వర్చువల్‌ మీటింగ్‌లో ఇలా మెరిసిపోదాం! - simple makeup tips for virtual meetings in telugu
close
Updated : 18/06/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్చువల్‌ మీటింగ్‌లో ఇలా మెరిసిపోదాం!


ఇంట్లో ఎలా ఉన్నా బయటికెళ్దామనుకున్నప్పుడు మాత్రం అందంగా రడీ అయిపోతారు ఆడవారు. వీలు చేసుకొని మరీ మేకప్‌ వేసుకోవడానికి కాస్త సమయం కేటాయిస్తారు. కానీ ఎప్పుడైతే ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు వచ్చిందో అప్పట్నుంచి తమ అందాన్ని పట్టించుకోవడం దాదాపు మానేశారు చాలామంది అమ్మాయిలు. వర్చువల్‌ మీటింగ్స్‌లో, వీడియో కాల్స్‌ చేసినప్పుడు కూడా ఏదో అలా పైపైన రడీ అయిపోయి ల్యాపీ ముందు వాలిపోతున్నారు. నిజానికి ఇది ప్రొఫెషనలిజం కానే కాదంటున్నారు నిపుణులు. ఇంటి నుంచి పని చేసినా డ్రస్సింగ్‌, బ్యూటీ విషయాల్లో అస్సలు రాజీ పడకూడదంటున్నారు. అప్పుడే మనలోని ప్రొఫెషనలిజం, వృత్తి పట్ల నిబద్ధత బయటపడతాయంటున్నారు. మరి, ఈ నేపథ్యంలో వర్చువల్‌ మీటింగ్స్‌/వీడియో కాల్స్‌లో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు అందంగా, హుందాగా కనిపించాలంటే ఎలాంటి మేకప్‌ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం రండి..
వృత్తిరీత్యా, వ్యక్తిగతంగా కొంతమంది అమ్మాయిలకు మేకప్‌ వేసుకోవడం అనేది నిత్యకృత్యం. అలాకాకుండా మరికొంతమంది బేసిక్‌ మేకప్‌ టిప్స్‌తో తమ అందానికి మెరుగులద్దుతుంటారు. ఈ అలవాటును బయటికి వెళ్లినప్పుడే కాదు.. ఇంటి నుంచి పనిచేసినా కొనసాగించమంటున్నారు నిపుణులు. అప్పుడే పూర్తి ఆసక్తితో పనిచేస్తున్నామని అవతలి వారికి అర్థమవుతుందట!

మాయిశ్చరైజర్‌తో మెరుపు!
మేకప్‌ వేసుకోవాలన్న ఆరాటం అందరికీ ఉండదు. కానీ వర్చువల్‌ మీటింగ్స్‌లో మాత్రం అందంగా, ప్రకాశవంతంగా మెరిసిపోవాలనుకుంటారు. అలాంటి వారి వద్ద కేవలం మాయిశ్చరైజర్‌ ఉంటే చాలంటున్నారు సౌందర్య నిపుణులు. నిర్జీవమైపోయిన చర్మాన్ని తిరిగి ప్రకాశవంతంగా మార్చే శక్తి దీనికి ఉంది. అలాగే మోముకు మెరుపునూ ఇస్తుందిది. అందుకే మీటింగ్‌/రోజువారీ పని ప్రారంభమయ్యే కొన్ని నిమిషాల ముందు కాస్త మాయిశ్చరైజర్‌తో ముఖానికి టచప్‌ ఇస్తే.. ఇక ఆ మెరుపు సాయంత్రం దాకా అలాగే ఉంటుంది. అయితే అసలే ఇది ఎండాకాలం అన్న విషయం మర్చిపోవద్దు. ఈ సమయంలో హ్యుమిడిటీని తట్టుకుంటూ చర్మం కాంతిమంతంగా కనిపించాలంటే జెల్‌ ఆధారిత మాయిశ్చరైజర్స్‌ చక్కటి ఎంపిక అంటున్నారు నిపుణులు. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతూనే.. జిడ్డుదనాన్ని దరిచేరనివ్వవట! పైగా ఇలా కేవలం మాయిశ్చరైజర్‌ ఒక్కటే రాసేసుకుంటే చిటికెలో రడీ అయిపోవచ్చు.. అందంగానూ మెరిసిపోవచ్చు.

ఫౌండేషన్‌తో వాటిని దాచేయండి!
ఒత్తిడి, ఆందోళనలు, నిద్రలేమి, నిరంతరాయంగా కంప్యూటర్‌ ముందే గడపడం.. ఇవన్నీ మనలోని సహజ సౌందర్యాన్ని దూరం చేస్తున్నాయి. ఫలితంగా మొటిమలు, మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు.. ఏర్పడుతున్నాయి. మరి, వీటిని దాచేయాలంటే అది మేకప్‌తోనే సాధ్యమవుతుంది. అయితే ఈ ఎండాకాలంలో ఇంట్లో ఉన్న వారు చాలామంది మేకప్‌కు దూరంగా ఉంటారు. అలాంటివారు కేవలం ఫౌండేషన్‌ క్రీమ్‌తో చక్కటి మెరుపును సొంతం చేసుకోవచ్చు. పైగా మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు.. వంటివన్నీ ఈ క్రీమ్‌ వెనకాలే ఉండిపోయి పైకి కనిపించవు. అలాగని మరీ ఎక్కువగా ఫౌండేషన్‌ వేసుకున్నా ఎబ్బెట్టుగా ఉంటుంది.. కాబట్టి అలా పైపైన టచప్‌ ఇస్తే సహజసిద్ధమైన మెరుపు మీ సొంతమవుతుంది. ఇక వేసవిని దృష్టిలో ఉంచుకొని చెమట వల్ల అందం చెరిగిపోకుండా ఉండేందుకు లిక్విడ్‌ తరహా/Sweatproof ఫౌండేషన్స్‌ని ఎంచుకోమంటున్నారు నిపుణులు.

‘లిప్‌’బామ్‌ చాలు!
మేకప్‌లో భాగంగా అధరాల్నీ అందంగా తీర్చిదిద్దుకోవడం అతివలకు అలవాటే! అయితే ఈ క్రమంలో అందరికీ అన్ని షేడ్స్‌ నప్పవు. ఫెయిర్‌గా ఉన్న వారికి డార్క్‌ కలర్స్‌, కాస్త ఛాయ నలుపు ఉన్న వారికి లేత రంగు లిప్‌స్టిక్‌ అయితే బాగుంటుంది. పైగా కూల్‌ లుక్‌లో కనిపించేయచ్చు కూడా! లిప్‌స్టిక్‌ వేసుకునేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోమంటున్నారు నిపుణులు. ఇక లిప్‌స్టిక్‌ వేసుకోవడం ఇష్టం లేని వారు, ఈ వేసవిలో అది మరింత అసౌకర్యంగా ఉంటుందనుకునే వారు లిప్‌బామ్‌తో సరిపెట్టేసుకోవచ్చు. ఈ క్రమంలో లిప్‌ కలర్‌/లేత రంగుల్లో, కాస్త షైనీగా ఉండే లిప్‌బామ్‌ని ఎంచుకుంటే సహజసిద్ధమైన లుక్‌ మీ సొంతమవుతుంది.

కళ్లకు ‘కర్వీ’ లుక్‌!
మన మనసులోని భావాలన్నీ కళ్లలోనే పలుకుతాయంటారు. అలాగే మనం డల్‌గా ఉన్నామా, చురుగ్గా పనిచేస్తున్నామా అనేది కూడా కళ్లను బట్టే తెలిసిపోతుంది. అలాంటప్పుడు వాటిని అలాగే వదిలేస్తే.. ఎంత మేకప్‌ వేసుకున్నా వృథానే అవుతుంది. కాబట్టి కళ్లకూ మేకప్‌తో కాస్త టచప్‌ ఇవ్వాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ముఖానికి మేకప్‌ అంతా లైట్‌గా చేసుకొని, కళ్లకు మాత్రం హెవీ చేసుకుంటే లుక్‌ పూర్తిగా చెడిపోతుంది. అందుకే కళ్లకు కాటుక పెట్టుకున్నా పెట్టుకోకపోయినా.. కళ్ల చివర ఐ లైనర్‌తో కర్వీగా సెట్‌ చేసుకుంటే ఆ లుక్కే వేరు! అలాగే కనురెప్పల వెంట్రుకల్ని కూడా కాస్త వంపులు తిరిగేలా తీర్చిదిద్దుకోవాలి. దీంతో ఇటు సింపుల్‌గా, అటు స్టైలిష్‌గా కనిపించేయచ్చు.. కంటి అందం కూడా ఇనుమడిస్తుంది.

ఇవి కూడా!


* మేకప్‌ అంతా పూర్తయింది.. కానీ బుగ్గలే బోసిపోతున్నాయనిపిస్తోందా..? అయితే అక్కడ కాస్త బ్లష్‌ అప్లై చేస్తే సరి! అది కూడా చర్మంలో కలిసిపోయేలా లేత రంగు షేడెడ్‌ బ్లష్‌ అయితే మరీ మంచిది.
* కనుబొమ్మలు మరీ లైట్‌గా ఉన్నాయనుకునే వారు.. పెన్సిల్‌తో కాస్త డార్క్‌గా తీర్చిదిద్దుకోవచ్చు.. అలాగని మరీ డార్క్‌గా, వెడల్పుగా పెట్టుకుంటే వాటి సహజత్వం పోయి ఎబ్బెట్లుగా కనిపిస్తుంది.
* మేకప్‌కు తగ్గట్లుగా, వేసవిలో సౌకర్యవంతంగా ఉండేలా.. ఓ చక్కటి బన్‌ హెయిర్‌స్టైల్‌, వదులైన కాటన్‌ దుస్తులతో మీ లుక్‌ని పూర్తిచేస్తే వర్చువల్‌ మీటింగ్‌లో మరింత హుందాగా మెరిసిపోవచ్చు. టీమ్‌ మొత్తానికీ మీరే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవచ్చు.
* ఇంత కష్టపడి మేకప్ వేసుకొని.. సరైన వెలుతురు లేని ప్రదేశంలో కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి.. అందుకే వీలైతే బయటి నుంచి సహజ వెలుతురు వచ్చే ప్రదేశంలో (కిటికీలు, తలుపుల దగ్గర), రాత్రిపూట అయితే లైట్‌ వెలుతురు మీ ముఖంపై పడేలా మీ డెస్క్‌ని సెట్‌ చేసుకుంటే అందంగా, కంఫర్టబుల్‌గా మెరిసిపోవచ్చు!

గమనిక: మేకప్‌ మీ చర్మానికి పడని వారు, చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ఉత్పత్తులు వాడాలో అవగాహన లేని వారు ముందుగా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. తద్వారా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తపడచ్చు.


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని