం, దాంతో ఇంక్యుబేటర్ల కొరత ఏర్పడడం వల్ల ఆ తల్లీపిల్లలతో కంగారూ కేర్‌ పద్ధతిని పాటింపజేశారు. దీంతో పిల్లలకు ఇంక్యుబేటర్ల అవసరం గణనీయంగా తగ్గిందని.. ఈ పద్ధతి వల్ల శిశు మరణాల రేటు 70 నుంచి 30 శాతానికి పడిపోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. దీంతో ఇతర దేశాల్లోని వైద్యులూ తమ ఆస్పత్రుల్లో ఈ పద్ధతిని అమలు చేయడం మొదలుపెట్టారు.

ఎలా చేయాలి?

నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారులు, తక్కువ బరువుండే శిశువులకు ఈ పద్ధతి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా..

* తల్లి ముందు వైపు బటన్స్‌ ఉండే (ఫ్రంట్‌ ఓపెనింగ్‌) టాప్‌ వేసుకోవాలి. బిడ్డకు కూడా డ్రస్‌ పూర్తిగా తొలగించాలి.. డైపర్‌ ఉంచినా పర్లేదు.

* పాపాయిని చేతుల్లోకి తీసుకునే ముందు తల్లి సబ్బు నీటితో చేతుల్ని కడుక్కోవడం లేదంటే శానిటైజ్‌ చేసుకోవడం మర్చిపోకూడదు. 

* ఆ తర్వాత బిడ్డను తల్లి తన రెండు రొమ్ముల మధ్య పడుకోబెట్టుకోవాలి. ఆపై బేబీని తల్లి తన డ్రస్‌తో ర్యాప్‌ చేసేయాలి. అంటే ఒకే టాప్‌లో తల్లీబిడ్డా ఒదిగిపోవడమన్నమాట!

* ఈ పొజిషన్‌లో కాసేపు సేదదీరాలి. ఈ పద్ధతిని సోఫాకు బదులుగా మంచంపై పడుకొని చేస్తే బిడ్డ అటూ ఇటూ దొర్లకుండా, కంఫర్టబుల్‌గా ఉంటుంది.

కేవలం తల్లులే కాదు.. తండ్రులు కూడా తమ బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ఈ పద్ధతిని ఫాలో కావచ్చంటున్నారు నిపుణులు. ఇలా రోజుకి కనీసం ఓ గంటసేపైనా చేయడం మంచిదని చెబుతున్నారు. అయితే శిశువుల్లో ఇతరత్రా తీవ్ర అనారోగ్యాలున్నా, మరీ ముందు నెలల్లో జన్మించిన పిల్లల విషయంలో ఈ పద్ధతి పనిచేయదంటున్నారు. ఏదేమైనా ఓసారి ముందుగా వైద్యుల సలహా తీసుకున్నాకే ఈ కంగారూ కేర్‌ పద్ధతిని ఇంట్లో రోజూ ప్రాక్టీస్‌ చేయడం మరీ మంచిది!

 

తల్లీబిడ్డలిద్దరికీ ఎన్నో ప్రయోజనాలు!

కంగారూ మదర్‌ కేర్‌ పద్ధతిలో భాగంగా తల్లి శరీరంలోని వెచ్చదనం పాపాయికి తాకుతుంది. ఈ స్పర్శ తల్లీబిడ్డలిద్దరికీ బోలెడన్ని ప్రయోజనాల్ని అందిస్తుందంటున్నారు నిపుణులు.

* నెలలు నిండకుండా జన్మించిన చిన్నారుల్లో శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. తద్వారా వారిలో జీవక్రియల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి వారి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేయడానికి తల్లి గర్భంలో ఉన్నట్లుగా వెచ్చదనాన్ని చిన్నారికి అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంగారూ కేర్‌ పద్ధతి చక్కగా దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు.

* ఇంక్యుబేటర్‌లో ఉంచిన నవజాత శిశువుల కంటే కంగారూ కేర్‌ పద్ధతిలో సంరక్షించిన నవజాత శిశువుల్లో.. వారి కౌమార దశలో మెదడు పనితీరు అద్భుతంగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.

* తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులు బరువు పెరగడానికీ ఈ పద్ధతి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తల్లి శరీరం నుంచి వారికి వెచ్చదనం అందుతుంది కాబట్టి వారి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శక్తి అవసరం ఉండదు. కాబట్టి ఆ శక్తి వారి ఎదుగుదలకు ఉపయోగపడి క్రమంగా వారు బరువు పెరుగుతారట!

* కొంతమంది పిల్లలు ఎంత ప్రయత్నించినా తల్లిపాలు తాగరు. అలాంటి చిన్నారులకు ఈ పద్ధతి చక్కగా దోహదం చేస్తుందట! అదెలాగంటే.. పసి పిల్లలకు సహజంగానే తమ తల్లి వాసనను పసిగట్టే సామర్థ్యం ఉంటుందట! దాంతో బిడ్డను ఛాతీపై పడుకోబెట్టుకున్నప్పుడు వారు చనుమొనల్ని వెతికి.. తద్వారా వారికి పాలు తాగడం అలవాటవుతుందని చెబుతున్నారు నిపుణులు.

* పసిపిల్లల్లో ఉండే శ్వాస సంబంధిత సమస్యల్ని దూరం చేయడానికి శ్వాస సంబంధిత పరికరాలకు బదులుగా కంగారూ కేర్‌ పద్ధతిని ఉపయోగిస్తే 48 గంటల్లోనే మెరుగైన ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ పద్ధతి వల్ల వారిలో గుండె కొట్టుకునే రేటు నియంత్రణలోకి వచ్చి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని మరో అధ్యయనంలో రుజువైంది.

* నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.. అలాగే వారు పాలు కూడా సరిగ్గా తాగలేరు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలంటే కంగారూ కేర్‌ పద్ధతిని మించింది మరొకటి లేదట!

* కంగారూ కేర్‌ వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్లు తగ్గిపోయి.. క్రమంగా చనుబాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు నిపుణులు. ఇలా ఎక్కువ పాలు ఉత్పత్తయితే.. చిన్నారికి పోత పాలు పట్టాల్సిన అవసరం ఉండదు. తద్వారా పసి వారిలోనూ ఇమ్యూనిటీ పెరుగుతుంది.

* పసి పిల్లలు ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత త్వరగా పెరుగుతారంటారు. అయితే నెలలు నిండకుండా జన్మించిన పిల్లలకు తల్లి శరీర స్పర్శ, ఆ వెచ్చదనం వారిలో నిద్రను మరింతగా ప్రేరేపిస్తుందట! ఇలా రోజుకు పది నిమిషాలు పడుకోబెట్టుకున్నా చాలంటున్నారు నిపుణులు.

* తల్లుల్లో ప్రసవానంతర ఒత్తిడిని తగ్గించడానికి కంగారూ కేర్‌ పద్ధతి తోడ్పడుతుందని ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. ఇలా తల్లీబిడ్డలిద్దరి శరీరాలు తాకడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గి.. లవ్‌ హార్మోన్‌ ఆక్సిటోసిన్‌ విడుదలవుతుంది.. ఇది మనసును ప్రశాంతపరుస్తుంది. ఇలా ప్రసవానంతర ఒత్తిడి, ఆందోళనలకు చెక్‌ పెట్టచ్చు.

 
రోజుకు ఒకటి లేదా రెండుసార్లు.. కనీసం గంట నుంచి రెండు గంటల పాటు తల్లిదండ్రులిద్దరూ తమ చిన్నారితో ఈ పద్ధతిని పాటించచ్చంటున్నారు నిపుణులు. అలాగని ఈ సమయంలో ఫోన్‌ మాట్లాడడం, టీవీ చూడడం, మొబైల్‌లో గేమ్స్‌ ఆడడం.. వంటి పనులు చేయకుండా, పూర్తిగా పాపాయితోనే గడిపేందుకు కేటాయించమంటున్నారు. తద్వారా ఇటు మీ చిన్నారి, అటు మీరు ఇద్దరూ రిలాక్సవుతారు. ఇది తల్లీబిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుంది.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని